తెలుగు రాజకీయాల్లో తనదైన ముద్రవేసిన ‘మర్రి చెన్నారెడ్డి’
By సుభాష్ Published on 22 Dec 2019 10:59 AM
- నేడు మర్రి చెన్నారెడ్డి వందవ జయంతి
- తెలుగు రాష్ట్రాల్లో చెక్కు చెదరని చెన్నారెడ్డి గుర్తింపులు
మర్రి చెన్నారెడ్డి..ఈయన పేరు అందరికి సుపరిచితమే. రెండు పర్యాయాలు ఆంధ్ర ప్రదేశ్ ముఖ్యమంత్రి గా సేవలందించారు. ఇతను ఉత్తర ప్రదేశ్, పంజాబ్, రాజస్థాన్, తమిళనాడు రాష్ట్రాలకు గవర్నర్‌గా కూడా పనిచేశాడు. పరిపాలన విషయంలో పూర్తి అవగాహన ఉండి, 33 ఏళ్లకే ఆయన మంత్రి అయ్యారు. ముఖ్యమంత్రిగా ఉన్నతాధికారుల పనితీరు, పాలనపై దృష్టి సారించారు. అధికారులు చెప్పినట్లు ఫైళ్లపై సంతకాలు పెట్టకుండా ఆ ఫైళ్లను పూర్తిగా పరిశీలించి సంతకం చేసేవారు. ఇంతటి ప్రముఖ్యత కలిగిన వ్యక్తి చెన్నారెడ్డిది ఈ రోజు శత జయంతి. ఆయన ఇన్నాళ్లు అందరికి దూరమైనా.. ఆయన ఆనవాళ్లు సజీవంగానే గుర్తిండిపోయాయి. చెన్నారెడ్డి ఏపీ, తెలంగాణ రాష్ట్ర రాజకీయాల్లో చెన్నారెడ్డి కీలక పాత్ర పోషించారు. ఆయన గుర్తింపులు ఇప్పటికి తెలుగు రాష్ట్రాల్లో చెక్కు చెదరకుండా ఉన్నాయి.
జననం
చెన్నారెడ్డి జనవరి 13, 1919 న ప్రస్తుత వికారాబాదు జిల్లాలోని తాలూకాలోని సిర్‌పుర గ్రామములో జన్మించాడు. ఇతని తండ్రి మర్రి లక్ష్మారెడ్డి. చెన్నారెడ్డి 1941లో ఎంబీబీఎస్‌లో డిగ్రీ పొందాడు. విద్యార్థిగా ఉన్న రోజుల్లో ఆంధ్ర యువజన సమితి, విద్యార్థి కాంగ్రెసును స్థాపించాడు. ఇవే కాక అనేక విద్యార్థి, యువత, విద్యా, అక్షరాస్యత, సాంస్కృతిక సంస్థలలో చురుకుగా పాల్గొనేవాడు. ఇతను ఒక వారపత్రికకు రెండు సంవత్సరాల పాటు సంపాదకత్వం వహించాడు. అంతే కాక అనేక పత్రికలలో వ్యాసాలు కూడా ప్రచురించాడు. చెన్నారెడ్డి అప్పటి హైదరాబాదు రాష్ట్రములోని స్వాతంత్ర్యోద్యమంలో కూడా పాల్గొని ప్రముఖ పాత్ర వహించారు. 1942లో ఆంధ్ర మహాసభ ప్రధాన కార్యదర్శిగా పని చేశాడు.
రాజకీయ జీవితం
గాంధీజీ పిలుపు మేరకు 1935లో ఆంధ్రమహాసభలో పాల్గొన్నారు. అది ఆయన రాజకీయ అరంగేట్రం. కార్యకర్తగా, సమావేశకర్తగా, ఖాదీ ప్రచారకుడుగా, గాంధేయుడుగా, విద్యార్థి నాయకుడుగా, ఆంధ్ర విద్యార్థి కాంగ్రెస్ వ్యవస్థాపకుడుగా అనేక స్థాయిల్లో పనిచేసి అనుభవాన్ని సంపాదించారు. 1938లో జైలు శిక్షను అనుభవించారు. చెన్నారెడ్డి ముఖ్యమంత్రిగా ఉన్న సమయంలో హైదరాబాద్ అభివృద్ధి ఎంతో వేగంగా పెరిగింది. 40 ఏళ్ల క్రితమే ప్రభుత్వ ఉద్యోగులకు ఐదు రోజుల పనివారం అందుబాటులోకి తీసుకువచ్చారు. కాగా, ఈ పద్దతిని ప్రవేశపెట్టిన తర్వాత ఆచరణలో పెద్దగా ఉపయోగం లేకపోవడంతో తిరిగి పాత పద్దతినే కొనసాగించారు.
ఇందిరాగాంధీ ఆదేశాలతో గవర్నర్ పదవికి..
అప్పట్లో పంజాబ్‌లో ఉగ్రవాదులు పెరిగిపోతున్న నేపథ్యంలో గవర్నర్ పదవిని చేపట్టాలని ఇందిరా గాంధీ ఆదేశించడంతో చెన్నారెడ్డి పంజాబ్‌కు రాష్ట్రానికి వెళ్లిపోయారు. కొన్నాళ్ల తర్వాత కాంగ్రెస్ నాయకత్వంతో విబేధించి తన అనుచరులతో కలిసి నేషనల్ డెమోక్రాటిక్ పార్టీ ఆఫ్ ఇండియాను స్థాపించారు. 1984లో జరిగిన పార్లమెంట్ ఎన్నికల్లో తెలుగుదేశం మద్దతుతో కరీంనగర్ నుంచి పార్లమెంట్‌కు పోటీ చేసి మర్రి చొక్కారావు చేతిలో ఓటమి పాలయ్యారు. ఆ తర్వాత రాజీవ్ గాంధీ ప్రధాన మంత్రి అయ్యాక మళ్లీ కాంగ్రెస్ గూటికి చేరారు. 1978లో మాదిరిగా, 1989లో అసెంబ్లీ, పార్లమెంట్ ఎన్నికల సమయంలో కూడా మర్రి చెన్నారెడ్డి రాష్ట్ర కాంగ్రెస్ కమిటీ అధ్యక్ష పదవీ బాధ్యతలు అప్పగించారు. ఆయన బాధ్యతలు చేపట్టిన తర్వాత పార్టీని విజయపథంగా ముందుకు తీసుకెళ్లారు. కాగా, 1989లో రెండోసారి ముఖ్యమంత్రిగా బాధ్యతలు చేపట్టిన మర్రి చెన్నారెడ్డి.. ఏడాదికే అసమ్మతి సెగల కారణంగా రాజీనామా చేసేశారు. తర్వాత రాజకీయాలకు దూరమై మరణించే వరకు ఇతర రాష్ట్రాల్లో గవర్నర్‌గా కొనసాగారు.
చెన్నారెడ్డి మరణం:
డిసెంబర్ 2,1996లో మర్రి చెన్నారెడ్డి కన్నుమూశారు. ప్రస్తుతం చెన్నారెడ్డి సమాధి హైదరాబాదులో ఇందిరా పార్కు ఆవరణలో ఉంది. తెలంగాణా కోసం తెలంగాణ ప్రజా సమితి పార్టీ పెట్టి అన్ని సీట్లు గెలిచి, ఆపార్టీని కాంగ్రెసులో విలీనం చేశాడు.