రైలు చక్రాల కింద ఛిద్రమైన వలస బతుకులు.. అదే వారికి చివరి నిద్ర

By సుభాష్  Published on  9 May 2020 7:25 AM GMT
రైలు చక్రాల కింద ఛిద్రమైన వలస బతుకులు.. అదే వారికి చివరి నిద్ర

ముఖ్యాంశాలు

► అలసిన బతుకులను వెంటాడిన మృత్యువు

► పట్టాలపైనే చెల్లాచెదురైన కూలీల మృతదేహాలు

► వలస కూలీలకు శాపంగా మారిన లాక్‌డౌన్‌

వారంతా వలస కూలీలు.. రెక్కాడితే కాని డొక్కాడని పరిస్థితి. వలస పక్షుల బతుకులు క్యాలెండర్‌లో ఒక్కో పేజీని చింపుతూ కడుపు నిండ తిన్న రోజులను లెక్కిస్తే ఒకటో, రెండో అని చెప్పవచ్చు. పొట్టచేత పట్టుకుని ఇతర పట్టణాలకు, రాష్ట్రాలకు వెళ్లిన వారి జీవితాలను చూస్తుంటే కన్నీళ్లు పెట్టిస్తోంది.

ప్రస్తుత తరుణంలో కరోనా వైరస్ కాలరాస్తుండటంతో వలస వెళ్లిన వారి పరిస్థితి అగమ్యగోచరంగా మారింది. వలస వెళ్లిన వారు కూలీలు చేసుకోలేని పరిస్థితి దాపురించింది. లాక్‌డౌన్‌ కారణంగా చేసుకోవడానికి పనులు లేక.. తినేందుకు తిండిలేక కాలినడకన ఇంటిబాట పట్టారు. ఆకలి బతుకులతో కాలినడకన వెళ్తున్న కూలీలకు రైలు రూపంలో మృత్యువును వెంటాడింది.

Train accident in Aurangabad శవాలను మోసుకెళ్తున్న దృశ్యం

శుక్రవారం తెల్లవారుజామున మహారాష్ట్రలోని ఔరంగబాద్‌ లో రైల్వే ట్రాక్‌పై నిద్రిస్తున్న వారిపై గూడ్స్‌ రైలు దూసుకెళ్లడంతో 19 మంది వలస కూలీలు చెల్లాచెదురై మృతి చెందగా, 50 మంది కూలీలకు తీవ్ర గాయాలు అయిన విషయం తెలిసిందే. అయితే ముందుగా 15 మంది మృతి చెందగా, తర్వాత ఆ సంఖ్య 19కి చేరింది. గాయాలైన వారు ఆస్పత్రిలో చికిత్స పొందుతున్నారు. మృతుల్లో చిన్నారులు కూడా ఉండటంతో కన్నీళ్లు తెప్పిస్తోంది.

ఛత్తీస్‌గఢ్‌ నుంచి మధ్యప్రదేశ్‌లో వలస వెళ్లిన కూలీలు పనులు లేక .. సరైన రవాణా సౌకర్యం లేక కాలినడకన స్వస్థలాలకు బయలుదేరారు. ఔరంగబాద్‌కు రాగానే చీకటి పడింది. అందులో కూలీలంతా అలసిపోయారు. అంతలోనే వారికి ఖాళీగా ఉన్న రైలు పట్టాలు కనిపించాయి. రైళ్లు వచ్చే పరిస్థితి లేదని భావించి.. నడిచే ఓపిక లేక.. పట్టాలపైనే నిద్రించారు. అలసిపోయిన వలస కూలీలు గాఢ నిద్రలోకి జారుకున్నారు. అదే చివరి నిద్ర అయిపోంది. పడుకున్నవారు పడుకున్నట్లే రైలు చక్రాలకింద నలిగిపోయారు. రైలు పట్టాలపైనే పడుకోవడమే వారికి శాపంగా మారింది. దుర్భర జీవితాలు అనుభవిస్తున్న వలస కూలీలు మృతి చెందడంపై వారి వారి కుటుంబీకులు కన్నీరుమున్నీరవుతున్నారు. ఘటన ప్రాంతంలో రోధనలతో దద్దరిల్లిపోయింది.

Train Accident In Aurangabad1 పట్టాలపై చెల్లాచెదురైన కూలీల రొట్టెలు, ఇతర వస్తువులు

Next Story