Fact Check : రామాయణానికి చెందిన స్టాంపులను భారతప్రధాని నరేంద్ర మోదీ తాజాగా విడుదల చేశారా.?
By న్యూస్‌మీటర్ తెలుగు Published on 3 Aug 2020 12:05 PM GMTఅయోధ్య రామ మందిర నిర్మాణానికి సంబంధించిన ఏర్పాట్లు చాలా వరకూ పూర్తీ అవుతున్నాయి. భారత ప్రధాని నరేంద్ర మోదీ ఈ చారిత్రాత్మకమైన ఘట్టానికి హాజరవుతూ ఉండడంతో అయోధ్య నగరాన్ని అద్భుతంగా ముస్తాబు చేస్తున్నారు. శ్రీరామ పట్టాభిషేకం, వనవాసం, సీతాలక్ష్మణ సమేతుడైన శ్రీరాముడు, సరియూ నదీ, దేవతా మూర్తుల చిత్రాలతో సిటీ రోడ్లు భక్తి భావాన్ని పెంపొందిస్తున్నాయి. సాయంకాలం వేళ విద్యుత్ కాంతులతో సరయూ నది వెలిగిపోతోంది. ఈ నెల 5న జరగనున్న ఆలయ భూమి పూజకు ఏర్పాట్లు వేగంగా జరుగుతున్నాయని శ్రీరామ జన్మభూమి తీర్థ ట్రస్ట్ తెలిపింది. కాషాయ రంగు జెండాలతో ఆ ప్రాంతమంతా నిండిపోయింది. రామ మందిరం భూమిపూజలో పాల్గొనడానికి ముందు భారత ప్రధాని నరేంద్ర మోదీ మార్గమధ్యంలోని ప్రఖ్యాత హనుమాన్ గధీ ఆలయంలో ప్రత్యేక పూజలు చేయనున్నారు. 10వ శతాబ్దం నాటి ఈ పురాతన ఆలయంలో ఆయన ఏడు నిమిషాల పాటు గడపనున్నారు. దేశంలోని పలు పుణ్యక్షేత్రాలు, చారిత్రాత్మకమైన ప్రాంతాల నుండి మట్టి, నీరు అయోధ్యకు తరలి వెళ్తున్నాయి.
ఇలాంటి సమయంలో భారత ప్రధాని నరేంద్ర మోదీ ప్రత్యేకంగా రామాయణ ఘట్టానికి సంబంధించిన స్టాంపులను విడుదల చేశారని సామాజిక మాధ్యమాల్లో పోస్టులు వెలిశాయి. రామ మందిరం శంకుస్థాపన కార్యక్రమానికి గుర్తుగా ఈ స్టాంపులను రిలీజ్ చేసినట్లు చెబుతున్నారు.
ఫేస్ బుక్ లో కూడా ఇది నిజమేనంటూ కొందరు పోస్టులు పెట్టారు.
నిజ నిర్ధారణ:
భారత ప్రధాని నరేంద్ర మోదీ రామాయణానికి సంబంధించిన పోస్టల్ స్టాంపులను విడుదల చేసింది 2017 సంవత్సరంలో..! వారణాసిలో నిర్వహించిన కార్యక్రమంలో మోదీ స్టాంపులను విడుదల చేశారు.
న్యూస్ మీటర్ రివర్స్ ఇమేజ్ సెర్చ్ చేయగా Scroll మీడియా సంస్థలో 2018లో వచ్చిన ఆర్టికల్ ను గమనించవచ్చు. ఈ స్టాంపులకు సంబంధించిన ఫోటోలు 2017 నుండి అందుబాటులో ఉన్నాయి.
“Ramayana stamps released in 2017”(రామాయణం స్టాంపులు 2017 నుండి అందుబాటులో ఉన్నాయి) అనే కీవర్డ్స్ ను ఉపయోగించి సెర్చ్ చేయగా postagestamps.gov.in వెబ్ సైట్ లో అందుకు సంబంధించిన సమాచారం ఉంది. ఇండియా పోస్ట్ సెప్టెంబర్ 22, 2017న ఈ స్టాంప్ లను విడుదల చేసినట్లు తెలుస్తోంది.
సెప్టెంబర్ 22, 2017న వారణాసిలో భారత ప్రధాని నరేంద్ర మోదీ ఈ స్టాంపులను విడుదల చేసినట్లు NDTV కథనాన్ని వెల్లడించింది. నరేంద్ర మోదీ ట్విట్టర్ అకౌంట్ లో కూడా పోస్టల్ స్టాంపులను విడుదల చేసిన ఫోటోలను పోస్టు చేశారు. రామాయణంలోని వివిధ ఘట్టాలకు సంబంధించిన స్టాంపులను విడుదల చేసినందుకు ఎంతో ఆనందంగా ఉందని మోదీ తెలిపారు.
Released postage stamps on the Ramayana. pic.twitter.com/E6wYPh2hmy
— Narendra Modi (@narendramodi) September 22, 2017
రామాయణ ఘట్టాలకు సంబంధించిన స్టాంపులను నరేంద్ర మోదీ ఇటీవలే విడుదల చేశారు అన్నది 'పచ్చి అబద్ధం'.