Fact Check : ప్రతి ఏడాది కేరళలో 600 ఏనుగులను చంపేస్తున్నారన్న మేనకా గాంధీ..?
By న్యూస్‌మీటర్ తెలుగు
గర్భవతి అయిన ఏనుగు చనిపోవడం పట్ల దేశవ్యాప్తంగా ఆగ్రహం వ్యక్తమయింది. ఈ ఘటనపై విచారణ మొదలుపెట్టారు అధికారులు. కేరళలో ఏనుగులు చనిపోతున్నా అధికారులు పట్టించుకోవడం లేదంటూ ఎంతో మంది విమర్శలు గుప్పిస్తూ ఉన్నారు. ఇలా ఉంటే దేశంలో వన్యప్రాణులు బ్రతకడం కష్టమేనని అంటున్నారు.
మే30 వ తేదీన, మోహన్ కృష్ణ కేరళ ఫారెస్ట్ డిపార్ట్మెంట్ లోని సెక్షన్ ఫారెస్ట్ ఆఫీసర్ ఆ ఏనుగు చనిపోయిన విధానాన్ని వివరిస్తూ సోషల్ మీడియాలో పోస్టు పెట్టారు. అది వైరల్ అయింది.
ఈ ఘటన మీడియాలో కూడా బాగా హైలెట్ అయింది. ఆ ఏనుగు చనిపోవడం పట్ల పెద్ద ఎత్తున నిరసన వ్యక్తం చేశారు. కేరళ ఫారెస్ట్ డిపార్ట్మెంట్ కూడా ఈ ఘటనపై వివారాలు సేకరిస్తున్నామని తెలిపింది. పాలక్కాడ్ జిల్లాలోని అట్టపాడీ ప్రాంతంలో ఈ ఘటన చోటుచేసుకుందని.. ఏనుగు సైలెంట్ వ్యాలీ నేషనల్ పార్క్ కు చెందినదని స్పష్టం చేసింది. పోస్టుమార్టం సమయంలోనే తమకు కూడా ఏనుగు గర్భంతో ఉందని తెలిసిందని కేరళ ఫారెస్ట్ డిపార్ట్మెంట్ తెలిపింది.
మొదట ఈ ఘటనకు సంబంధించిన సరైన సమాచారం లేకపోవడంతో ఘటన మలప్పురంలో చోటుచేసుకుందని అనుకున్నారు. చాలామంది సెలెబ్రిటీలు కూడా ఈ ఘటనపై బాధను వ్యక్తం చేశారు. ఈ ఘటన పాలక్కాడ్ లో చోటుచేసుకోగా.. రాజకీయనాయకులు కూడా మలప్పురంలో జరిగిన ఘటన అని అనుకున్నారు.
మలయాళ మనోరమ న్యూస్ ఈ ఘటనపై మే 28న కథనాన్ని ప్రసారం చేసింది. ఉదయం నుండి సాయంత్రం వరకూ ఏనుగు వెల్లియార్ ఫుల్హ కాలువలోనే ఉందని తెలిపారు. తిరుజాముకున్ను, అలనల్లూర్, కీఝతూర్ పంచాయతీల మధ్యలో ఉంది.
నిజనిర్ధారణ:
సోషల్ మీడియాలో వైరల్ అవుతున్నట్లుగా మలప్పురంలో ఈ ఘటన చోటుచేసుకుందన్నది 'పచ్చి అబద్ధం'
ఈ ఘటనపై ఉత్తరప్రదేశ్ బీజేపీ ఎంపీ మేనకా తీవ్ర ఆగ్రహాన్ని వ్యక్తం చేశారు. ముస్లింలు ఎక్కువగా ఉన్న మలప్పురం జిల్లాలో ఏనుగులను ఎక్కువగా చంపుతూ ఉన్నారని ఆరోపణలు గుప్పించారు. కేరళలో ప్రతి ఏడాది 600కు పైగా ఏనుగులు చనిపోతున్నాయని.. అక్కడి ప్రభుత్వం వారిపై చర్యలు తీసుకోడానికి భయపడుతోందని అన్నారు. మలప్పురం జిల్లాలో హింసాకాండ ఎక్కువని.. వన్యప్రాణులకు సంరక్షణ అన్నది లేదని అన్నారు. స్థానిక ఆలయాలకు చెందిన వాళ్లు, ఏనుగుల ఓనర్లు ఇన్సూరెన్స్ డబ్బుల కోసం ఏనుగులను చంపుతూ ఉంటారని.. ప్రభుత్వంకు ఇది తెలిసినా కూడా ఏమీ పట్టించుకోడని ఆమె ఆరోపించారు.
మనేకా గాంధీ ఆరోపణల్లో నిజం లేదని కేరళ ఫారెస్ట్స్ అండ్ వైల్డ్ లైఫ్ డిపార్ట్మెంట్ లెక్కలను చూస్తే అర్థమవుతుంది. గత కొన్నేళ్లుగా కేరళలో ఏనుగుల సంఖ్య గణనీయంగా పెరుగుతోంది. 1993 లో కేరళ రాష్ట్రంలో 4286 ఏనుగులు ఉండగా.. 1997 నాటికి 5737కు చేరింది. 2002లో 6965 ఏనుగులు కేరళలో ఉండగా.. 2011 నాటికి 7490కు పెరిగింది.
ఈ ఏనుగులలో 702 ఏనుగులు ఆలయాల ఆధీనంలోనూ, కొందరు మావటిల వద్ద ఉన్నాయి. వైల్డ్ లైఫ్ డిపార్ట్మెంట్ దగ్గర 19 ఏనుగులు ఉన్నాయి.
ఏప్రిల్ , 2015 నుండి డిసెంబర్ 31, 2018 మధ్య కాలంలో దేశంలో 373 ఏనుగులు మరణించాయని మినిస్టర్ మహేష్ శర్మ లోక్ సభలో ఫిబ్రవరి 8, 2019న చెప్పుకొచ్చారు. ఏనుగుల మరణాలకు ముఖ్య కారణం ట్రైన్ యాక్సిడెంట్స్, కరెంట్ తగలడం, పాయిజన్ పెట్టడం వంటివి కారణాలని ఆయన చెప్పుకొచ్చారు.
2014-15 నుండి 2018-19 మధ్య డేటాను మినిస్టర్ బాబుల్ సుప్రియో అప్డేట్ చేశారు. ఆ డేటాను కింది లింక్ లో చూడొచ్చు
https://pqars.nic.in/annex/251/AU844.pdf.
2014-15 నుండి 2018-19 మధ్య ఏనుగుల మరణానికి గల కారణాలను కూడా అందులో వెల్లడించారు.
అఫీషియల్ డేటా ప్రకారం దేశంలో 2014-15 - 2018-19 చనిపోయిన ఏనుగుల సంఖ్య 600 కంటే తక్కువగా ఉంది. కేవలం 42 ఏనుగులు మాత్రమే కేరళ రాష్ట్రంలో చనిపోయాయి.
ప్రతి ఏడాది కేరళలో 600పైగా ఏనుగులు చనిపోతున్నాయని మేనకా చేసిన ఆరోపణలు 'పచ్చి అబద్ధం'