మోదీ చేతులెత్తేశారా? చేసేదేమీ లేదా?

By Newsmeter.Network  Published on  27 Jun 2020 12:55 PM IST
మోదీ చేతులెత్తేశారా? చేసేదేమీ లేదా?

గడిచిన కొంతకాలంగా ప్రధానమంత్రి మోదీ మౌనంగా ఉంటున్నారు. అలా అనిఆయన పని చేయటం లేదని ఆరోపించటం లేదు. తక్కువ పని చేస్తున్నారని విమర్శలు చేయట్లేదు. మాయదారి రోగంపై సమరం చేయటంలో ప్రధాని మోదీకి మించినోళ్లు ఎవరూ లేరనే వేళ.. ఆయన ఏం చెబితే.. యావత్ జాతి అదే చేసింది. ఇంట్లో నుంచి రావొద్దంటే రాలేదు. దీపాలు పెట్టమంటే పెట్టారు. గంటలు కొట్టమంటే కొట్టారు. ఇలా ఎన్ని చేసినా.. దేశంలో మహమ్మారి తీవ్రత అంతకంతకూ పెరిగిపోవటమే కాదు.. ఇప్పుడు పీక్స్ కు చేరుకుందున్న మాట వినిపిస్తోంది. ఎక్కడి దాకానో ఎందుకు? తెలంగాణ రాష్ట్రంలో తాజాగా కేసులు 985. ఒక రోజులో ఇన్ని కేసులు అంటే మాటలు కాదు.

ఒకప్పుడు వంద కేసులు నమోదయ్యాయంటేనే వణికే పరిస్థితి. ఇప్పుడు విషయం వెయ్యి వరకూ వచ్చేసింది. దీంతో.. రాష్ట్రంలోని పలు ప్రాంతాల్లో ఇప్పుడు ప్రజలు ఆందోళన చెందుతున్నారు. ఇవాళో.. రేపో రోజుకు వెయ్యి చొప్పున పాజిటివ్ కేసులు నమోదైనా ఆశ్చర్యపోవాల్సిన అవసరం లేదు. పెరుగుతున్న కేసుల తీవ్రత నేపథ్యంలో హైదరాబాద్ కు చెందిన షాపుల యజమానులు తమకు తామే స్వీయ లాక్ డౌన్ ను విధించుకుంటున్న పరిస్థితి ప్రజల ఆలోచనలో వచ్చిన మార్పు ఏమిటన్న దానికి తాజాగా చోటు చేసుకుంటున్న పరిణామాలు నిదర్శనంగా చెప్పొచ్చు.

ఇలాంటివేళలో ప్రధాని నరేంద్ర మోదీ నుంచి వచ్చిన ఒక వీడియో సందేశం ఆసక్తికరంగా మారింది. దేశ ప్రజలకు మోడీ మీద ఉన్న నమ్మకం ఎంతో తెలిసిందే. అద్భుతాలు ఆయన మాత్రమే చేస్తారన్న విశ్వాసం చాలామంది మాటల్లో వ్యక్తమవుతుంటుంది. తాజాగా ఆయన ఆత్మ నిర్భర్ ఉత్తరప్రదేశ్ రోజ్ గార్ అభియాన్ పథకాన్ని ప్రారంభించారు. ఈ సందర్భంగా మాట్లాడిన ఆయన.. మహమ్మారికి వ్యాక్సిన్ వచ్చే వరకూ ప్రజలంతా అత్యంత అప్రమత్తంగా ఉండాలని కోరారు. వ్యాక్సిన్ వచ్చే వరకూ భౌతిక దూరంతో పాటు.. మాస్కుల్ని తప్పకుండా ధరించాలని కోరారు.

ప్రతి ఒక్కరి జీవితంలో ఎత్తు పల్లాలు సహజమని.. కానీ ప్రపంచం మొత్తం ఒకే సమయంలో ఒకే సమస్యను ఎదుర్కొంటుందని ఎవరూ ఊహించలేదన్న మాట చెప్పిన ఆయన.. ఈ వ్యాధి నుంచి ఎప్పుడు బయటపడతామన్న విషయం తెలీదన్న మాట చెప్పేయటం గమనార్హం. వ్యాక్సిన్ వచ్చే వరకూ భౌతిక దూరాన్ని పాటించాలని.. అదొక్కటే ఇప్పటికున్న పరిష్కారంగా చెబుతున్న ఆయన మాటల్ని విన్నంతనే.. నిజమే.. మహమ్మారి మీద మోడీ మాష్టారు ఇంతకు మించి ఏం చెప్పగలరన్న భావన కలుగక మానదు.

ఎంతకూ కొరుకుడు పడని మహమ్మారి మీద మోదీ చెప్పేదేమీ లేదు.. ప్రజలు సైతం చేయగలిగిందేమీ లేదని చెప్పాలి. మాస్కులు కట్టుకోవాలి. శానిటైజర్లు వాడాలి.. భౌతిక దూరాన్ని పాటించాలన్న ఖర్చు లేని మాటల్ని సందేశం రూపంలో ఇవ్వటం మినహా ఇప్పటికైతే పాలకులు చేసేది శూన్యమన్న విషయం మోడీ మాటల్లో స్పష్టమైందని చెప్పక తప్పదు.

Next Story