మారటోరియం: వడ్డీపై వడ్డీ మాఫీ విచారణ మరోసారి వాయిదా
By సుభాష్
మారటోరియం కేసులో విచారణను సుప్రీం కోర్టు అక్టోబర్ 13వ తేదీకి వాయిదా వేసింది. ఈ మేరకు ప్రభుత్వానికి, ఆర్‌బీఐకు వడ్డీలు లెక్కగట్టేందుకు మార్గదర్శకాల జారీ, నోటిఫికేషన్స్ వంటి అంశాలపై అఫిడవిట్ దాఖలు చేయాలని పేర్కొంది. సోమవారం దీనిపై వాదనలను విన్న జస్టిస్ అశోక్ భూషణ్ నేతృత్వంలోని సుప్రీం కోర్టు ధర్మాసనం ఆరు నెలల రుణ తాత్కాలిక నిషేధ కాలంలో వడ్డీని వదలుకోవాలని విజ్ఞప్తి చేసింది. వడ్డీపై వడ్డీ మాఫీకి కేంద్ర ప్రభుత్వం అంగీకారం తెలిపిన నేపథ్యంలో అదనపు అఫిడవిట్లు దాఖలు చేయడానికి ఆర్బీఐకి, కేంద్రానికి ఒక వారం రోజుల పాటు గడువు ఇచ్చింది. రియల్ ఎస్టేట్ అసోసియేషన్లు క్రెడాయ్, విద్యుత్ ఉత్పత్తిదారులు లేవనెత్తిన సమస్యలను కూడా పరిశీలించాలని సుప్రీం కోర్టు కోరింది.
అనంతరం తదుపరి విచారణ 13కు వాయిదావేసింది. అయితే సెప్టెంబర్ 10న దాఖలు చేసిన అఫిడవిట్ సుప్రీం కోర్టు అడిగిన ప్రశ్నలకు సంబంధించి వివరాలను ఇవ్వలేదని ధర్మాసనం పేర్కొంది. కాగా, కరోనా మహమ్మారి నేపథ్యంలో విధించిన మారటోరియం కాలంలో వ్యక్తిగత రుణగ్రహీతలు, చిన్న, మధ్య స్థాయి పరిశ్రమలకు కేంద్రం భారీ ఊరట లభించింది. కోవిడ్ నేపథ్యంలో ప్రకటించిన వాయిదాల చెల్లింపులపై మారటోరియంలో ఆయా రుణాల వడ్డీపైని మాఫీ చేసేందుకు కేంద్రం అంగీకరిచింది. రూ.2 కోట్ల వరకు రుణాలపై మారటోరియం విధించిన ఆరునెలల కాలానికి ఈ రద్దు వర్తింపజేయనున్నట్లు ధర్మాసనం తెలిపింది. ఇందుకు గాను రూ.5వేల కోట్ల నుంచి 7వేల కోట్ల వరకు ఖర్చు అవుతాయని, చక్రవడ్డీ మాఫీకి సంబంధించిన క్లెయిమ్‌ల వివరాలను బ్యాంకులు కేంద్రానికి సమర్పిస్తే ప్రభుత్వం నగదును ఖాతాలకు బదిలీ చేయనుంది.