బీజేపీ నేత దారుణ హత్య
By సుభాష్ Published on 5 Oct 2020 12:51 PM IST
పశ్చిమబెంగాల్ బీజేపీ ఎంపీ అర్జున్‌సింగ్ ముఖ్య అనుచరుడు, టిటాగర్ మున్సిపల్ కౌన్సిలర్ మనీష్ శుక్లా దారుణ హత్యకు గురయ్యాడు. పోలీసు స్టేషన్ సమీపంలో దుండగులు అతనిపై కాల్పులు జరిపి హతమార్చారు. ఈ హత్యకు నిరసనగా బీజేపీ మద్దతుదారులు పోలీసుస్టేషన్ వద్ద ఆందోళనకు దిగారు. కాగా, పార్టీ కార్యకర్తలతో సమావేశం నిర్వహించిన అనంతరం ఆదివారం రాత్రి కార్యకర్తలతో మాట్లాడుతుండగా, ముసుగులు ధరించిన ఇద్దరు గుర్తు తెలియని వ్యక్తులు శుక్లాపై అతి సమీపం నుంచి కాల్పులు జరిపారు. తల, ఛాతిపై బుల్లెట్లు దిగడంతో ఆయన అక్కడికక్కడే కుప్పకూలిపోయాడు. తీవ్ర గాయాలతో ఉన్న శుక్లాను కోల్‌కతా ఆస్పత్రికి తరలించి చికిత్స పొందుతూ మృతి చెందాడు. ఈ ఘటనలో మరో ఇద్దరు కూడా తీవ్రంగా గాయపడ్డారు. విషయం తెలుసుకున్న పోలీసులు ఘటన స్థలానికి చేరుకుని పరిశీలించారు. ఈ ఘటనపై బీజేపీ 12 గంటల పాటు బంద్‌కు పిలుపునిచ్చింది.
అయితే ఈ దాడి తృణమూల్ కాంగ్రెస్ పాల్పడిందని ఎంపీ అర్జున్‌సింగ్ ఆరోపించారు. రాత్రి 8 గంటల సమయంలో తనతో ఉన్నారని, పోలీసుల సమక్షంలో శుక్లాపై కాల్పులు జరిగాయని ఆరోపించారు. అలాగే గవర్నర్ జగదీష్ ధన్‌ఖర్ రాష్ట్ర హోంశాఖ కార్యదర్శి, డీజీపిని రాజ్‌భవన్‌కు పిలిపించారు. మనీష్ తనకు తమ్ముడిలాంటి వాడని, బెంగాల్ ప్రజల కోసం తన జీవితాన్ని త్యాగం చేశాడంటూ ఆవేదన వ్యక్తం చేశారు. ఈ ఘటనను బీజేపీ జాతీయ ప్రధాన కార్యదర్శి కైలాష్ విజయవర్గియా కూడా తీవ్రంగా ఖండించారు. ఈ కేసును సీబీఐకి అప్పగించాలని డిమాండ్ చేశారు.
అయితే ప్రతిపక్ష బీజేపీ ఆరోపణలను టీఎంసీ తోసిపుచ్చింది. పార్టీలో అంతర్గత పోరుకు శుక్లా హత్య నిదర్శనమని ఖండించారు. లేనిపోని ఆరోపణలతో తృణమూల్ కాంగ్రెస్ పార్టీ ప్రతిష్టను దెబ్బతీసేందుకు ప్రయత్నిస్తున్నారని టీఎంసీ నేత నిర్మల్ ఘోష్ మండిపడ్డారు. కాగా, 2019లో బీజేపీలో చేరిన మనీష్ శుక్లా.. ఎంపీ అర్జున్ సింగ్ ప్రధాన అనుచరుడు. శుక్లా బీజేపీలో చేరడానికి ముందు తృణమూల్ కాంగ్రెస్‌లో ఉన్నారు.