వెలుగులోకి కాంగ్రెస్ నేత రేవంత్‌రెడ్డి 'భూ' అక్రమాలు

By అంజి  Published on  26 Feb 2020 2:56 PM IST
వెలుగులోకి కాంగ్రెస్ నేత రేవంత్‌రెడ్డి భూ అక్రమాలు

ముఖ్యాంశాలు

  • గోపనపల్లిలో మరో భూ అక్రమం
  • భూమి కంటే ఎక్కవ విస్తీర్ణానికి మ్యుటేషన్లు
  • అప్పటి తాహశీల్దార్‌ డి.శ్రీనివాస్‌రెడ్డి సస్పెండ్‌

హైదరాబాద్‌: 'రేవంత్‌ భూదందా' అంటూ నమస్తే తెలంగాణ దినపత్రిక కథనం రాసింది. ఆ కథనం ప్రకారం.. మల్కాజ్‌గిరి ఎంపీ, పీసీసీ వర్కింగ్‌ ప్రెసిడెంట్‌ అనుముల రేవంత్‌రెడ్డి ఫ్యామిలీ చుట్టూ భూ ఆక్రమణ ఉచ్చు బిగుసుకున్నట్లు తెలుస్తోంది. రేవంత్‌రెడ్డి, ఆయన సోదరుడితో కలిసి రికార్డుల్లో ఉన్న భూమి కంటే ఎక్కువ భూమి బదలాయింపు చేసుకున్నారని రంగారెడ్డి కలెక్టర్‌ విచారణ తేలింది. నగర శివారులోని రంగారెడ్డి జిల్లా గోపనపల్లిలో రేవంత్‌రెడ్డి తప్పుడు పత్రాలతో ఖరీదైన భూమిని మ్యుటేషన్లు చేయించారు. దీనిపై విచారణ చేపట్టి రంగారెడ్డి జిల్లా అధికారులు నివేదిక తయారు చేశారు.

ఈ నివేదికను అధికారులు ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి సోమేశ్‌ కుమార్‌కు అందజేయడంతో.. ప్రభుత్వం వెంటనే చర్యలు చేపట్టింది. ఈ వ్యవహారంలో నిబంధనలు ఉల్లంఘించి, తప్పుడు పత్రాలతో మ్యుటేషన్‌ చేసిన నాటి తాహశీల్దార్‌ శ్రీనివాస్‌ను.. రెవెన్యూ ఉన్నతాధికారులు సస్పెండ్‌ చేశారు. ఏడు ఎకరాల భూమిని రేవంత్‌రెడ్డి సోదరులు అక్రమ మార్గంలో సంపాదించారని అధికారులు తేల్చచారు. ఈ భూమి విలువ ఎకరం దాదాపు రూ.25 కోట్లు.. అంటే మొత్తం ఏడు ఎకరాల భూమి విలువ రూ.150కోట్లకు పైనే అన్నమాట.

గోపనపల్లిలోని టాటా ఇన్‌స్టిట్యూట్‌ ఆఫ్‌ ఫండమెంటల్‌ రీసెర్చ్‌ సెంటర్‌ వెనక 127 సర్వే నంబర్‌లో 10.24 ఎకరాల భూమి ఉంది. గోపనపల్లిలో గజం భూమి ధర రూ.85 వేల నుంచి రూ.లక్ష వరకు ఉంది. ఇక్కడ భూములన్నీ గజాల చొప్పునే క్రయవిక్రయాలు జరుగుతాయి. ఈ భూమి 2005లోనే వాస్తవ పట్టాదారులకు బదులుగా ఇతర వ్యక్తుల పేరిట మారినట్లు తెలిసింది. అయితే ఈ రికార్డులను ఎవరు మార్చారన్నదానిపై సస్పెన్షన్‌ నెలకొంది. తప్పుడు పత్రాలతో భూమి కొన్నారని కొందరు కోర్టును ఆశ్రయించారు.

హైకోర్టులో పిటిషన్‌..

కాగా అనుముల కొండల్‌రెడ్డి ఈ భూములు అమ్ముకోకుండా ఆదేశాలు జారీ చేయాలని 2015లో అనిల్‌ కుమార్‌ అనే వ్యక్తి రంగారెడ్డి సివిల్‌ కోర్టులో పిటిషన్‌ దాఖలు చేశారు. ఈ వ్యహారంలో నిజాలను బయటపెట్టేందుకు ప్రభుత్వం విచారణకు ఆదేశించింది. ఆ భూమిలో తమకు హక్కు ఉందంటూ 2017లో కొల్లా అరుణ హైకోర్టులో 17542, 17637 నంబర్లతో పిటిషన్‌ దాఖలు చేశారు. కాగా ఈ భూమిని తప్పుడు పత్రాలతో వేరేవారి పేరు మీద రాయించి.. వారి నుంచి రేవంత్‌రెడ్డి, అతని సోదరుడు కొనుగోలు చేసినట్లు తెలిసింది. మొత్తం 6.24 ఎకరాల భూమి మ్యునిటేషన్‌ జరిగింది. నకిలీ డాక్యమెంట్ల ద్వారానే ఈ మ్యుటేషన్లు జరిగినట్టు అధికారులు తేల్చారు.

భూ రికార్డుల ప్రక్షాళనలో భాగంగా భూమి వివరాలను డిజిటలైజేషన్‌ చేస్తుండగా తప్పులు జరిగినట్లు శేరిలింగంపల్లి తహశీల్దార్‌ గుర్తించారు. దీనిపై ప్రస్తుత తహశీల్దార్‌ విచారణ చేపట్టారు. మ్యుటేషన్లు జరిగిన నలుగురి వ్యక్తుల పేర్లు కాకుండా పహాణిలో పాత వారి పేర్లు ఉండడాన్ని తహశీల్దార్‌ గుర్తించారు. ఈ సర్వే నెంబర్‌లోని భూములు వేరొకరి పేరుతో మ్యుటేషన్‌ జరిగిందని, హైకోర్టులో రెండు పిటిషన్లు దాఖలు కాగా.. మరో రెండు ఫిర్యాదులు తహశీల్దార్‌ కార్యాలయానికి వచ్చాయి. ఈ వ్యవహారంపై ఫిబ్రవరి 25న జిల్లా కలెక్టర్‌కు నివేదికగా ఇవ్వగా.. కలెక్టర్‌ దీనిని ప్రభుత్వానికి పంపారు. కాగా అప్పటి డిప్యూటీ కలెక్టర్‌ డి.శ్రీనివాస్‌రెడ్డిని ప్రభుత్వం సస్పెండ్‌ చేసింది.

Next Story