ఇన్ని అద్భుతాలు ఎలా చేయగలుగుతున్నావ్ అమ్మ..!
By సుభాష్ Published on 8 May 2020 1:34 PM GMTలాక్ డౌన్ కు ముందు మన జీవితాలు బాగా ఉన్నా.. లాక్ డౌన్ సమయంలో కూడా హాయిగా ఉన్నా కూడా అందుకు కారణం అమ్మే..! ఈ విషయాన్ని గుండెల మీద చేయి వేసుకుని ప్రతి ఒక్కరూ చెప్పగలరు. ఆమె లేకుండా ఒక్క క్షణం కూడా గడపడం మన వల్ల కాదు.. కానీ ఎందుకో ఆమె కోసమంటూ ప్రత్యేకంగా ఒకరోజును పెట్టారు. నిజం చెప్పాలంటే ప్రతి రోజూ మదర్స్ డేనే..! తమ పిల్లల కోసం ఆ తల్లి ఎంతగానో కష్టపడుతూ ఉంటుంది.
ఓ వైపు భర్త.. మరో వైపు పిల్లలు.. ఆమె చేసే పనులకు నిజంగా ఆమె క సూపర్ విమెన్ లా మనకు కనిపిస్తుంది. ఏదైనా సహాయాం చేయడానికి వెళ్లినా.. మీకెందుకు అంటూ మనకు ఎటువంటి కష్టం లేకుండా చూసుకుంటుంది. ప్రపంచం మొత్తం షట్ డౌన్ అయినా తల్లి మాత్రం ఇంట్లో ఓవర్ టైమ్ వర్క్ చేస్తూనే ఉంది.
ఎప్పటి లాగే ఈ సారి కూడా మదర్స్ డే వచ్చింది. ఇక మనం చేసేది ఏముంటుంది చెప్పండి.. ఓ సెల్ఫీ తీసుకుని స్టేటస్ పెట్టేయడం. అలా కాకుండా తల్లితో కలిసి చాలా సేపు మాట్లాడండి. బ్యాచిలర్లు అయితే.. బయట ఉన్నప్పుడు మీరు చేసే వంటలను అమ్మకి రుచి చూపించండి.. ఆమె అది తిని ఇవేమి వంటలు రా అని అనకుంటే అప్పుడు చూడండి. ఆమె చిన్న నాటి స్మృతుల గురించి అడిగి తెలుసుకోండి. తనకు ఇష్టమైనవి ఏమిటో తెలుసుకోండి.. బయట నుండి ఎలాగూ ఏదీ తీసుకుని రాలేము కాబట్టి.. కనీసం ఇష్టమైన సినిమా ఏమిటో కనుక్కుని దాన్ని చూపించండి. కుదిరితే ఆమె పనుల్లో సహాయం చేయడానికి ప్రయత్నించండి.. ఎలాగూ చేయనివ్వదనుకోండి.
ఆ తర్వాత ఇంట్లో ఉన్న పాత ఆల్బమ్ ను తీసుకోండి. అందులో బంధువులు ఎవరు.. ఎక్కడెక్కడ ఉన్నారు.. అన్నీ తనే చెప్తుంది. ఎవరితో ఎందుకు మాట్లాడడం లేదో కూడా చెప్పేస్తుంది. అలాంటి వారెవరినైనా చాలా కాలంగా మాట్లాడాలని అమ్మ అనుకుంటూ ఉంటుంటే.. మేరే కనుక్కుని కాల్ చేసి వారి మధ్య ఉన్న దూరాన్ని చెరిపేయండి. తల్లి పడే కష్టాన్ని ఇంట్లో ఉండే కళ్లారా చూస్తున్నారు కదా.. ఆమె ముఖంలో నవ్వు తీసుకుని వచ్చే పనులు చేయడం కూడా మనకు ఎంతో సంతృప్తిని ఇస్తుంది. కానీ ఒక్క సారి ఆమెను ఇన్ని పనులు ఎలా చేయగలుగుతున్నావమ్మా అని అడగండి.. చిరునవ్వే ఆమె నుండి వచ్చే సమాధానం అవుతుంది.
ఇన్ని రోజుల పాటూ తల్లితో ఉండే అవకాశం చాలా తక్కువ మందికి వచ్చింది. ఆమెతో సంతోషంగా ఉంటూ కరోనా మహమ్మారిని ఎదుర్కోండి. అయినా తల్లి చెంతన ఉండగా ఏ మహమ్మారి మనల్ని ఏమి చేస్తుంది చెప్పండి.