విజయ్‌ నా బయోపిక్‌ నుంచి తప్పుకో : మురళీధరన్‌ విన్నపం

By న్యూస్‌మీటర్ తెలుగు  Published on  20 Oct 2020 6:31 AM GMT
విజయ్‌ నా బయోపిక్‌ నుంచి తప్పుకో : మురళీధరన్‌ విన్నపం

శ్రీలంక మిస్టరీ స్పిన్నర్ ముత్తయ్య మురళీధరన్ జీవిత కథ ఆధారంగా ఓ సినిమా తెరకెక్కుతున్న సంగతి అందరికీ తెలిసిందే. దీనికి "800" అనే టైటిల్ ఖరారు చేసారు. ఇటీవలే ఈ చిత్ర మోషన్‌ పోస్టర్‌ను విడుదల చేశారు. ఈ చిత్రంలో మురళీధరన్‌ పాత్రలో విలక్షణ నటుడు విజయ్‌ సేతుపతి నటిస్తున్నారు. అయితే.. గతంలో మురళీధరన్‌ ఓ వర్గంపై చేసిన వ్యాఖ్యల కారణంగా.. మురళీ పాత్రలో సేతుపతి నటించడంపై కొన్ని వర్గాల నుంచి తీవ్ర వ్యతిరేకత వ్యక్తమైంది. తమిళ రాజకీయ పార్టీలతోపాటు దర్శకుడు భారతీరాజా కూడా నిరసన వ్యక్తం చేశారు. లంక తమిళులను మురళీధరన్‌ వంచించాడని ఆరోపించారు.

ఈ నేపథ్యంలో ఈ ప్రాజెక్టు నుంచి తప్పుకోవాలంటూ సేతుపతికి స్వయంగా ముత్తయ్య విజ్ఞప్తి చేశాడు. ఇదే విషయమై హీరో విజయ్ సేతుపతికి లేఖ రాస్తూ.. ''నా బయోపిక్ - 800 ఆధారంగా తమిళనాడులో వివాదం చెలరేగిన నేపథ్యంలో నేను ఈ ప్రకటన విడుదల చేస్తున్నాను. నా చుట్టూ ఉన్న తప్పుడు భావనల కారణంగా నటుడు విజయ్ సేతుపతి ఈ సినిమా నుండి వైదొలగాలని కొందరు ఒత్తిడి తెస్తున్నారని నాకు తెలుసు. నా వల్ల తమిళనాడుకు చెందిన గొప్ప కళాకారుడు బాధపడాలని నేను కోరుకోను. దీని కారణంగా అతని కెరీర్ లో అనవసరమైన అడ్డంకులు కలుగకూడదు. అందుకే ఈ సినిమా నుండి తప్పుకోవాలని నేను అతనిని అభ్యర్థిస్తున్నాను'' అని లేఖలో మురళీధరన్ పేర్కొన్నాడు.

" నేను జీవితంలో ఎన్నో ఎత్తుపల్లాలు చూశా. ఆత్మస్థైర్యంతో ముందుకు సాగడం వల్లే ఇవాళ ఈ స్థాయిలో ఉన్నా. నా బయోపిక్‌ యువతలో స్పూర్తినింపుతుందని బావించా. కానీ అది ఆగిపోయింది. దర్శక, నిర్మాతలు సమస్యల్ని పరిష్కరించి, సినిమాను ప్రేక్షకులకు చేరవేస్తారని ఆశిస్తున్నా. త్వరలోనే దీనికి సంబంధించిన ప్రకటన వస్తుంది. నిర్మాతల నిర్ణయాన్ని నేనెప్పుడూ గౌరవిస్తాను" అని మురళీ తెలిపాడు.

ఈ లేఖపై విజయ్ సేతుపతి స్పందిస్తూ.. ''థ్యాంక్యూ.. గుడ్ బై'' అని ట్వీట్ చేసాడు. దీంతో మురళీధరన్ బయోపిక్ "800" నుంచి విజయ్ సేతుపతి తప్పుకున్నట్లు స్పష్టమైంది.

Next Story