ఢిల్లీ అల్లర్లపై స్పందించిన ప్రధాని మోదీ
By సుభాష్ Published on 26 Feb 2020 4:29 PM IST
ఢిల్లీలో సీఏఏపై అల్లర్లు తీవ్ర స్థాయికి చేరాయి. ఈ అల్లర్ల కారణంగా మృతుల సంఖ్య 20కి చేరగా, క్షతగాత్రుల సంఖ్య 150పైగా చేరింది. ఈ నేపథ్యంలో ప్రధాని నరేంద్రమోదీ స్పందించారు. చోటు చేసుకున్న అల్లర్లపై సమగ్రస్థాయి సమీక్ష నిర్వహించారు. ఈ మేరకు అల్లర్లపై మోదీ ట్విట్ చేశారు. శాంతి, సామరస్యం మన సమాజంలో భాగమన్నారు. అన్ని సమయాల్లో శాంతిని, సామరస్యాన్ని కాపాడాలని ఢిల్లీలోని సోదర, సోదరీమణులకు విజ్ఞప్తి చేస్తున్నట్లు మోదీ ట్విట్టర్లో పేర్కొన్నారు. వీలైనంత త్వరగా ప్రశాంతత ఏర్పడేలా చూడాలన్నారు. సీఏఏ వ్యతిరేక, అనుకూల వర్గాల మధ్య జరిగిన ఘర్షణల వల్ల ఢిల్లీ రణరంగంగా మారింది.
ఈశాన్య ఢిల్లీలో అల్లర్ల వెనుక నజీర్, చెను గ్యాంగ్‌లకు చెందిన 12 మంది ప్రమేయం ఉందని పోలీసులు గుర్తించారు. గత మూడు రోజులుగా దుండగులు 600 రౌండ్ల బుల్లెట్లు కాల్చినట్లు పోలీసులు పేర్కొన్నారు. కాగా, అల్లర్లను అదుపు చేసేందుకు పోలీసులు తీవ్రంగా శ్రమిస్తున్నారు.