సృష్టికి మూలం అమ్మ‌. ప్రేమ‌కి ప్ర‌తిరూపం అమ్మ. త్యాగానికి నిద‌ర్శ‌నం అమ్మ‌. అడ‌గ‌క ముందే అన్నీ తానై త‌న పిల్ల‌ల కోసం ప్రేమ‌ను పంచించే మాతృమూర్తి అమ్మ‌. తొమ్మిది నెల‌లు మోసి మ‌న‌కు జ‌న్మ‌నిచ్చిన అమ్మ‌కు ఏమిచ్చినా రుణం తీర‌దు. అమ్మ త్యాగాలను గుర్తు చేసుకునేదే ‘మదర్స్ డే’. ప్రపంచ వ్యాప్తంగా పలు తేదీల్లో ఈ మదర్స్ డే జరుపుకుంటారు. ఆసియా, ద‌క్షిణ దేశాల్లో ప్రతీ ఏడాది మే నెల రెండో ఆదివారం ‘మదర్స్ డే’గా సెలబ్రేట్ చేసుకుంటారు. కాగా.. ఈ ఏడాది మే 10(ఆదివారం) నాడు మాతృదినోత్స‌వం సంద‌ర్భంగా జ‌న్మ‌నిచ్చిన అమ్మ‌కు పాదాభివంద‌నం చేద్దాం.

కష్టమెచ్చినా.. కన్నీళ్లొచ్చినా నోటి వెంట వచ్చే మొదటి పిలుపు అమ్మ‌. దేవుని ప్రతిరూపం అమ్మ. అందుకే మాతృదేవోభవ అంటారు. అమ్మ రుణం తీర్చాలంటే అమ్మగా పుట్టాల్సిందేనని చెబుతారు. అమ్మ అయితేనే ఆ స్త్రీ జ‌న్మ ప‌రిపూర్ణం అయ్యేది. అమ్మ మంచితనన్ని చెప్పే కవితలు, పాటలు ఎన్నోఉన్నాయి.

ప‌లువురు సినీ గేయ క‌ళాకారులు అమ్మ గొప్ప‌తనాన్ని తెలిపే పాట‌లు ఎన్నో రాశారు. మాతృదినోత్సం సంద‌ర్భంగా మ‌చ్చుకు కొన్ని..

1. చిన్న చిన్న హ్యూమన్ ఎమోషన్స్ ని సైతం చక్కగా తెరకెక్కించే శేఖర్ కమ్ముల దర్శకత్వంలో వచ్చిన ‘లైఫ్ ఈజ్ బ్యూటిఫుల్’ చిత్రంలోని ‘అమ్మా అని కొత్తగా.. మళ్ళీ పిలవాలనీ’ హృద‌యాల‌ను అనే పాట హ‌త్తుకుటుంది.

“అమ్మా అని కొత్తగా.. మళ్ళీ పిలవాలనీ
తుళ్ళే పసి ప్రాయమే.. మళ్ళీ మొదలవ్వనీ
నింగీ నేలా నిలిచేదాకా తోడుగా
వీచే గాలి వెలిగే తారల సాక్షిగా
నువు కావాలే అమ్మా
నను వీడొద్దే అమ్మా
బంగారం నువ్వమ్మా” అంటూ సాగే పాట అమ్మ‌గొప్ప‌త‌న్నాన్ని అమ్మ విలువ‌ను తెలుపుతోంది.

2. చంద్ర‌బోస్ సాహిత్యాన్ని అందించిన ‘నాని’ చిత్రంలోని ‘పెద‌వే ప‌లికిన మాట‌ల్లోనే తియ్య‌ని మాటే అమ్మ’ పాట‌ని ఉన్నిక్రిష్ణ‌న్‌, సాధ‌నాస‌ర్గం పాడ‌గా.. ఎఆర్ రెహ‌మాన్ సంగీతాన్ని అందించాడు.

“పెదవే పలికిన మాటల్లోనే తియ్యని మాటే అమ్మా
కదిలే దేవత అమ్మా కంటికి వెలుగమ్మా
పెదవే పలికిన మాటల్లోనే తియ్యని మాటే అమ్మా
కదిలే దేవత అమ్మా కంటికి వెలుగమ్మా
తనలో మమతే కలిపి పెడుతుంది ముద్దగా
తన లాలి పాటలోని సరిగమ పంచుతుంది ప్రేమ మధురిమ
పెదవే పలికిన మాటల్లోనే తియ్యని మాటే అమ్మా
కదిలే దేవత అమ్మా కంటికి వెలుగమ్మా” అంటూ పాగే ఈ పాట ఓ చిన్నారి ప‌ట్ల త‌ల్లికి ఎంత ప్రేమ ఉంటుందో తెలియ‌జేస్తుంది.

3. ‘అమ్మ రాజీనామా’ చిత్రంలో చ‌క్ర‌వ‌ర్తి రాసిన ‘ఎవ‌రు రాయ‌గ‌ల‌రు అమ్మా అను మాట క‌న్న క‌మ్మ‌ని కావ్యం’ పాట‌కు సింగ‌ర్ చిత్ర పాట‌కు ప్రాణం పోసింది. అమ్మ గొప్ప‌త‌నాన్ని తెలియ‌జేస్తుంది ఈ పాట‌.

“ఎవరు రాయగలరు
అమ్మా అను మాట కన్న కమ్మని కావ్యం
ఎవరు పాడగలరు
అమ్మా అను రాగం కన్న తియ్యని రాగం
అమ్మేగా, అమ్మేగా తొలిపలుకు నేర్చుకున్న భాషకి
అమ్మేగా ఆదిస్వరం ప్రాణమనే పాటకి
ఎవరు రాయగలరు అమ్మా అను మాట కన్న కమ్మని కావ్యం
ఎవరు పాడగలరు అమ్మా అను రాగం కన్న తియ్యని రాగం”

4. ‘బ్ర‌హ్మ‌లోకం టూ య‌మ‌లోకం వ‌యా భూలోకం’ చిత్రంలోని ‘అమృతానికి అర్ప‌ణ‌కు అస‌లు పేరు అమ్మ’ సాంగ్ అమ్మ చేసే త్యాగాల‌ను తెలియ‌జేస్తుంది.

అమృతానికి అర్పణకు అసలు పేరు అమ్మ
అనుభూతికి ఆత్రతకు ఆనవాలు అమ్మ
అమృతానికి అర్పణకు అసలు పేరు అమ్మ
అనుభూతికి ఆత్రతకు ఆనవాలు అమ్మ
ప్రతి మనిషి పుట్టుకకే పట్టుగొమ్మ అమ్మ
ఈ లోకమనే గుడిచేరగ తొలి వాకిలి అమ్మ
అమృతానికి అర్పణకు అసలు పేరు అమ్మ
అనుభూతికి ఆత్రతకు ఆనవాలు అమ్మ

5. ధ‌నుష్ న‌టించిన చిత్రం ‘ర‌ఘువ‌ర‌న్ బీటెక్’‌. ఈ చిత్రంలోని ‘అమ్మ అమ్మా నీ ప‌సివాణ్ణ‌‌మ్మా’ పాట హృద‌యాల‌ను హ‌త్తుకొటోంది. అమ్మ దూర‌మైతే ఆ బాధ ఎలా ఉంటుందో ఈ పాట‌లో ఉంటుంది.

“అమ్మా అమ్మా నీ ప‌సివాణ్ణ‌మ్మా
నేవ్వే లేక వ‌సివాడాన‌మ్మా
మాటే లేకుండా నువ్వే మాయం
క‌న్నీరౌతోంది ఎద‌లో గాయం
అయ్యో వెళిపోయావె
నన్నొదిలేసి ఎటుపోయావే
అమ్మా ఇక‌పైనే విన‌గ‌ల‌నా నీ లాలిపాట‌
నే పాడే జోల‌కు నువు క‌న్నెత్తి చూసావో అంతే చాలంటా
అమ్మా అమ్మా నీ ప‌సివాణ్ణ‌మ్మా
న‌వ్వే లేక వ‌సివాడాన‌మ్మా”

6. 1990లో వ‌చ్చిన0 ’20 వ శతాబ్దం’ చిత్రంలోని “అమ్మ‌ను మించి దైవ‌మున్న‌దా” అనే పాట ఈ అమ్మ కంటే ఏమీ గొప్ప‌ది కాదు అనేది తెలియ‌జేస్తుంది.

“అమ్మను మించి దైవమున్నదా
ఆత్మను మించి అద్దమున్నదా
అమ్మను మించి దైవమున్నదా
ఆత్మను మించి అద్దమున్నదా
జగమే పలికే శాశ్వత సత్యమిదే
అందరినీ కనే శక్తి అమ్మ ఒక్కతే
అవతార పురుషుడైనా
ఓ అమ్మకు కొడుకే
అందరినీ కనే శక్తి అమ్మ ఒక్కతే
అవతార పురుషుడైనా
ఓ అమ్మకు కొడుకే”


అమ్మ గొప్ప‌త‌నాన్ని ఎంతో మంది సినీ క‌వులు ఎన్నో పాట‌ల ద్వారా తెలియ‌జేప్పారు. ఇవి మ‌చ్చుక‌కు కొన్ని మాత్ర‌మే. అమ్మ ప్రేమ వెల‌క‌ట్ట‌లేనిది. త‌ల్లిదండ్రుల‌ను ప్రేమించండి. మీరు త‌ల్లిదండ్రులు అయిన‌ప్పుడు మాత్ర‌మే మీ త‌ల్లిదండ్రులు మిమ్మ‌ల్ని ఎంత ప్రేమించారో అర్థం అవుతుంది. వాళ్లు దూరం అయ్యాక లేర‌ని బాధ‌ప‌డే క‌న్నా.. ఇప్ప‌డే వారి ప్రేమ విలువ‌ను తెలుసుకుని వాళ్ల‌ను గౌర‌వించండి, ప్రేమించండి.

వంశికుమార్ తోట

నాపేరు వంశికుమార్. నేను న్యూస్ మీటర్ తెలుగులో జర్నలిస్ట్ గా పనిచేస్తున్నాను. గతంలో నేను ఆంధ్రప్రభ, ఆంధ్ర‌జ్యోతిలో పనిచేశాను. జర్నలిజం పట్ల నాకు ఉన్న ఇష్టం, ఆసక్తితో నేను ఈ వృత్తిని ఎంచుకున్నాను.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *