బెంగళూరులో భార్యను చంపేశాడు.. కోల్‌కతాకు వెళ్లి అత్తను కూడా చంపి.. తాను కూడా..!

By న్యూస్‌మీటర్ తెలుగు  Published on  23 Jun 2020 9:04 AM GMT
బెంగళూరులో భార్యను చంపేశాడు.. కోల్‌కతాకు వెళ్లి అత్తను కూడా చంపి.. తాను కూడా..!

కుటుంబ కలహాల కారణంగా ఎంతటి ఘోరాలు జరుగుతాయో తెలుసుకోడానికి ఓ ఉదాహరణ ఈ ఘటన. 42 ఏళ్ల వ్యక్తి బెంగళూరులో తన భార్య, కొడుకుతో కలిసి నివసిస్తూ ఉన్నాడు. కుటుంబ కలహాలు తలెత్తడంతో విసిగిపోయిన అతను తన భార్యను చంపేశాడు. విమానం ఎక్కి కోల్ కతాకు వెళ్లి తన అత్తను కూడా చంపేశాడు. మామను కూడా చంపేసేవాడే కానీ ఆయన తృటిలో తప్పించుకున్నాడు. ఈ రెండు హత్యలు చేసిన వ్యక్తి తనను కూడా కాల్చేసుకుని ఆత్మహత్య చేసుకున్నాడు. అతడి దగ్గర సూసైడ్ నోట్ కూడా లభించింది. కోల్ కతాకు రాకముందు తన భార్యను కూడా చంపేశానంటూ అందులో రాసుకొచ్చాడు. కోల్ కతా పోలీసులు సమాచారాన్ని బెంగళూరు పోలీసులకు తెలియజేయగా.. వారి అపార్ట్మెంట్ లో వెళ్లి చూడగా అతడి భార్య శవం లభించింది.

చార్టర్డ్ అకౌంటెంట్ గా పనిచేస్తున్న అమిత్ అగర్వాల్ శిల్పి ధందానియాను కొన్నేళ్ల కిందట పెళ్లి చేసుకున్నాడు. వారిద్దరికీ 10 సంవత్సరాల కొడుకు ఉన్నాడు. ఈ మధ్య భార్యాభర్తల మధ్య మనస్పర్థలు రావడంతో విడాకులు తీసుకోవాలని అనుకుంటూ ఉన్నారు. బెంగళూరు నుండి కోల్ కతా కు వెళ్లిన అమిత్ తన అత్తగారి ఇంటికి సాయంత్రం 5:30 కు చేరుకున్నాడు. అక్కడ వారి మధ్య జరిగిన చర్చలు కాస్తా విఫలమయ్యి.. గొడవకు దారి తీసింది. గొడవ పెద్దది అయ్యిన వెంటనే అమిత్ తన దగ్గర ఉన్న తుపాకీని తీసి అత్త లలితాను పాయింట్ బ్లాంక్ రేంజిలో కాల్చేశాడు. అతడి మామ సుభాష్ షాక్ కు గురైపోవడమే కాకుండా వెంటనే అపార్ట్మెంట్ బయటకు వచ్చి లాక్ చేశాడు. వెంటనే స్థానికులకు సమాచారం అందించాడు. పోలీసులు ఘటనా స్థలానికి చేరుకుని చూడగా ఫ్లాట్ లోపల అతడు కూడా తనను తాను కాల్చుకుని మరణించాడు. అతడి దగ్గర ఉన్న సూసైడ్ నోట్ లో తన భార్యను కూడా చంపేశానని రాశాడు.

బెంగళూరు లోని వైట్ ఫీల్డ్ లోని అపార్ట్మెంట్ లో అతడి భార్య శవం లభించిందని వైట్ ఫీల్డ్ డీసీపీ తెలిపారు. లీగల్ యాక్షన్ తీసుకుంటున్నామని పోలీసులు తెలిపారు. అగర్వాల్ కుమారుడి సమాచారం కోసం పోలీసులు వెతకగా.. అతడు సురక్షితంగానే ఉన్నాడని తెలుసుకుని ఊపిరి పీల్చుకున్నారు.

Next Story
Share it