Fact Check : ఆగష్టు 15 2020న కరోనా వ్యాక్సిన్ ను మార్కెట్ లోకి తీసుకురానున్నారా..?
By న్యూస్‌మీటర్ తెలుగు
కరోనాకు వ్యాక్సిన్ ను తీసుకుని రావడానికి ఇప్పటికే చాలా సంస్థలు ప్రయత్నాలు సాగిస్తూ ఉన్నాయి. కోవిద్-19కు వ్యాక్సిన్ వస్తే కానీ పరిస్థితుల్లో మార్పు వచ్చేలా కనిపించడం లేదు. భారత్ బయోటెక్ సంస్థ కూడా కరోనాకు వ్యాక్సిన్ ను కనిపెట్టే పనిలో ఉంది.
భారత్ బయోటెక్ సంస్థ ఆగష్టు 15, 2020న కోవిద్ వ్యాక్సిన్ ను మార్కెట్ లోకి తీసుకుని వచ్చేందుకు కేంద్ర ప్రభుత్వం అనుమతులను సాధించిందంటూ సామాజిక మాధ్యమాల్లో పోస్టులు వైరల్ అవుతూ ఉన్నాయి. ఐసిఎంఆర్ కు చెందిన లెటర్ కూడా ఇందుకు జోడించారు.
నిజ నిర్ధారణ:
ఆగష్టు 15న కరోనా వైరస్ కు వ్యాక్సిన్ మార్కెట్ లోకి భారత్ బయోటెక్ తీసుకుని వస్తోందన్నది 'అబద్ధం'
‘ICMR Bharat Biotech Vaccine will be available from Aug 15’ కీవర్డ్స్ ను ఉపయోగించగా ఐసిఎంఆర్-భారత్ బయోటెక్ కలిసి వ్యాక్సిన్ ను ఆగష్టు 15, 2020 నాటికి తీసుకుని వచ్చే అవకాశం ఉందని The Hindu, India Today, News18 అంటూ కథనాలను ప్రచురించాయి.
ఈ వార్తా కథనాలు నిజమే.. ఐసిఎంఆర్ లెటర్ లో కరోనా వ్యాక్సిన్ లాంఛ్ అన్నది ఆగష్టు 15, 2020 నాటికి చోటుచేసుకోనుంది.. అంతేకానీ మార్కెట్ లోకి అందుబాటులోకి తీసుకొని రావడం లేదు.
భారత్ బయోటెక్ ఛైర్మన్ The New India Express సంస్థతో మాట్లాడుతూ కోవ్యాక్సిన్ క్లినికల్ ట్రయల్స్ మొదలయ్యాయని.. చాలా బాగా పనిచేస్తోందని వెల్లడించారు.. పరిస్థితులన్నీ సహకరిస్తే 2021 సంవత్సరం మొదట్లో కల్లా వ్యాక్సిన్ ను మార్కెట్ లోకి తీసుకుని వస్తామని అన్నారు. భారత్ బయోటెక్ కొవాగ్జిన్ పేరుతో రూపొందించిన కరోనా వ్యాక్సిన్ ప్రస్తుతం క్లినికల్ ట్రయల్స్ దశలో ఉంది. భారత్ బయోటెక్ ఎండీ కృష్ణ ఎల్లా మాట్లాడుతూ తాము వ్యాక్సిన్ నాణ్యత విషయంలో రాజీపడబోవడంలేదని, భారత్ లో ఎలాంటి వ్యాక్సిన్ అందిస్తామో, ప్రపంచదేశాలకు సరఫరా చేసే వ్యాక్సిన్ కూడా అదే నాణ్యతతో ఉంటుందని స్పష్టం చేశారు. ప్రపంచ ఆరోగ్య సంస్థతో పాటు అమెరికా కూడా వ్యాక్సిన్ తయారీలో సహకారం అందిస్తోందని తెలిపారు.
జులై 2న ఇండియన్ కౌన్సిల్ ఆఫ్ మెడికల్ రీసర్చ్(ఐసిఎంఆర్) సంస్థ ఆగష్టు 15 కల్లా కరోనా వ్యాక్సిన్ రావచ్చనే ఆశాభావం వ్యక్తం చేసింది. క్లినికల్ ట్రయల్స్ కు సంబంధించిన విషయాలను ఫాస్ట్ ట్రాకింగ్ చేస్తున్న లెటర్ కూడా సామాజిక మాధ్యమాల్లో వైరల్ అవుతోంది. వీటిలో ఎటువంటి నిజం లేదని ఐసిఎంఆర్ తెలిపింది. అందుకు సంబంధించిన ప్రెస్ నోట్ ను విడుదల చేశారు.
https://main.icmr.nic.in/sites/default/files/press_realease_files/ICMR_Press_Release_04072020.pdf
చాలా కంపెనీలు వ్యాక్సిన్ తయారీలో ఉన్నాయి. అందులో భారత్ బయోటెక్ ముందులో ఉంది. అంతేకానీ ఆగష్టు 15 నాటికి వ్యాక్సిన్ మార్కెట్ లోకి అందుబాటులోకి వస్తుందన్నది పచ్చి అబద్ధం.