జగన్ కేబినెట్ లో మంత్రులయ్యే ఛాన్సు వారిద్దరికేనా?
By న్యూస్‌మీటర్ తెలుగు Published on 23 Jun 2020 9:37 AM GMTఇటీవల రాజ్యసభ ఎన్నికలు ముగిసిన సంగతి తెలిసిందే. ఏపీ అధికారపక్షానికి చెందిన నలుగురు సభ్యులు ఎన్నిక కాగా.. వారిలో ఇద్దరు ప్రస్తుతం ఏపీ మంత్రివర్గంలో మంత్రులుగా బాధ్యతలు నిర్వహిస్తున్న సంగతి తెలిసిందే. మరి.. వారి స్థానంలో అవకాశాన్ని సొంతం చేసుకునే వారెవరు? అన్నదిప్పుడు ఆసక్తికర చర్చగా మారింది. మంత్రులుగా వ్యవహరిస్తున్న పిల్లి సుభాష్ చంద్రబోస్.. మరో మంత్రి మోపిదేవిలు రాజ్యసభకు వెళ్లనున్న నేపథ్యంలో తమ మంత్రి పదవులకు రాజీనామా చేయాల్సి ఉంటుంది.
మరి.. ఇలా ఖాళీ అయిన పదవులు ఎవరికి కట్టబెడతారన్న చర్చ పార్టీలో జోరుగా సాగుతోంది. విశ్వసనీయ వర్గాల సమాచారం ప్రకారం తాజాగా ఏర్పడే రెండు ఖాళీల్ని భర్తీ చేసేందుకు వీలుగా సీఎం జగన్ ఇప్పటికే కసరత్తు పూర్తి చేశారని చెబుతున్నారు. క్రిష్ణా జిల్లా పెడన ఎమ్మెల్యే జోగి రమేశ్.. తూర్పుగోదావరి జిల్లా ముమ్మడివరం ఎమ్మెల్యే పొన్నాడ వెంటక సతీశ్ కుమార్ లకు అవకాశం లభిస్తుందని చెబుతున్నారు.
సీనియార్టీతో పాటు.. సామాజికవర్గాల ప్రాతిపదికన వారిద్దరికి మంత్రి పదవులు లభించే అవకాశం ఉందంటున్నారు. త్వరలోనే తన నిర్ణయాన్ని జగన్ ప్రకటిస్తారన్న మాట వినిపిస్తోంది. అయితే.. తాజాగా మంత్రి పదవులు లభించే వారికి పదవీ కాలం ఏడాదిన్నర మాత్రమే ఉంటుందన్న అభిప్రాయం వ్యక్తమవుతోంది.
తమ ప్రభుత్వం కొలువు తీరిన రోజునే.. రెండున్నరేళ్ల పాలన అనంతరం 80 శాతం మంది మంత్రుల్ని మార్చటం జరుగుతుందని గతంలోనే జగన్ స్పష్టం చేసిన నేపథ్యంలో.. మరో ఏడాదిన్నర మాత్రమే ఇప్పటి మంత్రులకు అవకాశం ఉందంటున్నారు. ఈ కారణంతోనే కొందరు ఆశావాహులు మంత్రి పదవి కోసం ప్రయత్నాలు చేయలేదంటున్నారు. ఇప్పుడు కామ్ గా ఉండి.. రెండున్నరేళ్ల తర్వాత కేబినెట్ ప్రక్షాళన చేసే సమయంలో ప్రయత్నాలు చేసుకుంటే మంచిదన్న ఆలోచనలో ఉన్నారు.
అనుకుంటాం కానీ.. అప్పుడెప్పుడో వస్తుందో రాదో తెలీని మంత్రి పదవి కంటే.. ఇప్పుడు వచ్చేదే బెటర్ కదా? ఏడాదిన్నర అయితే మాత్రం.. మంత్రిగా ఉండటానికి ఇబ్బంది ఏముంటుంది? బాగా పని చేస్తే.. 20 శాతంలోకి వచ్చే అవకాశం ఉంటుంది కదా? అన్న వాదనను కూడా వినిపిస్తున్నారు. అది కూడా పాయింటే మరి.