ఉదయం ఒక పార్టీ.. సాయంత్రం అయితే మరో పార్టీ.. 'టీఆర్‌ఎస్'కు తలనొప్పి
By సుభాష్ Published on 11 Jan 2020 3:57 AM GMTముఖ్యాంశాలు
ఉదయం ఒక పార్టీ.. సాయంత్రం అయితే మరో పార్టీ
టికెట్ దక్కని నేతలు దూకుడు జోరు
పార్టీ మారుతున్న నేతలకు బుజ్జగింపులు
తెలంగాణలో రసవత్తరంగా మారుతున్న రాజకీయాలు
మున్సిపల్ సమరం జోరందుకుంటుంది. ఎన్నికల్లో పోటీ చేసే వారు పార్టీల నుంచి హామీ ఇవ్వకపోయినా.. నామినేషన్ వేసేశారు. చివరకు ఏ పార్టీ నుంచి టికెట్ దక్కితే అప్పుడు బీ ఫారాన్ని సమర్పించేందుకు రెడీ అవుతున్నారు. కొందరు సొంత పార్టీ నుంచి టికెట్ దక్కపోవడంతో పార్టీనే మార్చేశారు. మరో పార్టీలో నేమినేషన్ వేసేందుకు ముందుకొచ్చారు. ఇలాంటి సమస్యలు ఎదురు కావడంతో ఒక్కొక్కరు రెండు, మూడు నామినేషన్లు కూడా దాఖలు చేస్తున్నారు. ఇలా ఉదయం ఒక పార్టీ, సాయంత్రం అయితే మరోపార్టీకి మారిపోవడంతో టీఆర్ ఎస్‌కు తలనొప్పిగా మారినట్లు తెలుస్తోంది. ఈ సమస్య కాంగ్రెస్‌కు సైతం ఎదురవుతోంది. టీఆర్ ఎస్ నుంచి దూకేవారు ఎక్కువగా బీజేపీ, కాంగ్రెస్ పార్టీలనే ఎంచుకుంటున్నారు. ఇక అది కుదరకుంటే చివరికి స్వతంత్ర అభ్యర్థులుగా పోటీ చేసేందుకు కూడా వెనుకాడటం లేదు.
కామారెడ్డి మున్సిపాలిటీలో టీఆర్ ఎస్ కు చెందిన ఎల్లంకి శ్రీనివాస్‌కు ఆ పార్టీ నుంచి టికెట్ దక్కకపోవడంతో చివరకు కాంగ్రెస్ గూటికి చేరిపోయారు. గురువారం టీఆర్ ఎస్ నుంచి నామినేషన్ వేసిన ఆయన టికెట్ దక్కడం లేదని తెలిసి శుక్రవారం కాంగ్రెస్ నేత షబ్బీర్ ఆలీ సమక్షంలో కాంగ్రెస్ తీర్థం పుచ్చుకున్నారు. ఆ వెంటనే కాంగ్రెస్ టికెట్‌ను ఖరారు చేయడంతో కాంగ్రెస్ తరపున నామినేషన్ దాఖలు చేశారు. అలాగే ఎల్లారెడ్డి మున్సిపాలిటీలో టీఆర్ ఎస్ టికెట్ లభించని పార్టీ మండల అధ్యక్షుడు, మాజీ జడ్పీటీసీ, ఎంపీటీసీ సభ్యులు కాంగ్రెస్ గూటికి చేరిపోయారు. వీరంతా ఎమ్మెల్యే ఏనుగు రవీందర్ రెడ్డి వర్గీయులు కావడంతో వీరికి టికెట్ ఇచ్చేందుకు నిరాకరించినట్లు తెలుస్తోంది.
ఇక మంచిర్యాల జిల్లాలో మున్సిపల్ వైస్ చైర్మన్, టీఆర్ ఎస్ నేత ఉప్పలయ్య కాంగ్రెస్ పార్టీలో చేరిపోయారు. ఈ సందర్భంగా ఆయనకు కాంగ్రెస్ మున్సిపల్ చైర్మన్ అభ్యర్థిగా ప్రకటించింది కాంగ్రెస్. టీఆర్ ఎస్ నేత చల్లా భూషణం కూడా కాంగ్రెస్ గూటికి వెళ్లారు. ఈయనకు కూడా కాంగ్రెస్ టికెట్ ఖరారు చేసింది. బెల్లంపల్లికి చెందిన టీఆర్ ఎస్ నేత ఎల్తుర్తి శంకర్ సైతం టికెట్ రాకపోవడంతో కాంగ్రెస్ కండువా కప్పుకొన్నారు. ఖానాపూర్ టీఆర్ ఎస్ సీనియర్ నేత మడిరే సత్యనారాయణ భారతీయ జనతా పార్టీలో చేరారు.
తనయుని కోసం మాజీ మంత్రి ముమ్మర ప్రయత్నాలు
ఇక మాజీ మంత్రి జోగు రామన్న ఆదిలాబాద్ మున్సిపల్ చైర్మన్‌గా తన తనయునికి అవకాశం దక్కించుకునేందుకు ముమ్మర ప్రయత్నాలు చేస్తున్నట్లు తెలుస్తోంది. ఈ స్థానం జనరల్‌గా ఖరారు చేయడంతో రామన్న ఎత్తుగడలు వేస్తున్నట్లు తెలుస్తోంది. తాజాగా మాజీ చైర్మన్ రంగినేని మనీష పోటీకి రాకుండా ఆమెను అభ్యర్థుల జాబితాలో లేకుండా చేసినట్లు రాజకీయ వర్గాల్లో ప్రచారం జోరుగా సాగుతోంది. ఇక మహబూబ్ నగర్ జిల్లా యువజన కాంగ్రెస్ నేత ఇస్మాయిల్ సైతం మంత్రి శ్రీనివాస్‌గౌడ్ సమక్షంలో కారెక్కాడు. వరంగల్ రూరల్ జిల్లాలో పలువురికి ఈ మున్సిపల్ ఎన్నికల్లో టికెట్ దక్కపోవడంతో కాంగ్రెస్, బీజేపీ కండువాలు కప్పుకొని నామినషన్లు సైతం దాఖలు చేశారు. మరి కొందరు ఇండిపెండెట్లుగా బరిలోకి దిగుతున్నారు. ఇలా టికెట్ దక్కని నాయకులు ఇతర పార్టీలోకి చేరిపోవడంతో టీఆర్ ఎస్‌కు కొంత తలనొప్పిగా మారిందని నాయకులు చెబుతున్నారు. అలాగే జనగామ పట్టణంలో రాజకీయాలు వేడివేడిగా సాగుతున్నాయి. కాంగ్రెస్ పార్టీకి చెందిన ఇద్దరు కౌన్సిలర్లు టీఆర్ ఎస్ గూటికి చేరారు. జనగామ మున్సిపల్ మాజీ చైర్మన్, టీఆర్ ఎస్ నాయకుడు గాడిపల్లి ప్రేమలతారెడ్డి అనూహ్యంగా నామినేషన్లు వేసిన రోజే బీజేపీలో చేరిపోయారు.
కేసీఆర్ సూచన మేరకు అసంతృప్తులకు బుజ్జగింపులు
మున్సిపల్ ఎన్నికల నేపథ్యంలో టీఆర్ ఎస్‌లో కొందరు నేతలు టికెట్ దక్కకపోవడంతో అసంతృప్తితో ఉన్నట్లు తెలుస్తోంది. ఈ నేపథ్యంలో ముఖ్యమంత్రి కేసీఆర్ సూచన మేరకు ఎమ్మెల్యేలు, మంత్రులు వారిని బుజ్జగించే పనిలో ఉన్నారు. మున్సిపల్ పోరులో టికెట్ దక్కపోయినా.. నామినేటెడ్, ఇతర అవకాశాలు కల్పిస్తామని అసంతృప్తితో ఉన్న నేతలను సముదాయిస్తున్నట్లు తెలుస్తోంది. ఇక కాంగ్రెస్ పార్టీలో అసంతృప్తిగా ఉన్న నేతలను ఆ పార్టీ నాయకత్వం బుజ్జగిస్తోన్నట్లు తెలుస్తోంది.