మాకు మేమే.. మీకు మీరే..!
By సుభాష్ Published on 12 Dec 2019 7:15 PM ISTఒకవైపు తమ్ముడు పవన్ కల్యాణ్ జగన్ ప్రభుత్వ వైఖరికి నిరసనగా కాకినాడలో దీక్ష చేస్తుంటే, మరో వైపు పవన్ సోదరుడు, కేంద్ర మాజీ మంత్రి చిరంజీవి మాత్రం జగన్ ప్రభుత్వంపై ప్రశంసలు కురిపించడం ఇప్పుడు రాష్ట్రంలో చర్చనీయాంశంగా మారింది. పవన్ కల్యాణ్ తన అన్న చిరంజీవి అంటే ఎంతో గౌరవం. ఆయన గురించి చాలా సభల్లో ఎన్నో విషయాలు చెప్పుకొచ్చారు పవన్ కల్యాణ్. అలాంటి పవన్ కల్యాణ్ ఏపీలో జగన్ ప్రభుత్వ నిర్ణయాలను వ్యతిరేకిస్తుంటే .. సొంత అన్నయ్య చిరంజీవి ఏపీ సర్కార్ పై పొగడ్తలు కురిపించడం జన సైనికులు జీర్ణించుకోలేకపోతున్నారు
పవన్ కల్యాణ్ ఈరోజు కాకినాడలో రైతు సౌభాగ్య దీక్షను చేపట్టారు. రైతులకు సరైన గిట్టుబాటు ధర లభించడం లేదని, రైతులు తీవ్ర ఇబ్బందులను ఎదుర్కొంటున్నారని ఈ దీక్షకు దిగారు. ఏపీ సీఎం జగన్ తీసుకుంటున్న ప్రతి నిర్ణయాన్ని పవన్ కల్యాణ్ తీవ్రంగా వ్యతిరేకిస్తున్నారు. ఇసుక కొరతపై ఆయన విశాఖలో లాంగ్ మార్చ్ కూడా చేశారు. ఈ మధ్య జగన్ ఏపీలోని ప్రాథమిక పాఠశాలల్లో ఇంగ్లీష్ మీడియం ప్రవేశపెట్టారు. దీన్ని కూడా ప్రవన్ తప్పుబట్టారు. జగన్ సర్కార్ ఆరునెలల పాలనలోనే రాష్ట్రాన్ని భ్రష్టుపట్టిందని పవన్ ఆరోపించారు.
రాజకీయాలకు దూరంగా….
ఈ నేపథ్యంలో ఒక వైపు పవన్ ప్రభుత్వంపై ఆరోపణలు గుప్పిస్తుంటే. మరో వైపు చిరంజీవి మాత్రం ఏపీ రాజకీయాల్లో ఎటువంటి జోక్యం చేసుకోవడం లేదు. పవన్ కల్యాణ్ జనసేన పార్టీని స్థాపించి గత ఎన్నికల్లో పోటీకి దిగినప్పుడు కూడా చిరంజీవి రాజకీయాలకు దూరంగానే ఉన్నారు. కనీసం పవన్ కల్యాణ్ తరపున ప్రచారంలో పాల్గొనలేదు. ఎన్నికల సమయంలో చిరంజీవి జనసేన ప్రచారంలో పాల్గొంటారని అభిమానులు ఊహించారు. కానీ.. చిరంజీవి దారిదాపుల్లో కూడా రాలేదు. చిరంజీవిపై కొందరికి మరో అనుమానం కలుగుతోంది. ఆయన కాంగ్రెస్‌లోనే ఉన్నారా... లేదా..? అన్నది ఎవరికి తెలియడం లేదు. రాజ్యసభ పదవీ కాలం పూర్తయిన తర్వాత చిరంజీవి కాంగ్రెస్ ప్రాథమిక సభ్యత్వాన్ని కూడా తీసుకోలేదు. ఆయన రాజకీయాలకు పూర్తిగా దూరమై కేవలం సినిమాలకే పరిమితమయ్యారు. రాజకీయాల్లో రాణించాలని చిరంజీవి ప్రజారాజ్యాన్ని స్థాపించారు. చివరికి రాజకీయాల్లో రాణించలేక పార్టీని కాంగ్రెస్‌లో విలీనం చేసేశారు. రాజకీయాల్లో ఫెయిలూర్ అయిన చిరంజీవి ఫైనల్‌గా సినీ ఇండస్ట్రీ వైపు అడుగులు వేసి మళ్లీ నటనను కొనసాగిస్తున్నారు.
ఇటీవల జరిగిన ఎన్నికల్లో జనసేన పార్టీ కేవలం ఓకే ఒక స్థానానికి పరిమితమైంది. ముందుగా ఏదో చేస్తానని అనుకున్న పవన్ కల్యాణ్.. పార్టీ నామరూపాలు లేకుండా పోయింది. కానీ, చిరంజీవి మాత్రం ఈ మధ్యన ఏపీ ముఖ్యమంత్రి జగన్ కుటుంబ సమేతంగా కలవడం అప్పట్లో చర్చనీయాంశమైంది. ఉయ్యాలవాడ నరసింహారెడ్డి సినిమా ప్రమోషన్స్ లో భాగంగా జగన్ ను చిరంజీవి కలిసినట్లు చెప్పుకొచ్చారు. కానీ తాజాగా దిశ చట్టాన్ని తీసుకువచ్చిన సీఎం జగన్ సర్కార్‌ను అభినందిస్తూ.. చిరంజీవి లేఖ రాయడం మరోసారి చర్చనీయాంశంగా మారింది. అదీ తమ్ముడు పవన్ దీక్ష జరిగే రోజే చిరంజీవి ప్రకటన విడుదల చేయడంపై జనసేనలోనూ విస్తృత చర్చ జరుగుతోంది. అన్నదమ్ముల వ్యవహారం పార్టీలోనూ, అభిమానుల్లోనూ అయోమయం సృష్టించే విధంగా ఉన్నట్లు కనిపిస్తోంది. ఒక వైపు పవన్ ప్రభుత్వంపై పోరాటం చేస్తుంటే..మరో వైపు అన్న చిరంజీవి ప్రశంసలు కురిపించడం రాజకీయ వర్గాల్లో పెద్ద చర్చ జరుగుతోంది. మరి వీరిద్దరి మధ్య ఎలాంటి రచ్చకు దారి తీస్తుందో వేచి చూడాలి.