కరోనా బారిన పడ్డ నేతలు.. ఆ ఎమ్మెల్యేను ఫాలో అయితే బాగుండు
By న్యూస్‌మీటర్ తెలుగు Published on 19 July 2020 6:12 AM GMTకరోనాకు వాళ్లు వీళ్లు అన్న మినహాయింపులేమీ లేవు. తన వద్దకు వచ్చినోడు ఎంతటోడినైనా ఇట్టే పట్టేసే ఈ మహమ్మారిన బారిన పడిన ప్రజా ప్రతినిధులకు కొదవ లేదు. పలువురు కరోనా బారి నుంచి బయటపడినా.. మరికొందరు నేతలు మాత్రం దానితో పోరాటం చేయలేక తుదిశ్వాస విడిచినోళ్లు ఉన్నారు. విజేతలుగా నిలిచిన ప్రజాప్రతినిధులకు స్ఫూర్తిగా నిలుస్తున్నారు. ఆమ్ ఆద్మీ పార్టీ మహిళా నేత.. కల్కాజీ ఎమ్మెల్యే అతిషి మల్రేనా. ఇటీవల పాజటివ్ గా వెల్లడై.. చికిత్స పొందిన సదరు ఎమ్మెల్యే కరోనా విజేతగా నిలిచారు.
నెగిటివ్ గా తేలిన తర్వాత.. తాజాగా ఫ్లాస్మా దానాన్ని చేశారు. కోవిడ్ 19 నుంచి కోలుకున్న వ్యక్తుల్లో కరోనా వైరస్ ను ఎదుర్కొనే యాంటీ బాడీలు డెవలప్ అవుతాయి. వాటిని సేకరించి కరోనా బారిన పడినవారికి ప్లాస్మా ద్వారా బదిలీ చేస్తే వారు కోలుకునే అవకాశం ఉంటుంది. ఇలా ఒక్కొక్కరు 250 నుంచి 500 మిల్లీ లీటర్ల ప్లాస్మాను దానం చేసే వీలుంది.
ఇలా దానం చేసిన ప్లాస్మాతో ఇద్దరికి వాడే అవకాశం ఉంది. మరో ఆసక్తికరమైన విషయం ఏమంటే.. ప్లాస్మా దానం ఎన్నిసార్లు చేసినా ఎలాంటి సైడ్ ఎపెక్టులు ఉండవు. ప్లాస్మా దానం గురించి వైద్యులు చెప్పటంతో కన్వీన్స్ అయిన అతిషి.. ప్లాస్మా దానం చేసేందుకు ముందుకొచ్చారు. సోషల్ మీడియాలో ఈ విషయాల్ని వెల్లడించిన సదరు ఎమ్మెల్యే కోవిడ్ విజేతలంతా ప్లాస్మా దానం చేయటానికి ముందుకు రావాలని కోరారు. మరో ఇద్దరు ప్రాణాల్ని కాపాడే అవకాశం రాదని.. వచ్చిన అవకాశాన్ని మిస్ చేసుకోవద్దని కోరారు.
ప్లాస్మా దానం చేసిన ఎమ్మెల్యేను రాష్ట్ర ముఖ్యమంత్రి కేజ్రీవాల్ అభినందించారు. ప్లాస్మా దానానికి అందరూ ముందుకు రావాలని కోరారు. తెలుగు రాష్ట్రాల్లోనూ ప్రజాప్రతినిధులు పలువురు కరోనా బారిన పడటం.. కోలుకోవటం తెలిసిందే. వారు కూడా ప్లాస్మా దానానికి ముందుకు రావటం ద్వారా.. సామాన్యుల్లో స్ఫూర్తి రగిలించే అవకాశం ఉంది. అంతకు మించి.. పలువురి ప్రాణాల్ని కాపాడే వీలుందన్న విషయాన్ని మర్చిపోకూడదు.