ప్రకాశం: మర్రిపూడి మండలంలోని పొట్టిరెడ్డిపాలెంలో విషాదం చోటు చేసుకుంది. వారికి ఏం కష్టం వచ్చిందో.. ఏమో తెలియదు కానీ.. తల్లీ, కూతుళ్లు ఇద్దరూ ఫ్యాన్‌కు ఉరివేసుకొని ఆత్మహత్యకు పాల్పడ్డారు. గ్రామంలో శుక్రవారం సాయంత్రం జరిగిన ఈ ఘటన స్థానికంగా తీవ్ర కలకలం రేపుతోంది. పోలీసుల కథనం మేరకు.. పొట్టిరెడ్డిపాలెం గ్రామానికి చెందిన సందల జనార్దన్‌ రెడ్డికి 15 ఏళ్ల క్రితం కోటేశ్వరమ్మతో పెళ్లి జరిగింది. వీరు వ్యవసాయం చేసుకుంటూ తమ జీవనాన్ని సాగిస్తూ వచ్చారు. జనార్దన్‌, కోటేశ్వరమ్మలకు ఒక అబ్బాయి, ఇద్దరు అమ్మాయిలు ఉన్నారు. భర్త జనార్దన్‌ రోజువారి పనుల్లో భాగంగానే పొలం పనికి వెళ్లాడు.

Also Read: ఇక ఆ నేతలు ఇంట్లో కూర్చోవాల్సిందేనా..!

ఇంట్లో ఎవరూ లేని సమయం చూసి తల్లీ కూతుళ్లు ఇద్దరూ చీరతో ఉరివేసుకొని ఆత్మహత్యకు పాల్పడ్డారు. కోడలు, మనువరాలు ఉరివేసుకున్న సంఘటనను చూసిన మామ బక్కెయ్య వెంటనే తన కొడుకు జనార్దన్‌కు సమాచారం ఇచ్చాడు. పొలం నుంచి జనార్దన్ పరుగున ఇంటికి వచ్చేసరికి భార్య కోటేశ్వరమ్మ, కూతురు నందిని (13) మంచంపై మృతదేహాలుగా పడి ఉన్నారు. కూతురు నందినిని కూర్చీ ఎక్కించి చీరతో ఫ్యాన్‌కు ఉరి వేసి, ఆ తర్వాత కోటేశ్వరమ్మ కూడా ఉరివేసుకొని ఆత్మహత్య చేసుకొని ఉంటుందని పోలీసులు భావిస్తున్నారు. భార్య, భర్తల మధ్య చిన్నపాటి గొడవలు ఉన్నాయని తెలిసింది. అయితే ఆత్మహత్యకు పాల్పడేంత గొడవలు లేవని స్థానికులు అనుకుంటున్నారు. ఈ ఘటనపై కేసు నమోదు చేసుకున్న పోలీసులు దర్యాప్తు చేస్తున్నారు. జనార్దన్‌ కూతురు నందిని మర్రిపూడిలోని ప్రభుత్వ పాఠశాలలో చదువుకుంటోంది. విషయం తెలుసుకున్న బంధువులు, గ్రామస్తులు విషాదంలో మునిగిపోయారు. ఇదే గ్రామంలో గత ఆరు నెలల కాలంలో నలుగురు ఆత్మహత్య చేసుకోవడం తీవ్ర కలకలం సృష్టిస్తోంది.

Also Read: కరోనాపై కేంద్ర ఆరోగ్యశాఖ బులెటిన్‌

అంజి

నేను గోనె అంజి. న్యూస్‌ మీటర్‌ తెలుగులో సబ్‌ ఎడిటర్‌గా విధులు నిర్వర్తిస్తున్నాను. గతంలో 99టీవీ, మోజో టీవీ, ఐ న్యూస్‌, ప్రైమ్‌ 9 న్యూస్‌ ఛానెళ్లలో న్యూస్‌ కాపీ ఎడిటర్‌గా పని చేశాను. జర్నలిజం పట్ల ఇష్టంతో ఈ వృత్తిని ఎంచుకున్నాను. 2018లో బ్యాచ్‌లర్‌ ఆఫ్‌ ఆర్ట్స్‌ జర్నలిజంలో డిగ్రీ పట్టా పొందాను.

Next Story