ఫార్మసీ కంపెనీలకు ఎదురుదెబ్బ... ఇక ఆన్‌లైన్‌లో మందుల విక్రయం నిషేధం..!

By Newsmeter.Network  Published on  5 Dec 2019 10:31 AM IST
ఫార్మసీ కంపెనీలకు ఎదురుదెబ్బ... ఇక ఆన్‌లైన్‌లో మందుల విక్రయం నిషేధం..!

ఈ-ఫార్మసీ కంపెనీలకు ఎదురు దెబ్బ తగిలింది. ఇకపై ఆన్‌లైన్‌లో మందుల బ్రేక్‌ పడింది. ఆన్‌లైన్‌లో మందులను విక్రయాలను నిలిపివేయాలని సెంట్రల్‌ డ్రగ్స్‌ రెగ్యులేటర్‌ సంస్థ స్పష్టం చేసింది. ఈమేరకు అన్ని రాష్ట్రాలు, కేంద్ర పాలిత ప్రాంతాలకు ఆదేశాలు జారీ చేసింది. ఇ–ఫార్మసీ సంస్థలన్నీ తక్షణమే ఇంటర్నెట్‌లో మందుల విక్రయాన్ని నిలిపివేయాలని కోరినట్టు ఆరోగ్య శాఖ అధికారులు పేర్కొంటున్నారు. ఇ–ఫార్మసీ సంస్థల నియంత్రణకు కేంద్ర ప్రభుత్వం కొత్తగా నిబంధనల్ని రూపొందిస్తోంది. కాగా, కేంద్ర ప్రభుత్వం నిబంధనలు అమల్లోకి వచ్చినంత వరకు ఆన్‌లైన్‌లో మందుల అమ్మకాలను నిలిపివేయాలంటూ సూచించింది. ఢిల్లీ కోర్టు తీర్పు అమలయ్యేలా అన్ని రకాల చర్యలు తీసుకోవాలంటూ డీసీజీఐ అన్ని రాష్ట్రాలు, యూటీలకు ఆదేశించారు.

అనుమతులు లేకుండా ఆన్‌లైన్‌లో మందుల విక్రయం:

చట్టవిరుద్ధంగా, అనుమతులు లేకుండా ఆన్‌లైన్‌లో యథేచ్ఛగా ఈ మందుల విక్రయం కొనసాగుతోంది. ఈ మందుల విక్రయానికి అడ్డుకట్ట వేయాలని జహీర్‌ అహ్మద్‌ అనే వ్యక్తి ఢిల్లీ హైకోర్టులో గత సంవత్సరం పిల్‌ దాఖలు చేశారు. ఇష్టారాజ్యంగా ఆన్‌లైన్‌లో మందులు అమ్మకాలు జరుగుతున్నాయని, దీని వల్ల రాజ్యాంగంలో ఆర్టికల్‌ 21 ప్రకారం ప్రజలు జీవించే హక్కుని కోల్పోతారని, వారి ఆరోగ్యమే ప్రమాదంలో పడేఅవకాశం ఉందని ఆయన ఆందోళన వ్యక్తం చేశారు. ఈ పిల్‌ను విచారించిన హైకోర్టు 2018 డిసెంబర్‌లో ఆన్‌లైన్‌లో మందుల అమ్మకం నిలిపివేయాలని ఆదేశించింది. కాగా, హైకోర్టు ఇచ్చిన ఆదేశాలను ఎవరు పట్టించుకోకపోవడంతో

ఈ ఏడాది ఏప్రిల్‌లో జహీర్‌ మళ్లీ కోర్టు మెట్లెక్కాడు. ఈ విషయమై హైకోర్టు కేంద్రానికి, ఇ–ఫార్మసీ కంపెనీలకు నోటీసులు జారీ చేసింది. ఈ నోటీసులకు గత సెప్టెంబర్‌లో స్పందించిన ఇ–ఫార్మసీ కంపెనీలు ఆన్‌లైన్‌ విక్రయాలకు ఎలాంటి అనుమతులు, ప్రిస్క్రిప్షన్లు అవసరం లేదని కోర్టుకు తెలిపారు. స్విగ్గీలో ఆహార పదార్థాలు ఎలా ఇంటికి అందిస్తున్నారో తాము కూడా మందుల్ని డోర్‌ డెలివరీ చేస్తున్నట్టు తమ వాదన వినిపించారు.

ప్రస్తుతం దేశవ్యాప్తంగా 50 కంపెనీలు ఆన్‌లైన్‌లో మందులు విక్రయిస్తున్నాయి. వీటికి ఎలాంటి నియమ నిబంధనలు అంటూ లేవు. దేశవ్యాప్తంగా హోల్‌సేల్, రిటైల్‌ ఫార్మసీ కంపెనీలు 8 లక్షల వరకు ఉన్నట్టు అధికారులు అంచనా వేశారు. ఆన్‌లైన్‌ అమ్మకాలతో తమ వ్యాపారాలకు గండిపడుతోందని ఫార్మసీ కంపెనీలు ఆందోళన వ్యక్తం చేస్తున్నాయి. ఇ–ఫార్మసీ కంపెనీలు ఇస్తున్న ఆఫర్లతో తాము వ్యాపారాలు మూసుకోవాల్సిన పరిస్థితులు దాపురించాయని పేర్కొన్నాయి.

Next Story