ఆశ్చ‌ర్యం : అచ్చం మురళీధరన్‌ను దించేశాడుగా.. ఎవ‌ర‌త‌ను‌.?

By న్యూస్‌మీటర్ తెలుగు  Published on  14 Oct 2020 7:04 AM GMT
ఆశ్చ‌ర్యం : అచ్చం మురళీధరన్‌ను దించేశాడుగా.. ఎవ‌ర‌త‌ను‌.?

ప్రపంచ స్పిన్ దిగ్గజం, శ్రీలంక స్టార్ ఆటగాడు ముత్తయ్య మురళీధరన్ గురించి ప్ర‌త్యేకంగా చెప్పాల్సిన అవ‌స‌రం లేదు. టెస్ట్‌, వ‌న్డే క్రికెట్‌లో అత్య‌ధిక వికెట్లు తీసిన క్రికెట‌ర్‌గా ఎన్నో రికార్డుల‌ను త‌న పేరిట లిఖించుకున్నాడు. ప్ర‌స్తుతం ముత్తయ్య మురళీధరన్ జీవితకథ ఆధారంగా ఓ చిత్రం తెరకెక్కుతుంది. ఆ చిత్రం పేరు '800'. ఇందులో ముర‌ళీధ‌ర‌న్ పాత్ర‌ను త‌మిళ స్టార్ యాక్ట‌ర్‌ విజయ్ సేతుపతి పోషిస్తున్నాడు. ఈ చిత్రానికి ఎంఎస్ శ్రీపతి దర్శకత్వం వహిస్తున్నారు.అయితే.. తాజాగా ఈ సినిమాకు సంబంధించి మోషన్ పోస్టర్‌ను విడుద‌ల చేశారు చిత్ర యూనిట్‌. ఈ మోష‌న్ పోస్ట‌ర్‌లో శ్రీలంక జెర్సీ ధరించిన విజయ్ సేతుప‌తి..‌ పూర్తిగా మురళీధరన్‌లా మారిపోయి అందిరినీ ఆశ్చర్యానికి గురిచేశాడు. అయితే.. ఈ పోస్టర్‌పై, సినిమాపై తమిళ నెటిజన్లు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. ట్విటర్‌లో '#ShameOnVijaySethupathi' హ్యాష్‌ట్యాగ్‌ను ట్రెండ్ చేస్తున్నారు.శ్రీలంకలో తమిళులపై ప్రభుత్వం వివక్ష చూపిస్తూ అణిచివేస్తోందని, అలాంటిది ఆ దేశ జాతీయ చిహ్నం ఉన్న జెర్సీ ధరించి విజయ్ నటిస్తున్నాడని నెటిజ‌న్లు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. తమిళుడైన విజయ్ శ్రీలంక జాతీయ చిహ్నం ఉన్న జెర్సీని ధ‌రించ‌డాన్ని తీవ్రంగా త‌ప్పు ప‌డుతున్నారు. అయితే.. శ్రీలంకకు చెందిన తమిళుడైన‌ మురళీధరన్ చెన్నైకు చెందిన అమ్మాయిని పెళ్లి చేసుకున్నాడు.

Next Story