తల్లి ప్రేమ: కుమారున్ని సూట్‌కేస్‌పై పడుకోబెట్టి.. లాక్కుంటూ 800కి.మీ..

By సుభాష్  Published on  15 May 2020 5:51 AM GMT
తల్లి ప్రేమ: కుమారున్ని సూట్‌కేస్‌పై పడుకోబెట్టి.. లాక్కుంటూ 800కి.మీ..

ముఖ్యాంశాలు

  • వలస కూలీల కష్టాలు వర్ణానాతీతం

  • కుమారుడితో 800 కి.మీ కాలినడకన

  • కన్నీళ్లు తెప్పించే వలస కార్మికుల కష్టాలు

నడిచే అడుగు ఆరాటం.. పొట్ట కోసం పోరాటం.. ఇది వలస కూలీల ధీనస్థితి. రెక్కాడితే కాని డొక్కాడని పరిస్థితి. రోజు కూలీ పని చేస్తేనే వారికి నాలుగు మెతుకులు నోట్లోకి వెళ్లేది. లేదంటే పస్తులుండాల్సిందే. చాలీ చాలని కూలీ డబ్బులతో ఒక పూట తిన్నా.. మరో పూట పస్తులుండాల్సిన దుస్థితి. లాక్‌డౌన్‌ కారణంగా పని కూడా లేకుండా పోవడంతో తినేందుకు తిండి కూడా దొరకని పరిస్థితి దాపురించడంతో జీవన విధానంలో చీకట్లు అలుముకున్నాయి. జీవితంలో వెలుగు అనేది లేకుండా దూరమైపోయాయి. వెళ్దామంటే రవాణా సౌకర్యం లేక.. తినేందుకు తిండి లేక బిక్కు బిక్కుమంటూ గడిచిన రోజులవి.

వలస కార్మికుల బాధలు ఒక్కొక్కటిగా వింటుంటే ప్రతి ఒక్కరి హృదయాలు కదిలించేలా ఉన్నాయి. వారి బాధలు వర్ణానాతీతం. ఓ తల్లి పడుతున్న బాధతు చూస్తుంటే కన్నీళ్లు రాక మానదు. ప్రపంచంలో తల్లి ప్రేమ కంటే మరొక్కటి ఉండదు. చిన్నప్పుడు చలికి వణికిపోతుంటే వెచ్చటి దుప్పటి కప్పి కాపడుతుంది. అలాగే పెద్దయ్యాక సమస్యలతో సతమతమవుతుంటే ప్రార్థనలతో కాపాడుతుంది అమ్మ. ఎప్పుడు కూడా తల్లి ఏ విషయమైనా రెండు సార్లు ఆలోచిస్తుంది. ఒకసారి తనవైపు నుంచి, ఒకసారి బిడ్డ వైపు నుంచి. అలాంటి తల్లులకు రుణం తీర్చుకున్న తక్కువే. మనను ఈ నేల మీదకు తీసుకురావడానికి అమ్మ పడే బాధను మర్చి పోయి పెంచుతుంది. తను ఆకలితో ఉన్నా పిల్లలకు పెట్టి కానీ అమ్మ ముద్ద ముట్టదు. ఈ సృష్టిలో అమ్మకన్నా గొప్పది ఇంకోటి లేదు.. సృష్టిని సృష్టించిందే అమ్మ..అలాంటిది ఓ తల్లి గురించి చెప్పేదే.

ఇలా లాక్‌డౌన్‌ కారణంగా ఎందరో తీవ్ర ఇబ్బందులకు గురవుతున్నారు. వలస కార్మికుల కష్టాలు అన్నీ.. ఇన్నీ కావు. హైదరాబాద్‌ నుంచి మధ్యప్రదేశ్‌ రాష్ట్రానికి ఓ భర్త గర్భవతి అయిన భార్యను చంటి బిడ్డను తోడుపు బండిపై సుమారు 700 కిలోమీటర్లు నడిచిన ఘటన కన్నీళ్లు తెప్పిస్తుంటే తాజాగా మరో ఘటన కూడా కన్నీళ్లు తెప్పిచేలా ఉంది. ఇక అసలు విషయానికొస్తే.. లాక్‌డౌన్‌ కారణంగా స్వస్థలానికి వెళ్లేందుకు ఎలాంటి రవాణా సౌకర్యం లేకపోవడంతో వలస కార్మికులతో పాటు ఓ తల్లి తన కుమారున్ని పట్టుకుని బయలుదేరింది. అంతేకాదు అసిపోయిన కుమారున్ని తన వెంట ఉన్నఓ సూట్‌కేస్‌పై పడుకోబెట్టి తాడుతో లాక్కుంటూ సుమారు 800 కిలోమీటర్లు ప్రయాణించింది ఆ తల్లి. ప్రస్తుతం ఈ వీడియో సోషల్‌ మీడియాలో వైరల్ గా మారింది. ఈ వీడియోను చూసిన ప్రతి ఒక్కరు కూడా అయ్యో పాపం అనకుండా ఉండలేకపోతున్నారు.

Migrant Workers Try To Reach Home1

ఒక వైపు సూట్ కేసుపై కుమారున్ని పడుకోబెట్టి.. మరో వైపు సూట్‌ కేసును లాక్కుంటూ కాలినడకన వెళ్తున్న ఆమెను మీడియా ప్రశ్నిస్తే కనీసం మాట్లాడేందుకు కూడా ఓపిక లేకుండా పోయింది. వారంతా పంజాబ్‌ రాష్ట్రం నుంచి కాలినడకన ఉత్తరప్రదేశ్‌లోని ఝూన్సీ అనే గ్రామానికి బయలుదేరారు. తినేందుకు తిండి లేక, చేసుకునేందుకు పనులు లేక నానా అవస్థలు పడుతున్న వలస కార్మికుల జీవన స్థితిగదులు ప్రతి ఒక్కరిని కదిలిస్తున్నాయి. కొన్ని ప్రాంతాల్లో కొందరు ఆహారపదార్థాలు అందించడం, బిస్కెట్లు, తాగునీళ్లు, కొంత నగదును అందించడం లాంటివి చేస్తున్నారు.

అలాగే ముందు చెప్పినట్లుగా రాము అనే వలస కార్మికుడు గర్భవతి అయిన భార్య, చంటిపిల్లతో సహా స్వగ్రామమైన మధ్యప్రదేశ్‌లోని బాలాఘాట్‌కు బయలుదేరాడు. లాక్‌డౌన్‌ కారణంగా ఎలాంటి రవాణా సౌకర్యం లేకపోవడంతో చేసేదేమి లేక సుమారు 700 కిలోమీటర్ల దూరాన్ని ఓ తాత్కాలిక చెక్కబడిని తయారు చేసుకుని, దానిపై గర్భవతి అయిన భార్యను, కూతురిని కూర్చోబెట్టి తన ప్రయాణం సాగించాడు. అటవీ ప్రాంతంలో దొరికి ఓ కర్ర, చెక్క ముక్కతో ఓ తోడుపు బల్లగా తయారు చేసి భార్య, పిల్లలతో స్వస్థలానికి బయలుదేరిన రాము.

Migrant Workers Try To Reach Home2

ఈ వీడియో కూడా సోషల్‌ మీడియాలో వైరల్‌గా మారింది. ప్రతి ఒక్కరి హృదయాలను కదిలించే దృశ్యాలు ఎన్నో వెలుగు చూస్తున్నాయి. ఇవొక్కటే కాదు.. ఇలాంటివి ఎన్నో జరుగుతున్నాయి. ఇక తాజాగా కేంద్ర ప్రభుత్వం వలస కార్మికులు స్వస్థలాలకు వెళ్లేందుకు అనుమతి ఇవ్వడంతో కొందరు ఇతర వాహనాలపై సొంత రాష్ట్రాలకు వెళ్లే క్రమంలో పలు రోడ్డు ప్రమాదాలు జరిగి ఎందరో వలస కార్మికులు మృత్యువాత పడ్డారు. ఇటీవల కాలినడకన వెళ్తూ రైలు పట్టాలపై పడుకున్న వలస కార్మికులపై గూడ్స్‌ రైలు దూసుకెళ్లడంతో 19 మంది మృతి చెందారు. వారం రోజుల వ్యవధిలోనే ఇలాంటి రోడ్డు ప్రమాదాలు చాలానే జరిగాయి. ఎందరో వలస కార్మికులు రోడ్డు ప్రమాదాలకు బలయ్యారు.



Next Story