బౌద్ధ సన్యాసులను లైంగిక సంబంధాలలోకి రప్పించి, డబ్బు కోసం బ్లాక్ మెయిల్ చేసినందుకు థాయ్ లాండ్ పోలీసులు ఒక మహిళను అరెస్టు చేశారు. దీంతో థాయిలాండ్‌లో భారీ లైంగిక, దోపిడీ కుంభకోణం బయట పడింది. ఈ కేసు ప్రజల దృష్టిని ఆకర్షించింది. ఈ కుంభకోణంలో భాగమైన తొమ్మిది మంది మఠాధిపతులు, సీనియర్ సన్యాసులను బహిష్కరించినట్లు రాయల్ థాయ్ పోలీస్ సెంట్రల్ ఇన్వెస్టిగేషన్ బ్యూరో తెలిపింది.
బ్యాంకాక్‌కు ఉత్తరాన ఉన్న నోంతబురిలోని విలాసవంతమైన ఇంట్లో 30 ఏళ్ల వయసున్న విలావన్ ఎమ్సావత్ అనే మహిళను అరెస్టు చేశారు. ఆమెపై దోపిడీ, మనీలాండరింగ్, దొంగిలించబడిన వస్తువులను స్వీకరించడం వంటి ఆరోపణలు ఉన్నాయి. ఆమెకు తొమ్మిది మంది బౌద్ధ సన్యాసులతో లైంగిక సంబంధాలు ఉన్నాయని చెప్పారు. ఆమె ఫోన్‌లను స్వాధీనం చేసుకున్న తర్వాత సందేశాలు, సన్నిహిత వీడియోలను కనుగొన్నారు. ఆమె బ్లాక్‌మెయిల్ డబ్బును ఉపయోగించి చట్టవిరుద్ధమైన ఆన్‌లైన్ జూదంలో భారీగా ఖర్చు చేసిందని కూడా వారు కనుగొన్నారు. ది టైమ్స్ ప్రకారం, కొంతమంది సన్యాసులు విలావన్‌తో సంబంధాలు కలిగి ఉన్నట్లు అంగీకరించారు, ఆమె సోషల్ మీడియాలో వారిని సంప్రదించినట్లు తెలిసింది.