పెళ్లి అయిన వారం రోజులకే యువతి ఆత్మహత్య.. సూసైడ్ లేఖలో షాకింగ్ నిజాలు
By సుభాష్ Published on 25 March 2020 1:29 PM ISTఒడిశా రాష్ట్రంలో విషాదం చోటు చేసుకుంది. గజపతి జిల్లా మోహన సమితి చంద్రగిరిలో వారం రోజుల క్రితం వివాహం చేసుకున్న ఓ యువతి నిప్పంటించుకుని ఆత్మహత్యకు పాల్పడింది. గజపతి జిల్లా కొందొ అడవకు చెందిన పంకజ నాయక్ (21), గజాం జిల్లా అస్కా ప్రాంతానికి చెందిన సమీర్ జెన్నా కొంతకాలం ప్రేమించుకుంటున్నారు. వారం రోజుల క్రితం ఓ ఇల్లు అద్దెకు తీసుకున్నారు. ఇక వివాహం జరిగిన మరుసటి రోజు నుంచే భర్త వేధింపులకు గురి చేస్తున్నాడని చంద్రగిరి పోలీసుస్టేషన్ లో ఆమె ఫిర్యాదు చేసింది. దీంతో భార్య ఫిర్యాదు చేయడంతో భర్త సమీర్ పరారయ్యాడు.
కాగా, మంగళవారం ఇంటిలో నుంచి పొగలు వస్తున్నాయని ఇంటి యజమాని పోలీసులకు సమాచారం అందించాడు. దీంతో పోలీసులు హుటాహుటిన చేరుకుని తలుపులు బద్దలు కొట్టగా, ఇంట్లో అప్పటికే బాధితురాలు నిప్పంటించుకుని ఆత్మహత్య చేసుకున్నట్లు గుర్తించారు. ఘటన ప్రాంతంలో ఆత్మహత్యకు సంబంధించిన ఓ లేఖను పోలీసులు స్వాధీనం చేసుకున్నారు. భర్త చిత్రహింసల కారణంగానే నేను ఆత్మహత్య చేసుకుంటున్నానని బాధితురాలు లేఖలో పేర్కొన్నట్లు తెలుస్తోంది. కేసు నమోదు చేసుకున్న పోలీసులు దర్యాప్తు చేపట్టారు.