14 రోజులుగా గ్యాస్ లీక్.. నేడు పెద్ద ఎత్తున మంటలు
By తోట వంశీ కుమార్ Published on 9 Jun 2020 7:10 PM IST
అసోం రాష్ట్రంలోని చమురు బావిలో భారీ అగ్నిప్రమాదం చోటుచేసుకుంది. రాష్ట్రంలోని తిన్సుకియా జిల్లాలో న్యాచురల్ గ్యాస్ ను ఉత్పత్తి చేసే ఆయిల్ ఇండియా లిమిటెడ్ బావిలో భారీ అగ్నిప్రమాదం జరిగింది. బావిలో నుంచి పెద్ద ఎత్తున మంటలు చెలరేగుతున్నాయి. మే 27 నుంచి ఇక్కడ గ్యాస్ లీక్ అవడం ప్రారంభమై గత 14 రోజులుగా పెద్ద ఎత్తున గ్యాస్ లీక్ అవుతున్న విషయం తెలిసిందే.
సోమవారం సింగపూర్ నుంచి వచ్చిన నిపుణుల బృందం గ్యాస్ లీక్‌ను అరికట్టేందుకు ప్రయత్నించింది. అదుపులోకి రాకపోగా.. మంగళవారం పెద్ద ఎత్తున మంటలు అంటుకున్నట్లు స్థానికులు తెలిపారు. పెద్ద ఎత్తున పొగ వ్యాపిస్తోంది. చుట్టుపక్కల ప్రాంతాలకు కూడా మంటలు వ్యాపించే అవకాశమున్నట్లు తెలుస్తోంది. అగ్ని ప్రమాదం సమాచారం అందిన వెంటనే అసోం సీఎం సర్బానంద సోనోవాల్.. కేంద్ర పెట్రోలియంశాఖ మంత్రి ధర్మేంద్ర ప్రధాన్ తో ఫోన్లో మాట్లాడి పరిస్థితులను వివరించారు.
ఈ ప్రమాదంలో పలువురు ఓఎన్జీసీ సిబ్బందికి స్వల్ప గాయాలైనట్లు అధికారులు తెలిపారు. మంటలను ఆర్పేందుకు ప్రయత్నిస్తున్నామని ఆయిల్ ఇండియా లిమిటెడ్ సీనియర్ మేనేజర్ జయంత్ బొర్ముడోయ్ తెలిపారు. ప్రమాదానికి గల కారణాలు మాత్రం ఇంకా తెలియరాలేదు.