మృతుల కుటుంబాలకు మోదీ సంతాపం
By సుభాష్
ఉత్తరప్రదేశ్ రాష్ట్రంలోని కనౌజ్‌లో శుక్రవారం అర్థరాత్రి ఘోర బస్సు ప్రమాదం జరిగి 20 మంది వరకు ప్రయాణికులు సజీవదహనమైన విషయం తెలిసిందే. ఈ ఘటనపై ప్రధాని నరేంద్రమోదీ మృతుల కుటుంబాలకు సంతాపం వ్యక్తం చేశారు. ఈ ఘటన తనను తీవ్రంగా కలచివేసిందని ఆవేదన వ్యక్తం చేశారు. తీవ్రంగా గాయాలైన వారు త్వరగా కోరుకోవాలని మోదీ ఆకాంక్షిస్తూ ట్విట్టర్ లో పేర్కొన్నారు. సుమారు 50 మంది ప్రయాణికులతో వెళ్తున్న ఓ ప్రైవేటు బస్సును ట్రక్కు ఢీకొనడంతో డీజిల్ ట్యాంకర్ పగిలి మంటలు అంటుకున్నాయి. ఈ ఘటన విషయం తెలుసుకున్న పోలీసులు, అధికారులు, అగ్నిమాపక సిబ్బంది హుటాహుటిన చేరుకుని మంటలను ఆర్పివేసి సహాయక చర్యలు ముమ్మరం చేశారు. సిబ్బంది కొందరిని కాపాడగా, 20 మంది వరకు ప్రాణాలు కోల్పోయారు. సంఘటన స్థలం రోధనలతో దద్దరిల్లిపోయింది.
యోగి సర్కార్ ఎక్స్ గ్రేషియా
ప్రమాదంపై ఉత్తరప్రదేశ్ ముఖ్యమంత్రి యోగి ఆదిత్యానాథ్ స్పందించారు. ప్రమాదానికి గల కారణాలను అధికారులను అడిగి తెలుసుకున్నారు. సహాయక చర్యలు ముమ్మరం చేయాలని, క్షతగాత్రులకు మెరుగైన వైద్యచికిత్స అందేలా చర్యలు తీసుకోవాలని యోగి అధికారులకు సూచించారు. ప్రమాదంలో మృతి చెందిన కుటుంబాలకు రూ. 2 లక్షలు, క్షతగాత్రులకు రూ. 50 వేల చొప్పున ఎక్స్‌గ్రేషియా ప్రకటించారు. ప్రమాదానికి సంబంధించిన పూర్తి నివేదికలు సమర్పించాలని అధికారులను ఆదేశించారు.