Fact Check : ఆగష్టు 27న అంగారకుడు చంద్రుడి సైజులో కనిపించనున్నాడా..?

By న్యూస్‌మీటర్ తెలుగు
Published on : 19 Aug 2020 6:43 PM IST

Fact Check : ఆగష్టు 27న అంగారకుడు చంద్రుడి సైజులో కనిపించనున్నాడా..?

Donita Booher అనే ఫేస్ బుక్ అకౌంట్ లో రెండు చంద్రుళ్లు ఉన్న ఫోటో షేర్ చేశారు. అంగారక గ్రహం కూడా ఇలాగే కనిపిస్తుందని.. చంద్రుడి సైజులో అది కనువిందు చేస్తుందని తన పోస్టులో తెలియజేశారు. ఈ పోస్టుకు 14వేలకు పైగా లైకులు వచ్చాయి. 5 లక్షల 80 వేలకు పైగా షేర్లు వచ్చాయి.

ఇలా ఆకాశంలో అద్భుతం ఆగష్టు 27 12:30కు జరగనుంది. రెండు చంద్రుళ్లు ఆకాశంలో ఉన్నట్లుగా మనకు అనిపిస్తుందని తెలిపారు. ఇలా తిరిగి 2287 సంవత్సరంలో ఆవిష్కృతమవుతుందని తెలిపారు. ఇప్పుడు ఈ అద్భుతాన్ని చూసిన వారు మళ్లీ చూసే అవకాశం దక్కదని చెబుతున్నారు.

నిజ నిర్ధారణ:

ఇదొక తప్పుడు వార్త అని.. చాలా రోజులుగా సామాజిక మాధ్యమాల్లో వైరల్ అవుతోందని ఎంతో మంది చెప్పుకొచ్చారు. పలు ఫ్యాక్ట్ సంస్థలు కూడా ఇదొక ఫేక్ వార్త అంటూ కొట్టి పడేశాయి.

‘Dream Worlds’ అనే రష్యన్ వెబ్సైట్ లో 2009 లో ఈ ఫోటోను మొదట పోస్టు చేశారు. fanciful double-moon photos అనే విభాగంలో ఈ ఫోటోను పోస్టు చేశారు.

2003 లో “Mars Hoax”, “Mars Spectacular” అంటూ ఈమెయిల్స్ అప్పట్లో బాగా వైరల్ అయ్యాయి. ఆగష్టు 27, 2003లో భూమికి అంగారకుడు అతి దగ్గరగా వస్తాడంటూ మెయిల్స్ ను వైరల్ చేశారు. “perihelic opposition” భాగంగా ఇలా జరుగుతుందని ఈ వైరల్ ఈమెయిల్ లో చెప్పారు.

ఆరోజున భూమికి అంగారకుడికి మధ్య అతి తక్కువ దూరం ఉంటుందని ఆ మెసేజీలో తెలిపారు. ఇలా మరోసారి జరగాలంటే 2287 వరకూ ఎదురుచూడాలని అందులో చెప్పుకొచ్చారు. ఆ సమయంలో అంగారకుడు 6 రెట్లు ఎక్కువగా, 85 రెట్లు పెద్దగా కనిపిస్తూ ఉంటాడని తెలిపారు. కానీ కొందరు ఈ మెసేజీని తప్పుగా అర్థం చేసుకొన్నారు. చంద్రుడి సైజులో అంగారకుడు కనిపిస్తాడంటూ కొన్ని ఫోటో షాప్ చేసిన ఫోటోలను నమ్మడం మొదలుపెట్టారు. అంగారకుడు పెద్దగా కనిపించాలంటే 75-పవర్ మ్యాగ్నిఫికేషన్ ద్వారా టెలీ స్కోప్ లో చూడాల్సిందే..! అంతేకానీ చంద్రుడి లాగా ఆకాశంలో కనిపించడం జరగదు.

కాబట్టి సామాజిక మాధ్యమాల్లో వైరల్ అవుతున్న పోస్టు నిజం కాదు.

Next Story