ముంబైలో భారీ అగ్నిప్రమాదం.. 3500 మంది తరలింపు
By న్యూస్‌మీటర్ తెలుగు
దేశ ఆర్థిక రాజధాని ముంబైలో భారీ అగ్నిప్రమాదం సంభవించింది. దక్షిణ ముంబైలోని నాగ్‌పడ ఏరియాలోని సిటీ సెంటర్ మాల్‌లో మంటలు చెలరేగాయి. చూస్తుండగానే మంటలు భవనం మొత్తం వ్యాపించాయి. దీంతో సమీపంలో ఉన్న 3500 మంది స్థానికులను అధికారులు ముందు జాగ్రత్తగా ఖాళీ చేయించాయి. సమాచారం అందుకున్న అగ్నిమాపక సిబ్బంది వెంటనే 24 అగ్నిమాపక యంత్రాలు అక్కడకు చేరుకున్నాయి. గురువారం రాత్రి ఎగిసిపడిన మంటలను ఆర్పేందుకు తెల్లవారుజాము వరకు చర్యలు కొనసాగుతున్నాయి.
ఘటన జరిగిన సమయంలో 200 నుంచి 300 మంది మరకు సిటీ సెంటర్ మాల్‌లో ఉన్నారు. తొలుత దీన్ని లెవల్ 1 ప్రమాదమని ప్రకటించారు. ఆపై తీవ్రతను చూసి లెవల్ 3 (భారీ) అగ్ని ప్రమాదమని తెలిపారు. మంటలు అదుపులోకి రాకపోవడంతో శుక్రవారం ఉదయం ఈ అగ్నిప్రమాదాన్ని లెవల్ 5 ఘటనగా పేర్కొన్నారు. సిటీ సెంటర్ మాల్‌లో ఉన్న వారిని సురక్షితంగా బయటకు తీసుకొచ్చారు. చుట్టుపక్కల ఉన్న భవనాల ప్రజలను సైతం అక్కడి నుంచి ఖాళీ చేయించి సురక్షిత ప్రాంతానికి తరలించినట్లు సమాచారం.
ఈ ఘటనలో ఎవరూ మరణించలేదని.. మంటలను ఆర్పే క్రమంలో నలుగురు అగ్నిమాపక సిబ్బందికి గాయాలైనట్లు అధికారులు తెలిపారు. వారిని చికిత్స నిమిత్తం ఆసుపత్రికి తరలించారు. ముంబై చీఫ్ పైర్ ఆపీసర్‌తో సహా రెండు వందలకు పైగా సిబ్బంది 24 అగ్నిమాపక యంత్రాలతో మంటలను అదుపులోకి తెచ్చేందుకు తీవ్రంగా శ్రమిస్తున్నారు. నగర మేయర్ కిశోర్ పెండేకర్ ఘటనాస్థలికి చేరుకుని పరిస్థితిని సమీక్షించారు.