బెజవాడ గ్యాంగ్‌వార్‌ కేసులో పురోగతి.. వివరాలు వెల్లడించిన డీసీపీ

By సుభాష్  Published on  8 Jun 2020 10:55 AM GMT
బెజవాడ గ్యాంగ్‌వార్‌ కేసులో పురోగతి.. వివరాలు వెల్లడించిన డీసీపీ

ఏపీలో సంచలనం సృష్టించిన బెజవాడ గ్యాంగ్‌వార్‌ పై పోలీసులు పురోగతి సాధించారు. ఈ ఘర్షణకు సంబంధించి డీసీపీ హర్షవర్ధన్‌ మీడియా సమవేశం ఏర్పాటు చేసి వివరాలు వెల్లడించారు. ఇందుకు సంబంధించిన సీసీపుటేజీని సైతం మీడియా ముందుంచారు. సెటిల్‌మెంట్‌ విషయంలో పండు-సందీప్‌ వర్గాల మధ్య జరిగిన గొడవ ప్రాణాల మీదకు తీసుకువచ్చిందని అన్నారు. ఈ ఘటనలో ఇప్పటి వరకూ మొత్తం 24 మందిని అదుపులోకి తీసుకున్నట్లు వివరించారు. సందీప్‌ హత్యకు కారణమైన 13 మందిని, అలాగే పండుపై దాడి చేసిన 11 మందిని అరెస్టు చేసినట్లు తెలిపారు.

అయితే అరెస్టు అయిన వారిలో తోట జగదీష్‌, మేకతోటి కిరణ్‌ కుమార్‌, ఆకురాతి వెంకట శివరఘునాథ్‌, పంది విజయ ప్రసాద్‌, యర్రంశెట్టి రాము, కందెల శివరామకృష్ణ, బోడా శివ, చింతా సాంబశివరావు, చందారామ్‌ నితిన్‌, జక్కా రత్న సాయిలను అరెస్టు చేసినట్లు చెప్పారు. ఈ ఘర్షణలో ఇరు వర్గాలు ఒకరిపై ఒకరు మారణాలయుధాలతో దాడి చేసుకోవడం జరిగిందన్నారు. ఈ దాడిలో సందీప్‌ మృతి చెందగా, పండుకు తీవ్ర గాయాలై ఆస్పత్రిలో చికిత్స పొందుతున్నట్లు వివరించారు. అయితే నిందితుల నుంచి కత్తులు, నేపాల్‌ కత్తి, కర్ర, రాడ్లు, బ్లేడులు, మోటారు సైకిళ్లు, తదితర మారణాయుధాలను స్వాధీనం చేసుకున్నట్లు చెప్పారు. అయితే ఈ కేసులో మరి కొంత మందిని అదుపులోకి తీసుకోవాల్సి ఉంది. త్వరలో వారిని కూడా పట్టుకుంటామన్నారు.

కాగా, అపార్ట్‌మెంట్‌ విషయంలో సెటిల్‌మెంట్‌ జరిగిన మాట వాస్తవమేనని, అయితే పండు-సందీప్‌ వర్గాలు కలుసుకున్నప్పుడు సందీప్‌ గ్యాంగ్‌ ముందు పండు కుర్చీలో నుంచి లేవకపోవడం, పిల్లోడివి, నా ముందు కుర్చుంటావా అంటూ సందీప్‌ వర్గానికి చెందిన కిరణ్‌ కుమార్‌ కర్రతో రెండు సార్లు కొట్టడంతో ఒక్కసారిగా ఘర్షణ చెలరేగిందని అన్నారు. ఈ గొడవ అంతటికి కిరణే కారణమని, అతడు తీవ్రంగా రెచ్చగొట్టడం వల్లే ఘర్షణకు దారి తీసిందని డీసీపీ తెలిపారు. ఇక సెటిల్‌మెంట్‌ విషయంలో జోక్యం చేసుకోవద్దంటూ సందీప్‌ పండు ఇంటికెళ్లి బెదిరించాడని, ఆ తర్వాత పండు కూడా సందీప్‌ షాపునకు వెళ్లి నానా హంగామా సృష్టించారని అన్నారు. రెండు గ్యాంగుల్లో ఉన్నవారంతా క్రిమినల్సేనని, అందరికీ క్రిమినల్‌ చరిత్ర ఉందన్నారు. సందీప్‌ తన మిత్రులనే ఉపయోగించుకున్నాడని, వీళ్లంతా పాఠశాలల్లో పరిచయం ఉందని వివరించారు.

కాగా, సందీప్‌ హత్య వెనుక రాజకీయ నేతలు హస్తం ఉందని ఆయన భార్య తేజస్విని చేసిన ఆరోపణల్లో నిజం లేదన్నారు. సందీప్‌ హత్య వెనుక ఎలాంటి రాజకీయం లేదని స్పష్టం చేశారు. కేవలం కిరణ్‌ రెచ్చగొడ్డటం వల్లే ఇంత పెద్ద ఘటనకు కారణమన్నారు. అలాగే పండు తల్లికి క్రిమినల్‌ హిస్టరీ ఉందని, ఓ కేసులో ఆమె పేరు కూడా ఉందన్నారు. ఆ కేసుపై కూడా దర్యాప్తు చేస్తున్నామని, ఒక వేళ ఆమె పాత్ర ఉన్నట్లు తేలితే అరెస్టు చేస్తామని అన్నారు.

Next Story