సీఏఏకు వ్యతిరేకంగా 'మజ్లిస్' భారీ బహిరంగ సభ..
By అంజి Published on 25 Jan 2020 8:34 AM GMTహైదరాబాద్: చార్మినార్ ప్రాంతంలోని ఖిల్వత్ మైదానంలో ఇవాళ రాత్రి ఎంఐఎం భారీ బహిరంగ సభ నిర్వహించనుంది. పౌరసత్వ సవరణ చట్టం, జాతీయ పౌరసత్వ పట్టిక, జాతీయ పౌరపట్టికలకు వ్యతిరేకంగా ఎంఐఎం ఈ సభను నిర్వహించనుంది. రాత్రి 8 గంటల నుంచి ప్రారంభమయ్య ముషాహిరా, ఖవ్వాలీ కార్యక్రమాలు.. అర్థరాత్రి 12 గంటల అనంతరం జాతీయ పతాకావిష్కరణ తర్వాత ముగియనున్నాయి. ఈనేపథ్యంలో పోలీసులు భారీ బందోబస్తును ఏర్పాటు చేశారు. ఎలాంటి అవాంఛనీయ సంఘటనలు జరగకుండా రామగుండం పోలీస్ కమిషనర్ వి.సత్యనారాయణ పర్యవేక్షణలో అదనపు బలగాలతో భద్రతను ఏర్పాటు చేశారు. సీసీఎస్‌కు చెందిన ఏసీపీలు, ఇన్స్‌స్పెక్టర్లు అదనపు బాధ్యతలు అప్పగించారు. వీరు రెండు షిప్టుల్లో ఈ నెల 30 వరకు బందోబస్తు నిర్వహించనున్నారు. ఎంఐఎం సభ సందర్భంగా వాహనదారులకు ఎలాంటి ఇబ్బందులు కలగకుండా ముందు జాగ్రత చర్యలు తీసుకుంటున్నామని నగర ట్రాఫిక్ డీసీపీ కె.బాబురావు తెలిపారు.
మొదటగా చార్మినార్ వద్ద ఈ సభ నిర్వహించాలనుకుంది. ఆ తర్వాత పోలీసులు ఖిల్వత్ మైదానంలో సభను ఏర్పాటు చేసుకోవాల్సిందని చెప్పడంతో ఖిల్వత్ మైదానంలో ఏర్పాట్లు చేస్తున్నారు. ఈ నెల 24న ఖిల్వత్ మైదనాంలో సభ పనులను చార్మినార్ ఎమ్మెల్యే ముంతాజ్ అహ్మద్ ఖాన్, యాకుత్‌పురా ఎమ్మెల్యే సయ్యద్ అహ్మద్ పాషా తదితరులు ఏర్పాట్లను పర్యవేక్షించారు. ఈ కార్యక్రమానికి పెద్ద సంఖ్యలో ప్రజలు హాజరుకానున్నారు. ఈ క్రమంలో ప్రజలకు ఎలాంటి ఇబ్బందులు కలగకుండా ఎంఐఎం నాయకులు, కార్యకర్తలు ఏర్పాట్లు చేస్తున్నారు.
కాగా ఈ సభకు రాష్ట్ర హైకోర్టు షరతులతో కూడిన అనుమతి ఇచ్చింది. నగరంలో ఎలాంటి ర్యాలీ చేయకూడదని, కేవలం సభ మాత్రమే నిర్వహించుకోవాలని ఆదేశించింది. జనవరి 25వ అర్ధరాత్రి సీఏఏకు వ్యతిరేకంగా ఎంఐఎం చార్మినార్ ప్రాంతంలో ర్యాలీని నిర్వహించాలనుకున్నారు. దీనికి పోలీసులు కూడా అనుమతిచ్చారు. సభ మొత్తాన్ని వీడియోగ్రఫీ చేయాలంటూ తెలంగాణ డీజీపీని హైకోర్టు ఆదేశించింది. ఎక్కడా అల్లర్లు జరగకుండా చూడాలని, శాంతిభద్రతలకు విఘాతం కలిగిస్తే కేసులు నమోదు చేయాలని ఆదేశించింది.
మజ్లిస్ పార్టీ ఏర్పాటు చేసిన ఈ సభపై బీజేపీ తీవ్ర అగ్రహం వ్యక్తం చేసింది. అంతకుముందు నగర పోలీస్ కమిషనర్‌ను రాష్ట్ర బీజేపీ అధ్యక్షుడు కె.లక్ష్మణ్, అతని బృందం కలిసింది. బీజేపీ కార్యక్రమాలకు పోలీసులు అనుమతి ఇవ్వడం లేదని వారు ఫిర్యాదు చేశారు. కేంద్ర హోంశాఖ సహాయ మంత్రి హోదాలో కిషన్ రెడ్డి హాజరైన కనీసం గౌరవం ఇవ్వడం లేదని కమిషనర్‌కు బీజేపీ నాయకులు ఫిర్యాదు చేశారు. బీజేపీ కార్యక్రమాలకు అనుమతి ఇవ్వని పోలీసులు ఎంఐఎం పార్టీ చేసే కార్యక్రమాలకు అనుమతి ఎలా ఇస్తున్నారని ప్రశ్నించారు.