సురేష్ రైనా కుటుంబ సభ్యులను చంపిన కేసును చేధించిన పోలీసులు
By న్యూస్‌మీటర్ తెలుగు Published on 16 Sep 2020 11:53 AM GMTచండీఘడ్: భారత జట్టు మాజీ క్రికెటర్ సురేష్ రైనా కుటుంబ సభ్యులను చంపిన వారిని పట్టుకున్నామని పంజాబ్ పోలీసులు వెల్లడించారు. పఠాన్ కోట్ లో మొత్తం ముగ్గురు వ్యక్తులను పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. వీరందరూ ఇంటర్ స్టేట్ దొంగతనాలకు బాగా అలవాటు పడిన వారని పోలీసులు వెల్లడించారు. మరికొందరిని పట్టుకోవాల్సి ఉందని పోలీసులు తెలిపారు.
పఠాన్ కోట్ గ్రామంలో కొందరు దొంగలు రైనా బంధువుల ఇంటి లోకి చొరబడి వారి మీద దాడి చేశారు. ఆ దొంగలు బంగారం, డబ్బుతో అక్కడి నుండి పారిపోయారు. సురేష్ రైనా మామ అయిన అశోక్ కుమార్ బోర్డర్ సెక్యూరిటీ ఫోర్స్ కాంట్రాక్టర్ గా పనిచేస్తూ ఉండేవాడు. దొంగల దాడిలో ఆయన అక్కడికక్కడే మరణించాడు. అశోక్ కుమార్ కొడుకు కౌశల్ కుమార్ కు గాయాలు అవ్వగా మరో ఇద్దరు మహిళలకు తీవ్ర గాయాలు అయ్యాయి. గాయపడిన మరో ఇద్దరు ఇటీవలే ఆసుపత్రి నుండి డిశ్చార్జ్ అయ్యారు.
విషయం తెలియగానే రైనా యునైటెడ్ అరబ్ ఎమిరేట్స్ నుండి భారత్ కు చేరుకున్నాడు. తన ట్విట్టర్ ఖాతాలో ఈ ఘటనకు సంబంధించిన విచారణ జరపాలని రైనా కోరడంతో ముఖ్యమంత్రి అమరీందర్ సింగ్ సిట్ విచారణకు ఆదేశించారు. సిట్ విచారణలో కొన్ని సాక్ష్యాలను అధికారులు సేకరించారు. 100కి పైగా విచారించారు. మంగళవారం నాడు సిట్ బృందానికి ముగ్గురు అనుమానితులు పఠాన్ కోట్ రైల్వే స్టేషన్ దగ్గర ఉన్న మురికివాడల్లో నివసిస్తూ ఉన్నారని సమాచారం అందింది. వెంటనే సిట్ బృందం అక్కడికి వెళ్లి వారిని పట్టుకుంది. వారి దగ్గర ఉన్న వస్తువుల్లో బంగారం రింగ్ ఉంది.. దానికి ఏకే అనే లెటర్స్ ఉన్నాయి.. ఒక మహిళలు వేసుకునే రింగ్.. ఇంకొక గోల్డ్ చైన్, 1530 రూపాయల డబ్బులను రికవరీ చేశారు.
సిట్ బృందం పట్టుకున్న ముగ్గురు సావన్ అలియాజ్ మాచింగ్, ముహబ్బత్, షారుఖ్ ఖాన్ లు గా గుర్తించారు. సావన్ ఉత్తరప్రదేశ్ కు చెందిన వాడు కాగా.. మిగిలిన ఇద్దరు రాజస్థాన్ కు చెందిన వారు. విచారణలో తాము ఇలాంటి దొంగతనాలను పలు ప్రాంతాల్లో చేశామని.. ఉత్తర ప్రదేశ్, జమ్మూ కాశ్మీర్, పంజాబ్ రాష్ట్రాలలో ఇలాంటి దొంగతనాలు చేశామని.. తమ గ్రూప్ లో మరికొంత మంది కూడా ఉన్నారని తెలిపారు.
ఆగస్టు 12న నౌసౌ ఆటోలో రాజస్థాన్‌లోని చిరావా నుంచి పిలానీకి వెళ్లాం. అక్కడ మరికొందరితో కలిసి లుథియానా చేరుకున్నాం. అక్కడ మరో ముగ్గురు మాతో కలిశారు. లుథియానాలోని ఓ హార్డ్‌వేర్ షాప్ నుంచి కటింగ్ ప్లేయర్, స్క్రూడ్రైవర్ వంటి పరికరాలను.. కొన్ని బట్టలను కూడా కొన్నామని తెలిపారు. ఇక పఠాన్‌కోట్ ప్రాంతం గురించి బాగా తెలిసిన సంజూ అనే వ్యక్తి మాతో కలిశాడు. మేమంతా కలిసి ఆ ప్రాంతంలో రెక్కీ నిర్వహించామని సవాన్ చెప్పాడు.
ప్లాన్ ప్రకారం ఆగస్టు 19న రాత్రి 8 గంటల సమయంలో ముందుగా అనుకున్న చోటుకు వెళ్లాం. జమాయిల్ కర్రలను కూడా వెంట తెచ్చుకున్నాం. మాకు అనువుగా అక్కడే వెదురు కర్రల షాప్ ఉంది. వెదురు కర్రల సాయంతో మొదటగా రెండు ఇళ్లలోకి చొరబడ్డాం. మూడో ఇల్లు అశోక్ కుమార్‌ది. కర్రల సాయంతో ఐదుగురం ఇంట్లోకి ప్రవేశించాం.
ముగ్గురు వ్యక్తులు చాప మీద పడుకొని ఉండటాన్ని గమనించి.. వారి తలమీద కర్రలతో బాదాం. ఆపై మరో ఇద్దరిపై దాడి చేసి నగదు, బంగారు ఆభరణాలతో పరారయ్యామని సవాన్ విచారణలో వెల్లడించాడు. మిగిలిన వారి కోసం పోలీసులు వేట మొదలుపెట్టారు. వీలైనంత త్వరగా వారిని పట్టుకుంటామని తెలిపారు పోలీసులు.