లాక్‌డౌన్: కన్నీళ్లు పెట్టిస్తున్న వలస కూలీల దీనస్థితి
By సుభాష్ Published on 28 April 2020 5:35 AM GMTవలస పక్షుల బతుకులు క్యాలెండర్‌లో ఒక్క పేజీని చింపుతూ కడుపు నిండ తిన్న రోజులను లెక్కిస్తే ఒకటో, రెండో అని చెప్పవచ్చు. పొట్టచేత పట్టుకుని ఇతర పట్టణాలకు, రాష్ట్రాలకు వెళ్లిన వారి జీవితాలను చూస్తుంటే కన్నీళ్లు పెట్టిస్తోంది. ప్రస్తుత తరుణంలో కరోనా వైరస్ కాలరాస్తుండటంతో వలస వెళ్లిన వారి పరిస్థితి అగమ్యగోచరంగా మారింది. వలస వెళ్లిన వారు కూలీలు చేసుకోలేని పరిస్థితి దాపురించింది. లాక్‌డౌన్ కారణంగా సరైన పనులు లేక, ఒక వేళ పనులు చేసినా కూలీ డబ్బులు ఇవ్వలేని పరిస్థితి నెలకొనడంతో వారి బతుకులు కష్టతరంగా మారింది. వలస కూలీల పరిస్థితి చూస్తుంటే కన్నీళ్లు తెప్పించే విధంగా ఉంది.
దేశ వ్యాప్తంగా లాక్‌డౌన్‌తో వలస కూలీలు తీవ్ర ఇబ్బందులకు గురవుతున్నారు. తెలుగు రాష్ట్రాల నుంచి ఇతర పట్టణాలు, రాష్ట్రాలకు వలస వెళ్లిన వారు చాలా మంది ఉన్నారు. తాజాగా ముంబై నగరంలో చిక్కుకున్న నల్గొండ జిల్లాకు చెందిన ఎంతో మంది వలస కార్మికులు కష్టాలను ఎదుర్కొంటున్నారు. వివిధ రకాల దినసరి కూలీ పనులు చేసుకుంటూ ముంబై నగరంలో అనేక మంది జీవిస్తున్నారు. చాలా మంది కార్మికులు అదాని సంస్థకు చెందిన విద్యుత్ కార్మికులుగా జీవనం గడుపుతున్నారు. డ్రైవర్‌గా, పాల వ్యాపారం, ప్లంబర్, భవన నిర్మాణ పనుల్లో చేసే చిన్నచిన్న కూలినాలి పనులు చేసుకుని పూరి గుడిసెల్లో వేలాది మంది జీవనం వెళ్లదీస్తున్నారు.
ఇప్పుడు కరోనాతో లాక్‌డౌన్ ఉన్న పరిస్థితుల్లో మాకు కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు ఆదుకోవడం లేదని, ప్రతీక్ ఫౌండేషన్ ద్వారా మమ్మల్ని ఆదుకోండి అంటూ కోమడిరెడ్డి వెంకట్‌రెడ్డి, కోమటిరెడ్డి రాజగోపాల్‌రెడ్డిలను అక్కడున్న నల్గొండ జిల్లావాసులు కోరుతున్నారు.
తినడానికి తిండి లేక నానా అవస్థలు పడుతున్నామని ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. కాగా, దాతల సహాయంతో సుమారు 600 మందికిపైగా వలస కార్మికులకు నిత్యావసర సరుకులు పంపిణీ చేశారని, ఇంకా వందలాది కార్మికులు పస్తులుండాల్సిన పరిస్థితి ఉందని, తమను ఆదుకోవాలని కూలీలు కోరుతున్నారు.
ఇలా దేశంలో ఎంతో మంది ఇతర పట్టణాలకు, రాష్ట్రాలకు వలస వెళ్లిన వారి జీవితాల్లో కరోనా వైరస్ నిప్పులు పోసినట్లుగా మారింది. సొంతూళ్లకు వెళ్లాలన్నా లాక్‌డౌన్ కారణంగా రవాణా సౌకర్యం లేని పరిస్థితి. ప్రస్తుతం వలస వెళ్లిన వారికి పనులు చేసుకుందామంటే దొరకని పరిస్థితి. రోజు కూలీ చేసుకుని కడుపు నింపుకొనే వారికి తినడానికి తిండి లేక తీవ్ర అవస్థలు పడుతున్న పరిస్థితి.
ఒక్క తెలుగు రాష్ట్రాల్లోనే కాకుండా వివిధ రాష్ట్రాల వలస కూలీలకు ఇదే పరిస్థితి నెలకొంది. వివిధ రాష్ట్రాల నుంచి హైదరాబాద్‌కు వలస వచ్చి పనులు లేక దీనస్థితిలో గడుపుతున్నారు. చేసేదేమి లేక కొందరు కాలినడకన వారివారి సొంతూళ్లకు పయనమవుతున్నారు. ఎంతో మంది చంటి పిల్లలను పట్టుకుని వందలాది కిలోమీటర్లు వెళ్తున్న పరిస్థితి. ఏది ఏమైనా కరోనా వైరస్ వల్ల ఈ లాక్‌డౌన్ అందరి జీవితాల్లో మర్చిపోలేని విధంగా చేస్తోంది.