ఏ భారత క్రికెటర్‌కు నా రికార్డు లేదు

By తోట‌ వంశీ కుమార్‌  Published on  16 Sep 2020 6:46 AM GMT
ఏ భారత క్రికెటర్‌కు నా రికార్డు లేదు

ఇండియన్‌ ప్రీమియర్‌ లీగ్‌(ఐపీఎల్) 2020 సీజన్‌ మరో మూడు రోజుల్లో ప్రారంభం కానుంది. కాగా.. ఐపీఎల్‌లో ఇప్పటి వరకు ఏ టీమ్‌ఇండియా ఆటగాడు సాధించని రికార్డును తాను సాధించానని అంటున్నాడు విజయ్‌ శంకర్‌. ఐపీఎల్‌లో సన్‌ రైజర్స్‌ హైదరాబాద్‌ తరుపున ఆడుతున్నాడు. తాజాగా ఈఎస్‌పీఎన్‌ క్రిక్‌ ఇన్ఫో పోస్టు చేసిన ఓ వీడియోలో శంకర్‌ మాట్లాడుతూ పలు ప్రశ్నలకు సమాధాలు చెప్పాడు.

ఈ సీజన్‌లో ఏ జట్టుపై ఆడటాన్ని ఎక్కువగా ఇష్టపడుతావు అని అడుగగా.. తాను చెన్నై నుంచి వచ్చిన వాడినని అందుకే ఆ జట్టుపై మంచి ప్రదర్శన చేస్తే ఆనందంగా ఉంటుందని చెప్పుకొచ్చాడు. ఆ జట్టులో మంచి ఆటగాళ్లు ఉన్నారు. వారిపై బాగా ఆడాలన్నారు. 2014లో చెన్నై‌ తరఫున తొలి మ్యాచ్‌ ఆడిన శంకర్.. 2017 వరకు మళ్లీ ఈ టోర్నీలో కనిపించలేదు. తర్వాత సన్‌రైజర్స్‌ తరఫున ఆడుతున్నాడు.

ఏమైనా వ్యక్తిగత లక్షం ఉందా అని అడుగగా.. ప్రస్తుతం సన్‌రైజర్స్‌ను గెలిపించడమే తన లక్ష్యమన్నాడు. ఏ స్థానంలో బ్యాటింగ్‌ చేసినా.. బౌలింగ్‌ చేసినా.. జట్టు విజయానికి శాయశక్తులా కృషి చేస్తానన్నాడు. ఇక ఈ సీజన్‌ ఏమైనా రికార్డులు బద్దలు కొట్టాలని అనుకుంటున్నావా..? అని అడుగగా.. 'నాకు తెలిసి ఐపీఎల్‌లో ఇదివరకే ఒక రికార్డు సృష్టించా. డకౌట్‌ కాకుండా అత్యధిక ఇన్నింగ్స్‌లు‌ (29) ఆడిన భారత బ్యాట్స్‌మన్‌గా ఉన్నా (నవ్వుతూ)' అని శంకర్ అన్నాడు. ఆస్ట్రేలియా మాజీ ఆల్‌రౌండర్‌ ఆండ్రూ సైమండ్స్‌ (974) ఐపీఎల్‌ చరిత్రలో ఇప్పటివరకూ డకౌట్‌ అవ్వకుండా అత్యధిక పరుగులు చేశాడు. ఆ తర్వాత శంకరే రెండో స్థానంలో ఉన్నాడు. మెగా టోర్నీలో మొత్తం 33 మ్యాచ్‌లు ఆడిన శంకర్ 557 పరుగులు చేశాడు. అందులో రాజస్థాన్‌ రాయల్స్‌పై అత్యధికంగా 63 పరుగులు చేశాడు. టీమ్‌ఇండియా తరుపున ఇప్పటివరకు 12 వన్డేల్లో, 9 టీ20 మ్యాచ్‌ల్లో ప్రాతినిధ్యం వహించాడు.

Next Story