హైదరాబాద్‌: భారత్ లో హైడ్రాక్సీ క్లోరోక్విన్ మెడిసిన్ తోనే కరోనా బాధితులకు వైద్యం చేస్తున్నారని తెలుసుకున్న అగ్రరాజ్యం అధ్యక్షుడు డొనాల్డ్‌ ట్రంప్..ప్రధాని మోడీకి ఫోన్ చేసి..తమ దేశ పౌరుల కోసం ఆ మందును ఎగుమతి చేయాల్సిందిగా విజ్ఞప్తి చేశారు. అయితే ఈ విషయమై ట్రంప్‌కు మోదీ ఝలక్‌ ఇచ్చారు. హైడ్రాక్సీ క్లోరోక్విన్‌ను ఇవ్వడం వీలుకాదని చెప్పకనే చెప్పేశారు.

మోదీతో ట్రంప్‌ ఫోన్‌లో మాట్లాడిన రోజే నిబంధనలను మరింత కఠినతరం చేశారు. హైడ్రాక్సీ క్లోరోక్విన్..సాధారణంగా ఈ మందును మలేరియా వ్యాధిగ్రస్తులకు వాడుతారు. కానీ ప్రస్తుతం కరోనా విజృంభిస్తున్న వేళ వ్యాక్సిన్ లేకపోవడంతో కరోనా బారిన పడిన బాధితులకు అందించే వైద్యంలో ఎక్కువగా ఇస్తున్న మందు ఇదే. దీనిపై ట్రంప్‌ ఎక్కువగా ఆశలు పెట్టుకున్నారు. ఈ టాబ్లెట్‌ను సాధ్యమైనంత వరకు ఎక్కువగా సేకరించాలని అమెరికా భావిస్తోంది. ఈ క్రమంలోనే మలేరియా నివారణ మందును ఎక్కువ మొత్తంలో దిగుమతి చేసుకోవాలని చూస్తోంది. ఈ మేరకు అమెరికా దేశ సంస్థలు భారత్‌కు ఆర్డర్లు ఇచ్చాయి. ఇదే విషయమై ప్రధాని మోదీకి ట్రంప్‌ ఫోన్‌ చేశారు.

భారత్‌ భారీ స్థాయిలో హైడ్రాక్సీక్లోక్విన్‌ను తయారు చేస్తోంది. అమెరికా విజ్ఞప్తి మేరకు ఆ ఔషధాల్ని అందించాలని కోరామని, నా అభ్యర్థను వారు పరిశీలిస్తారు.. అలా చేస్తే వారిని నేను అభినందిస్తా అంటూ ట్రంప్‌ విలేఖరుల సమావేశంలో అన్నారు. కానీ భారత్‌ మార్చి 25 నుంచే హైడ్రాక్సీ క్లోరోక్విన్ ఎగుమతులను తాత్కాలికంగా ఆపివేసింది.

అయితే ట్రంప్‌ ప్రకటన చేసిన కొద్ది గంటల్లోనే హైడ్రాక్సీ క్లోరోక్విన్ ఎగుమతులకు సంబంధించి భారత్‌ నిబంధనలను మరింత కఠినం చేస్తూ నిర్ణయం తీసుకుంది. అన్ని రకాల మినహాయింపులను డైరెక్టర్‌ జనరల్‌ ఆఫ్‌ ఫారిన్‌ డ్రేట్‌ తక్షణమే రద్దు చేసింది. మొదటగా తప్పనిసరి పరిస్థితుల్లో మానవతా దృక్పథంతో కొంతమేరకు ఎగుమతి చేసేందుకు మినహాయింపునిచ్చింది. కానీ భారత్‌లో కరోనా వైరస్‌ కేసులు పెరుగుతుండటంతో శనివారం నాడు దీనిని కూడా తొలగిస్తూ జారీ చేసిన ఉత్తర్వులను డీజీఎఫ్‌టీ వెబ్‌సైట్‌లో పెట్టారు.

అంజి గోనె

నా పేరు గోనె. అంజి. న్యూస్‌మీటర్‌ తెలుగులో జర్నలిస్టుగా పని చేస్తున్నాను. గతంలో 99టీవీలో క్షేత్రస్థాయి అధ్యయనం చేశాను. మోజో టీవీలో సంవత్సరం పాటు జర్నలిస్టుగా పనిచేశాను. కలం నా బలం, సమస్యలే నా గళం. జర్నలిజం పట్ల ఇష్టంతో నేను ఈ వృత్తిని ఎంచుకున్నాను.