లడఖ్ లో ప్రధాని మోదీ ఆకస్మిక పర్యటన.. సరిహద్దు పరిస్థితులపై సమీక్ష
By సుభాష్ Published on 3 July 2020 5:47 AM GMTభారత్ - చైనా దేశాల మధ్య నెలకొంటున్న తీవ్ర ఉద్రిక్తత పరిస్థితుల నేపథ్యంలో భారత ప్రధాని నరేంద్రమోదీ లడఖ్ లో ఆకస్మికంగా పర్యటించారు. శుక్రవారం ఉదయం సీడీఎస్‌చీఫ్ బిపిన్ రావత్‌తో కలిసి లేహ్‌కు చేరుకున్నారు. మోదీ పర్యటన సందర్భంగా సైనికాధికారులతో సమీక్ష నిర్వహించారు. అలాగే టాప్ కమాండర్‌లతోనూ సమావేశం కానున్నారు. వాస్తవాదీన రేఖ సమీపంలో తాజా పరిస్థితులను సైనికులతో అడిగి తెలుసుకుంటున్నారు.
జూన్ 15న గల్వాన్ లోయలో చోటు చేసుకున్నహింసాత్మక ఘటనలో భారత్‌కు చెందిన 20 మంది సైనికులు అమరులైన విషయం తెలిసిందే. ఈ దాడిలో మరికొందరు సైనికులు గాయపడ్డారు. దీంతో వారిని మోదీ పరమార్శించనున్నారు. అయితే సైనికులకు భరోసా ఇవ్వడం, చైనాకు గట్టి సందేశం ఇవ్వడంలో భాగంగానే మోదీ పర్యటిస్తుట్లు తెలుస్తోంది. తాజాగా మోదీ లడఖ్ లో పర్యటించడం ప్రాధాన్యత సంతరించుకుంది.
అలాగే చైనా మిలటరీ అధికారులతో జరుగుతున్న చర్చల గురించి కూడా మోదీ అడిగి తెలుసుకోనున్నారు. వాస్తవానికి శుక్రవారం రక్షణ శాఖ మంత్రి రాజ్‌నాథ్ సింగ్ లేహ్‌లో పర్యటన ఉండాల్సి ఉండేది. కానీ ఆయన షెడ్యూల్‌ను మార్చేశారు. దీంతో మోదీ పర్యటిస్తున్నారు. మోదీ వెంట త్రివిధ దళాల అధిపతి బిపిన్ రావత్‌తో పాటు ఆర్మీ చీఫ్ నరవాణే ఉన్నారు.