Fact Check : అఖిలేష్ యాదవ్ చేతిలో రించీ.. ఆయనకు దాంతో ఏమి పని..!
By న్యూస్‌మీటర్ తెలుగు
ఉత్తరప్రదేశ్ మాజీ ముఖ్యమంత్రి అఖిలేష్ యాదవ్, ఆయన పక్కన ఆర్జేడీ నేత తేజ్ ప్రతాప్ యాదవ్ నిలబడి ఉండగా తీసిన ఫోటో ప్రస్తుతం సామాజిక మాధ్యమాల్లో వైరల్ అవుతూ ఉంది.
ఈ ఫోటోలో అఖిలేష్ యాదవ్ పక్కన లాలూ ప్రసాద్ యాదవ్ కుమారుడు నిలబడి ఉండగా.. అఖిలేష్ యాదవ్ చేతిలో రించీ ఉంది. ఈ ఫోటో ప్రస్తుతం సామాజిక మాధ్యమాల్లో విపరీతంగా వైరల్ అవుతోంది.
కొద్దిరోజుల కిందట అఖిలేష్ యాదవ్ గవర్నమెంట్ బంగ్లాకు సంబంధించిన వివాదం నడిచింది. ఇప్పుడు ఈ ఫోటోను షేర్ చేసిన నెటిజన్లు ఆ రించీతో ఏమి తెరచి ఉంటారబ్బా అంటూ పోస్టులు పెడుతూ ఉన్నారు. “Now you people must have known what is opened from this wrench.” అంటూ పోస్టులు పెడుతూ వస్తున్నారు. రించీని పట్టుకున్న చేతిని చూపిస్తూ పలువురు వ్యాఖ్యలు చేస్తూ ఉన్నారు.
“We open the sparks at a reasonable rate, bring the tools together”.అంటూ మరొకరు పోస్టు పెట్టారు.
నిజ నిర్ధారణ:
వైరల్ అవుతున్న ఫోటోను మార్ఫింగ్ చేశారు. ఒరిజినల్ ఫోటోలో రించీ అసలు లేదు. వైరల్ అవుతున్న పోస్టుల్లో ఎటువంటి నిజం లేదు.
ఈ ఫోటోకు సంబంధించి న్యూస్ మీటర్ రివర్స్ ఇమేజ్ సెర్చ్ చేయగా.. జనసత్తా గ్యాలరీలో కూడా కనిపించింది. ఈ ఒరిజినల్ ఫోటోను చూడగా.. అందులో అఖిలేష్ యాదవ్ చేతులో ఎటువంటి రించీ లేదు. అఖిలేష్ యాదవ్ చేతిలో రించీ ఉన్నట్లు మార్ఫింగ్ చేశారు.
ఒరిజినల్ ఫోటోను తేజ్ ప్రతాప్ యాదవ్ కూడా ఆగష్టు నెలలో పోస్టు చేశాడు. తాను ఇటావాకు వెళ్లిన సమయంలో అఖిలేష్ యాదవ్ ను కలిశానని చెప్పుకొచ్చాడు. అందుకు సంబంధించిన ఫోటోలను కూడా తేజ్ ప్రతాప్ యాదవ్ తన సోషల్ మీడియా అకౌంట్స్ లో పోస్టు చేశాడు. తేజ్ ప్రతాప్ యాదవ్ తన ట్విట్టర్ ఖాతాలో ఆగష్టు 19, 2020న ఒరిజినల్ ఫోటోను పోస్టు చేసాడు.
2018లో సుప్రీం కోర్టు ఆదేశాల ప్రకారం అఖిలేష్ యాదవ్ ను ప్రభుత్వ బంగ్లాను ఖాళీ చేయమని చెప్పారు. ఆయన ఖాళీ చేసిన తర్వాత బంగ్లాలోని టైల్స్ కాస్తా విరిగిపోయాయి.. నీటి కుళాయిలను విరిచి వేశారంటూ సామాజిక మాధ్యమాల్లో పోస్టులు వైరల్ అయ్యాయి.
ఈ వివాదంపై అఖిలేష్ యాదవ్ స్పందించారు. తనకు ప్రభుత్వ బంగ్లాను ఎలాగైతే ఇచ్చారో అలాగే తిరిగి ప్రభుత్వానికి అప్పజెప్పానని అన్నారు. ఆ బంగ్లాలో తన వస్తువులేవైతే ఉన్నాయో వాటిని తీసుకుని వెళ్లిపోయానని అన్నారు అఖిలేష్.
వైరల్ అవుతున్న పోస్టు ఫేక్. ఈ ఫోటోను కొన్ని సాఫ్ట్ వేర్ లను ఉపయోగించి ఎడిట్ చేశారు. కాబట్టి వైరల్ అవుతున్న పోస్టులు 'పచ్చి అబద్ధం'.