సీఎం గారు.. అలా చేయకండి : సీతక్క రిక్వెస్ట్
By న్యూస్‌మీటర్ తెలుగు Published on 18 Oct 2020 3:49 PM ISTసీతక్క.. తెలుగు రాజకీయాల గురించి పరిచయమున్న వారికి ఈ పేరు పరిచయం అక్కర్లేదు. ఫైర్‌బ్రాండ్ నేత. అసెంబ్లీలో పేదల సమస్యలపై తనదైన శైలిలో గళమెత్తి అధికార పక్షానికి ముచ్చెమటలు పట్టించే కాంగ్రెస్ ఎమ్మెల్యే. వేదిక ఏదైనా సీతక్క మార్కు ఉండాల్సిందే. తాజాగా ట్విటర్ వేదికగా కేసీఆర్‌కు ఓ విజ్ఞప్తి చేశారు. ప్రస్తుతం ఆ ట్వీట్ వైరల్ అవుతుంది.
సీఎం కేసీఆర్ తరుచూ ప్రగతి భవన్ నుండి గజ్వేల్ ఫామ్ హౌస్‌కు రాకపోకలు సాగిస్తుంటారన్న విషయం అందరికీ తెలిసిందే. భారీ కాన్వాయ్‌తో సీఎం ప్రయాణిస్తుంటారు. అయితే.. కేసీఆర్ రాకపోకల కారణంగా పోలీసులు వాహనాలను ఎక్కడికక్కడే ఆపేస్తుంటారు. దీనివల్ల పెద్ద ఎత్తున ట్రాఫిక్ కూడా జామ్ అవుతుంటుంది. అయితే.. భారీ వర్షాల సమయంలోనూ ఇది ఇలాగే కొనసాగుతుండటంపై సీతక్క ట్విట్టర్ వేదికగా సీఎంకు ఓ విజ్ఞప్తి చేశారు.
‘‘సీఎం కేసీఆర్ గారు... దయచేసి మీ 300 ఎకరాల ఫామ్ హౌస్ నుంచి సీఎం క్యాంప్ ఆఫీసుకు రాకపోకలు సాగించకండి. మీ ప్రయాణాల వల్ల ఈ భారీ వర్షాల్లో 60 కిమీ. మేర ట్రాఫిక్ జామ్ అవుతోంది. పాపం వాళ్లు కూడా జాగ్రత్తగా ఇళ్లకు చేరాలి కదా.. ఓ సారి ఆలోచించండి’’ అని ట్వీట్ చేశారు. ప్రస్తుతం సీతక్క ట్వీట్ నెట్టింట వైరల్ అవుతుంది.