ఎల్లో వైరస్ కోరలు పీకే మందు ఉంది: మంత్రి కొడాలి నాని
By అంజి
అమరావతి: కరోనా వైరస్‌కు భయపడి చంద్రబాబు ఇంట్లో దాక్కున్నారని రాష్ట్ర పౌరసరఫరాల శాఖ మంత్రి కొడాలి నాని ఎద్దేవా చేశారు. వయస్సుపైబడి చస్తాననే భయంతో చంద్రబాబు ఆక్సిజన్ పెట్టుకొని బతుకుతున్నాడని విమర్శించారు. ఇలాంటి విపత్కర పరిస్థితుల్లో రాజకీయాలు చేయడం మానుకోవాలన్నారు. మన రాష్ట్రంలో ఎల్లో వైరస్ ఉందని.. అది కరోనా వైరస్ కంటే ప్రమాదకరమైనదన్నారు. అయితే ఎల్లో వైరస్ కోరలు పీకే మందు తమ దగ్గర ఉందన్నారు. కరోనా నుంచి ప్రజలను కాపాడాల్సిన బాధ్యత తమ ప్రభుత్వం ఉందని పేర్కొన్నారు. ప్రజలు కరోనా బారినపడకుండా సీఎం వైఎస్ జగన్ అద్బుతమైన చర్యలు తీసుకున్నారని చెప్పారు. చంద్రబాబులా ప్రచార పిచ్చి వైఎస్ జగన్‌కి లేదన్నారు. తప్పుడు ప్రచారం చేస్తే చంద్రబాబు బట్టలు ఊడదీయాల్సి వస్తుందని కొడాలి నాని ఫైర్ అయ్యారు.
అందరికీ రేషన్ అందించడమే ప్రభుత్వ లక్ష్యమన్నారు. ప్రజల నిత్యావసరాలకు ఇబ్బంది లేకుండా చూస్తున్నామని చెప్పారు. రేషన్ షాపుల వద్ద జనం గుంపులు గుంపులు ఉండకూడదని సూచించారు. ప్రజలకు ఇబ్బంది లేకుండా ఉచితంగా సరుకులు సరఫరా చేస్తున్నామని వివరించారు. వేలిముద్ర లేకుండా నిత్యావసర వస్తువులు ఇస్తున్నామన్నారు. గంటకు 20 నుంచి 25 మందికి మాత్రమే రేషన్ ఇవ్వగలుగుతున్నామని చెప్పారు. ప్రతి ఒక్క వినియోదారునికి సరుకులు అందిస్తామన్నారు.
Also Read: ఏప్రిల్‌లో భారత్‌లో ఎమర్జెన్సీ.. క్లారిటీ ఇచ్చిన సైన్యం
వాలంటరీ వ్యవస్థ ద్వారా సరుకులు ఇవ్వాలని కొందరు అడుగుతున్నారని చెప్పారు. గతంలో వాళ్లే వాలంటరీ వ్యవస్థను హేళన చేసిన నిష్టదరిద్రులు అంటూ మండిపడ్డారు. కరోనా నియంత్రణపై వాలంటీర్లు సైనికుల్లా పని చేస్తున్నారని అన్నారు. వాలంటీర్లు ఒకరి ఇంటికి తర్వాత మరొక ఇంటికి వెళ్తే కరోనా వలన ఇబ్బంది అవుతుందని ఇవ్వలేదన్నారు. అయినా వాలంటీర్లు ఖాళీగా లేరని, నిత్యం ప్రజల ఆరోగ్యాల గురించి పని చేస్తున్నారని మంత్రి కొడాలి నాని పేర్కొన్నారు.
చోడవరంలో మహిళ రేషన్‌కు వెళ్లి చనిపోయిందని కొన్ని పనికిమాలిన ఛానెల్స్ తప్పుడు ప్రచారం చేస్తున్నాయని మండిపడ్డారు. చంద్రబాబు ఊరకుక్కలు మహిళ రేషన్ కోసం వచ్చి చనిపోయిందని మొరుగుతున్నాయని విమర్శించారు. తప్పుడు వార్తలు రాయడానికి ఇది సమయం కాదని మంత్రి కొడాలి నాని అన్నారు.