చంద్రబాబుపై నిప్పులు చెరిగిన ఎమ్మెల్యే రోజా

By అంజి  Published on  20 Jan 2020 7:41 AM GMT
చంద్రబాబుపై నిప్పులు చెరిగిన ఎమ్మెల్యే రోజా

అమరావతి: టీడీపీ అధినేత చంద్రబాబుపై వైసీపీ ఎమ్మెల్యే, ఏపీఐఐసీ ఛైర్మన్ ఆర్కే రోజా ఫైర్‌ అయ్యారు. అసెంబ్లీ ముట్టడికి పిలుపునిచ్చిన అతన్ని ఏమనాలో అర్థకావడం లేదని ఆమె వ్యాఖ్యనించారు. ఒక తల్లి తనకు పుట్టిన ముగ్గురు పిల్లలను సమానంగా పెంచి పోషిస్తుందని, అదే విధంగా వైఎస్‌ జగన్‌ కూడా 13 జిల్లాలకు ముఖ్యమంత్రిగా ఉండి మూడు ప్రాంతాల ప్రజలకు అభివృద్ధిని, నీటిని, ఉద్యోగ అవకాశాలను సమానంగా ఇవ్వాలన్న సామాజిక న్యాయంతో ముందుకు వెళ్తున్నారని రోజా అన్నారు.

సామాజిక న్యాయం పక్కన పెట్టి చంద్రబాబు తన సామాజిక వర్గానికి న్యాయం చేసే విధంగా డ్రామాలను అందరూ అసహ్యించుకునే పరిస్థితికి వచ్చిందన్నారు. రాజధాని అంటే ఏ నగరం పేరు చెప్తామని చంద్రబాబు అంటున్నారని, రాష్ట్ర విభజన చట్టం ప్రకారం హైదరాబాద్‌ను 10 ఏళ్ల పాటు ఆంధ్రప్రదేశ్‌కు రాజధానిగా కల్పిస్తే చంద్రబాబు ఓటుకు నోటు కేసులో దొంగలా ఇరుక్కుపోయి అమరావతి పారిపోయి వచ్చాడన్నారు. రాష్ట్రం విడిపోయేటప్పుడు రూ.5లక్షలు కోట్లు ఉంటే రాజధానిని బ్రహ్మండంగా కట్టవచ్చన్న చంద్రబాబు.. ఇప్పుడేమో రూ.2 వేల కోట్లతో రాజధాని కట్టవచ్చని అంటున్నారని, ఒక వేళ అధికారంలో కోట్ల డబ్బులు మింగేదామనుకున్నారా అంటూ చంద్రబాబును ఎమ్మెల్యే రోజా ప్రశ్నించారు.

అమరావతి పరిసర గ్రామ ప్రజలను అడ్డుపెట్టుకొని చంద్రబాబు రాజకీయం చేస్తున్నారని ఎమ్మెల్యే రోజా నిప్పులు చెరిగారు. తన కొడుకు నారా లోకేష్‌ను గెలిపించుకోలేక పోయిన చంద్రబాబు... రాయలసీమ ద్రోహిగా మిగిలిపోయారని ఆమె వ్యాఖ్యనించారు. అమరావతిలో పెయిడ్‌ ఆర్టిస్టులతో నిరసన చేయిస్తున్నారని మండిపడ్డారు. కూకట్‌పల్లి నుంచి అమరావతికి మహిళలను చంద్రబాబు తరలించారని రోజా విమర్శించారు. హరిచందన, సిరిచందన రైతులా అంటూ ప్రశ్నించారు. కాల్‌ మనీ, సెక్స్‌ రాకెట్‌ సమయంలో వీరందరూ ఎక్కడున్నారన్నారు. అమరావతిలో ఇన్‌సైడర్ ట్రేడింగ్‌ పేరుతో వేల ఎకరాల భూములను కొనుగోలు చేశారన్నారు.

Next Story