మెమరీ గార్డెన్.. హైదరాబాద్ లో రానుంది
By న్యూస్‌మీటర్ తెలుగు Published on 26 Aug 2020 6:28 AM GMTమియాపూర్ లో ఓ అరుదైన గార్డెన్ రానుంది. వయో వృద్ధుల మతిమరుపు పోగొట్టేందుకు ఈ గార్డెన్ ఉపయోగపడుతుందని అధికారులు చెబుతున్నారు. ఈ మల్టీ జెన్ థీమ్ పార్క్ ను మియాపూర్ లో ఏర్పాటు చేయనున్నారు. రెండు కోట్ల రూపాయలను ఈ పార్క్ కోసం వెచ్చించనున్నారు. అన్ని వయస్సుల వారిని కూడా ఈ పార్క్ అలరించనుంది. కానీ ఈ పార్క్ ముఖ్యంగా వయోవృద్ధుల కోసమేనని చెబుతున్నారు.
ఈ మల్టీ జెన్ థీమ్ పార్కులో వివిధ రకాల మొక్కలను, చెట్లను ఏర్పాటు చేయనున్నారు. అక్కడి ఉన్న చెట్లు, పూలు వాసన చూడడం, ముట్టుకోవడం ద్వారా వయో వృద్ధుల్లో మెదడు పనితీరు పెరుగుతుందని జిహెచ్ఎంసి అర్బన్ బయోడైవర్సిటీ వింగ్ అడిషనల్ కమీషనర్ వి.కృష్ణ తెలిపారు.
మియాపూర్‌లోని మయూరీనగర్‌లో 3.5 ఎకరాల విస్తీర్ణంలో రూ. రెండు కోట్ల వ్యయంతో నూతన పద్ధతులు, అత్యాధునిక ప్రత్యేకతలతో థీమ్ పార్కును నిర్మిస్తున్నారు.
శేరిలింగంపల్లి నియోజకవర్గం పరిధిలోని మియాపూర్ డివిజన్ మయూరీనగర్‌కాలనీలో రూ.రెండు కోట్ల వ్యయంతో నిర్మిస్తున్న మల్టీజెన్ థీమ్ పార్కు, గుర్నాధం చెరువు అభివృద్ధి పనులను ప్రభుత్వ విప్, ఎమ్మెల్యే అరెకపూడి గాంధీతో కలిసి హైదరాబాద్ మేయర్ బొంతు రామ్మోహన్ ప్రారంభించారు. శేరిలింగంపల్లి జోన్ పరిధిలో 9 థీమ్ పార్కులను ఏర్పాటు చేయనున్నామని.. నగరంలోని 185 చెరువులను పరిరక్షించి, దశలవారీగా అభివృద్ధికి కృషి చేసేందుకు ప్రభుత్వం చర్యలు తీసుకుంటున్నట్లు బొంతు రామ్మోహన్ తెలిపారు. శేరిలింగంపల్లి జోన్‌లోని 70 చెరువులలో 20 చెరువుల రక్షణ, గుర్రపు డెక్క తొలగింపుతో పాటు ఫెన్సింగ్, వాకింగ్ ట్రాక్‌లను ఏర్పాటు చేస్తున్నట్లు బొంతు రామ్మోహన్ తెలిపారు.
హైదరాబాద్ నగరంలో 320పార్కులు, 50థీమ్ పార్కులు, 120జంక్షన్లను పచ్చదనంతో ఉండేలా పనులు సాగుతున్నాయి. మల్టీజెన్ పార్కుల ఏర్పాటుతో హరిత నగరంగా గ్రేటర్ హైదరాబాద్ మారనున్నదని జిహెచ్ఎంసి అధికారులు భావిస్తున్నారు.
లంగ్ స్పేస్ ను నగరంలోని యాభై థీమ్ పార్క్ లలో ఒకటిగా అధికారులు రూపొందిస్తూ ఉన్నారు. ఈ పార్కులలో వయోవృద్ధులు సొంతంగా చెట్లను పెంచుకునే వెసులుబాటును కల్పించనున్నారు. అలాగే బోర్డు గేమ్స్ కూడా ఆడుకునేలా ఏర్పాట్లు చేయనున్నారు. యోగా కూడా చేసుకునేలా అన్ని సదుపాయాలను ఏర్పాటు చేయనున్నారు. ఓపెన్ జిమ్, టైల్డ్ ఫుట్ పాత్ కూడా ఏర్పాటు చేస్తున్నారు.