'800' వివాదం.. శ్రీలంక తమిళుడిగా పుట్టడం నా తప్పా

By సుభాష్  Published on  17 Oct 2020 8:02 AM GMT
800 వివాదం.. శ్రీలంక తమిళుడిగా పుట్టడం నా తప్పా

శ్రీలంక దిగ్గజ ఆటగాడు ముత్తయ్య మురళీధరన్‌.. తన స్పిన్‌ మాయాజాలంతో ఎందరో బ్యాట్స్‌మెన్లను ముప్పు తిప్పలు పెట్టారు. టెస్టుల్లో ఎవరికి సాధ్యం కాని విధంగా 800 వికెట్లను పడగొట్టారు. ఆ దిగ్గజ ఆటగాడి బయోపిక్‌ తెరక్కెక్కుతోంది. ఈ చిత్రానికి '800' అనే టైటిల్‌ను ఖరారు చేసిన విషయం తెలిసిందే. ఈ చిత్రంలో విభిన్న పాత్రలు పోషిస్తూ దేశ వ్యాప్తంగా అభిమానులను సంపాదించుకున్న నటుడు విజయ్‌ సేతుపతి నటిస్తున్నారు. కాగా.. ఈ చిత్రంపై తమిళ సంఘాలు, తమిళ సినీ పెద్దలు మండిపడుతున్నారు. ఈ సినిమాలో నటిస్తున్న విజయ్ సేతుపతి తీవ్ర విమర్శలు ఎదుర్కొంటున్నాడు. మురళీధరన్ శ్రీలంక మత వాదానికి పూర్తిగా మద్దతు పలికాడని.. అతని బయోపిక్‌లో విజయ్ నటించడం సరికాదని సీనియర్ దర్శకుడు భారతీరాజా కూడా అభిప్రాయపడ్డాడు. కాగా.. తనపై వస్తున్న విమర్శలపై మురళీధరన్‌ స్పందించాడు.

'నేను జీవితంలో అనేక వివాదాల్లో చిక్కుకున్నాను. ఇవి నాకు కొత్త ఏమీ కాదు. కొన్ని వర్గాల ప్రజలు చిత్రం ఉద్దేశాన్ని అర్ధం చేసుకోవాలని నేను వివరణ ఇవ్వదలచుకున్నాను. నా జీవితంలో యుద్ద భూమిలో మొదలైంది. నేను ఏడు సంవత్సరాల వయసులో ఉండగానే నా తండ్రి చనిపోయారు. మా కుటుంబ కనీస అవసరాలు తీర్చుకోవడానికి కూడా అనేక ఇబ్బందులు ఎదుర్కొవాల్సి వచ్చింది. యుద్ధ ప్రాబల్య ప్రాంతంలో ఉంటూ మనుగడ సాగించడానికి అనేక ఇబ్బందులు ఎదుర్కొన్నాం. చిన్నప్పటి నుంచి నేను ఎదుర్కొన్న కష్టాలు, క్రికెట్‌లో నేను ఎలా విజయవంతమయ్యాను అనేది ఈ సినిమాలో చూపిస్తున్నారు. శ్రీలంక తమిళుడిగా పుట్టడం నా తప్పా? ఒకవేళ భారత్‌లో పుట్టి ఉంటే టీమిండియాలో ఆడేవాడిని. నేను తమిళులకు వ్యతిరేకం అంటూ వివాదం రేకెత్తించారు. రాజకీయ రంగు పులిమారు. శ్రీలంకలో తమిళుల నరమేధానికి నేను మద్దతు పలికానని ఆరోపించారు. 2009లో పరిస్థితులను తప్పుగా అర్థం చేసుకుని ఆ వ్యాఖ్యలు చేశాను. జీవితమంతా యుద్ధ భూమిలో గడిపిన వాడికి యుద్ధం ముగియడమనేది గొప్ప విషయం. రెండు వైపులా ఇకపై ప్రాణాలు కోల్పోవడం ఉండదని సంతోషపడ్డాను. తమిళుల అందరిలోనూ ఆత్మవిశ్వాసాన్ని నింపేందుకే నా కథను వెండితెరపై చెప్పాలనుకున్నాన'ని మురళీధరన్ పేర్కొన్నాడు.

Next Story