గద్వాల: పరువు కోసం కన్న కూతురినే హత్య చేసిన తల్లిదండ్రులు

By సుభాష్  Published on  9 Jun 2020 3:34 AM GMT
గద్వాల: పరువు కోసం కన్న కూతురినే హత్య చేసిన తల్లిదండ్రులు

దేశంలో రోజురోజుకు దారుణాలు పెరిగిపోతున్నాయి. పోలీసులు ఎన్ని చర్యలు చేపట్టినా దారుణాలు మాత్రం ఆగడం లేదు. పరువు హత్యలు సైతం ఆగడం లేదు. ప్రస్తుతం ఉన్న రోజుల్లో పరువు కోసం కన్న పేరునే తెంచుకుంటున్నారు. తాజాగా గద్వాల జిల్లాలో దారుణం చోటు చేసుకుంది. ఇతర కులం యువకుడిని ప్రేమిస్తుందనే కోసం కన్న కూతురినే తల్లిదండ్రులు హతమార్చారు. స్థానికుల కథనం ప్రకారం.. జిల్లాలోని మానవపాడు మండలం కల్లుకుంట్ల గ్రామానికి చెందిన దివ్య అనే యువతి డిగ్రీ చదువుతోంది. ఆ యువతి వేరే కులానికి చెందిన యువకుడిని గత కొంత కాలంలో ప్రేమిస్తోంది.

ఈ విషయంలో ఇంట్లో తెలిసే సరికి గొడవలు జరిగాయి. ఇక ప్రేమ వ్యవహారాలు మానుకోవాలని, బుద్దిగా చదువుకుని ఉండాలని తల్లిదండ్రులు కూతుర్ని హెచ్చరించారు. అయినా కూతురు అవేమి పట్టించుకోకుండా అతడినే పెళ్లి చేసుకుంటానని తల్లిదండ్రులతో స్పష్టంచేసింది. దీంతో ఆగ్రహానికి గురైన తల్లిదండ్రులు దివ్య (21)ను గొంతునులిమి చంపేశారు. కాగా, దివ్య ప్రేమించిన యువకుడి ద్వారా గర్భం దాల్చినట్లు తెలుస్తోంది. అనుమానం వచ్చిన తల్లిదండ్రులు ఆమెను గట్టిగా అడగడంతో గర్భం దాల్చిన విషయాన్ని చెప్పినట్లు తెలుస్తోంది. వెంటనే అబార్షన్‌ చేయించుకోవాలని తల్లిదండ్రులు కోరగా, చేయించుకోనని తేల్చి చెప్పగా, పరువు పోతుందనే ఉద్దేశంతో హత్య చేసినట్లు చెబుతున్నారు.

అయితే కూతురును హత్య చేయాలని ప్లాన్‌ వేసిన తల్లిదండ్రులు అర్థరాత్రి సమయంలో కుమార్తె గాఢనిద్రలో ఉండగా, తల్లిదండ్రులిద్దరూ ఆమెపై దిండుతో అదిమిపట్టి ఊపిరాడకుండా, అలాగే గొంతునొక్కి హత్య చేశారు. అనంతరం తమ కుమార్తె అనారోగ్యంతో మృతి చెందినట్లు చిత్రీకరించేందుకు ప్రయత్నం చేయగా, బంధువులు అనుమానంతో పోలీసులకు ఫిర్యాదు చేశారు. దీంతో పోలీసులు ఘటన స్థలానికి చేరుకుని వివరాలు సేకరించారు. ఇక తల్లిదండ్రులు నేరాన్ని అంగీకరించడంతో వారిని పోలీసులు అరెస్టు చేశారు. కేసు నమోదు చేసుకుని దర్యాప్తు జరుపుతున్నారు.

Next Story
Share it