ముంబై ఐదో విజయం.. మళ్లీ టాప్‌లోకి
By న్యూస్‌మీటర్ తెలుగు Published on 12 Oct 2020 10:52 AM ISTఇండియన్ ప్రీమియర్ లీగ్(ఐపీఎల్) 13వ సీజన్‌లో ఢిపెండింగ్ ఛాంపియన్ ముంబై ఇండియన్స్ దూసుకుపోతోంది. ఇప్పటి వరకు 7 మ్యాచ్‌లు ఆడిన ముంబై ఐదు విజయాలు సాధించి పాయింట్ల పట్టికలో అగ్రస్థానానికి చేరుకుంది. ఆదివారం జరిగిన మ్యాచ్‌లో ఆ జట్టు 5 వికెట్ల తేడాతో ఢిల్లీ క్యాపిటల్స్ పై గెలిచింది. ధావన్(69 నాటౌట్; 52 బంతుల్లో 6పోర్లు, 1 సిక్సర్), అయ్యర్(42; 33 బంతుల్లో 5పోర్లు) రాణించడంతో మొదట ఢిల్లీ 4 వికెట్ల నష్టానికి 162 పరుగులు చేసింది. డికాక్(53; 36 బంతుల్లో 4పోర్లు, 3 సిక్సర్లు) సూర్య కుమార్ యాదవ్(53; 32 బంతుల్లో 6పోర్లు), ఇషాన్ కిషన్ (28; 15 బంతుల్లో 2పోర్లు, 2 సిక్సర్లు) రాణించడంతో ముంబై 19.4 ఓవర్లలో ఐదు వికెట్లు కోల్పోయి లక్ష్యాన్ని చేదించింది. ముంబైకి ఇది వరుసగా నాలుగో విజయం.
ఢిల్లీ ఇన్నింగ్స్ మొదలైన తొలి ఓవర్లోనే పృథ్వీ షా (4) పెవిలియన్ చేరాడు. ఈ సీజన్‌లో తొలి మ్యాచ్ ఆడుతున్న రహానే వచ్చీ రాగానే బౌండరీలతో ప్రతాపం చూపాడు. కానీ అతని జోరు ఎంతోసేపు నిలువలేదు. పవర్‌ప్లే ముగిసేసరికి ఢిల్లీ స్కోరు 46/2. ఏడో ఓవర్లో జట్టు స్కోరు 50 పరుగులు దాటింది. ఆ తర్వాత ధావన్, అయ్యర్ అడపాదడపా ఫోర్లు కొడుతూ ఇన్నింగ్స్‌ను నడిపించారు. జట్టు స్కోరు 100 పరుగులను దాటాక అయ్యర్‌ను కృనాల్ ఔట్ చేశాడు. దీంతో మూడో వికెట్‌కు 85 పరుగుల భాగస్వామ్యానికి తెరపడింది. ధావన్ ఆఖరి బంతి వరకు క్రీజులోనే ఉన్నా దిల్లీకి భారీ స్కోర్‌ను అందించలేకపోయాడు.
ముంబై చేదన గొప్పగా ఏమీ ఆరంభం కాలేదు. 3, 4, 5 తొలి మూడు ఓవర్లలో ముంబై చేసిన పరుగులింతే. రోహిత్ శర్మ (12 బంతుల్లో 5) ధాటిగా ఆడలేకపోయాడు. అయిదో ఓవర్లో అతను ఔటయ్యేటప్పటికీ స్కోర్ 31 పరుగులు మాత్రమే. కానీ ఆ తర్వాత సూర్యకుమార్ యాదవ్‌తో కలిసి డికాక్ బ్యాట్ ఝుళిపించడంతో స్కోర్ బోర్డు పరుగులు పెట్టింది. పదో ఓవర్‌లో డికాక్ ఔటైనా.. సూర్యకుమార్ యాదవ్ బాధ్యాయుతంగా ఆడాడు. చివర్లో సూర్యకుమార్, హార్థిక్ పెవిలియన్ చేరినా.. ముంబై గెలుపుపై ఎవరికి పెద్దగా సందేహాలు లేవు. చివరి ఓవర్‌లో ఏడు పరుగులు చేయాల్సి ఉండగా.. తొలి బంతికే కృనాల్ పాండ్య(12నాటౌట్) బౌండరీ బాదడంతో ముంబై విజయం నల్లేరు పై నడకనే అయ్యింది.