బాప్‌రే.. ఈ ఏసీపీ మాములోడు కాదు.. అక్రమాస్తుల విలువ రూ.70 కోట్లు..!
By సుభాష్ Published on 24 Sept 2020 11:57 AM ISTఏసీబీ వలలో మరో భారీ అవినీతి తిమింగలం చిక్కింది. మొన్న కీసర తహసీల్దారు, చిన్న అదనపు కలెక్టర్ నగేష్ లంచాల గురించి జరుగుతున్న చర్చ ఇంకా మర్చిపోకముందే తాజాగా మరో అధికారి ఏసీబీ వలలో పడ్డారు. భూదందాలు, అక్రమ వ్యాపారాలతో కోట్లు కొల్లగొడుతున్న మల్కాజిగిరి ఏసీపీ నర్సింహారెడ్డి అవినీతి వ్యవహారం బట్టబయలైంది. బుధవారం అవినీతి నిరోధక శాఖ (ఏసీబీ) అధికారులు హైదరాబాద్‌లోని నరసింహారెడ్డి ఇంటితోపాటు బంధువులు, బినామీల ఇండ్లు కలిపి ఏకకాలంలో 25 చోట్ల సోదాలు కొనసాగించారు. ఇప్పటి వరకు రూ.70 కోట్ల అక్రమాస్తులను గుర్తించినట్లు ఏసీబీ అధికారులు తెలిపారు. ఇంకా సోదాలు కొనసాగుతున్నాయి. ఏసీపీ నర్సింహారెడ్డిని సైతం అరెస్టు చేశారు ఏసీబీ అధికారులు. భూదందాల వ్యవహారంలో ఆరోపణలు ఎదుర్కొంటున్న నేపథ్యంలో ఏసీబీ ప్రాథమిక ఆధారాలతో ఆదాయానికి మించి ఆస్తుల కేసు నమోదు చేసింది. ఏసీపీని అరెస్టు చేసిన అధికారులు గురువారం న్యాయస్థానంలో హాజరు పర్చే అవకాశం ఉంది.
రెండు రాష్ట్రాల్లో తనిఖీలు
ఏసీపీ నర్సింహారెడ్డి తెలంగాణతో పాటు ఏపీలోనూ అక్రమాస్తులుట్లు అవినీతి నిరోధక శాఖ అధికారులు గుర్తించినట్లు తెలుస్తోంది. హైదరాబాద్‌లోని మహేంద్రహిల్స్, కొంపల్లి, బాలానగర్, ఉప్పల్, అంబర్‌పేట, డీడీకాలనీల్లో సోదాలు నిర్వహించారు. మహేంద్రహిల్స్‌లోని నర్సింహారెడ్డి ఇంట్లో సోదాల సమయంలో ఏసీపీ నుంచి పలు వివరాలు సేకరించారు. జనగామ జిల్లా లింగాలఘనపురం మండలం వడిచర్లలో నర్సింహారెడ్డి అత్తగారి ఇల్లు, రఘనాథపల్లి మండలం కంచనపల్లి, బచ్చన్నపేట మండలం వీఎస్‌ఆర్‌నగర్, యాదాద్రి భువనగిరి జిల్లా భూదాన్‌పోచంపల్లి మండలం ఇంద్రియాల, కరీంనగర్ జిల్లా గంగాధర మండలం మధురానగర్‌లోని సన్నిహితుల ఇళ్లల్లోనూ తనిఖీలు నిర్వహించారు. ఇక్కడ నర్సింహారెడ్డి పేరిట 55 ఎకరాల వ్యవసాయ భూమి ఉన్నట్లు ఏసీబీ గుర్తించింది. గురువారం కూడా సోదాలు కొనసాగే అవకాశాలు కనిపిస్తున్నాయి.
భూ వివాదాల సెటిల్ మెంట్లు
కాగా, నర్సింహారెడ్డి ఉప్పల్ సీఐగా ఉన్న సమయంలో స్థానికంగా ఎన్నో భూ వివాదాలను సెటిల్‌మెంట్ చేసి అవినీతి సొమ్ము వెనుకేసుకున్నట్లు ఏసీబీ అధికారులు అనుమానిస్తున్నారు. నర్సింహారెడ్డి బినామీగా అనుమానిస్తున్న పాటిల్ అనే వ్యక్తి ద్వారా ఉప్పల్‌లో దర్బార్ పేరిట ఏకంగా ఓ బార్ అండ్ రెస్టారెంట్‌ను పెట్టించినట్లు సమాచారం. గతంలో హిమాయత్‌నగర్‌లో ఓడ్యాన్స్ బార్‌లో నర్సింహారెడ్డి బినామీలు ఉన్నట్లు ఆరోపణలు ఉన్నాయి. అలాగే ఉప్పల్ సీఐగా, చిక్కడ్‌పల్లి సీఐగా, ఎల్బీనగర్ ఏసీపీగా ఉన్న సమయంలో పలు వివాదాల్లో నర్సింహారెడ్డి పాత్ర కూడా ఉన్నట్లు అధికారులు ఆధారాలు సేకరించినట్లు సమాచారం. వీటన్నింటిపై ఏసీబీ అధికారులు లోతుగా దర్యాప్తు చేపడుతున్నట్లు తెలుస్తోంది. నర్సింహారడ్డి బినామీగా ఉన్నట్లు భావిస్తున్న పాటిల్ ప్రస్తుతం పరారీలో ఉన్నట్లు తెలుస్తోంది.
బినామీలతో సంబంధాలు
సికింద్రాబాద్ మహేంద్రహిల్స్‌లో ఏసీబీ సోదాల్లో మరో ట్విస్ట్ చోటు చేసుకుంది. ఓ హైదరాబాద్ ప్రజాప్రతినిధి బినామీలతో ఏసీపీకి సంబంధాలు ఉన్నాయని గుర్తించినట్లు తెలుస్తోంది. కొండాపూర్‌లోని సర్వే నెంబర్ 64లో అసైన్డ్ భూమిని కొనుగోలు చేసినట్లు కూడా అధికారులు గుర్తించారు. ఆ భూమిని మధుకర్ అనే వ్యక్తి ద్వారా కొనుగోలు చేసినట్లు విచారణలో నర్సింహారెడ్డి తెలిపినట్లు తెలుస్తోంది. దీంతో జగిత్యాల జిల్లా గంగధరలో మధుకర్ ఇంట్లో ఏసీబీ సోదాలు నిర్వహిస్తున్నారు. అలాగే ఘట్‌కేసర్ ప్రాంతంలో 30 ఎకరాల వివాదస్పద భూమిని కొనుగోలు చేసినట్లు తెలుస్తోంది.
ఆస్తుల వివరాలు:
నర్సింహారెడ్డికి సంబంధించిన పలు విలువైన ఆస్తులను ఏసీబీ గుర్తించింది. పట్టుబడిన ఆస్తుల విలువ ప్రభుత్వ లెక్కల ప్రకారం.. రూ.7.5 కోట్లు కాగా, బహిరంగ మార్కెట్‌లో వీటి విలువ రూ.70 కోట్ల వరకు ఉంటుందని అధికారులు తెలిపారు.
► అనంతపురంలో 55 ఎకరాల పొలం
► హైదరాబాద్‌లో సైబర్ టవర్ల ఎదుట 1.960 చదరపు గజాల నాలుగు ఇంటి స్థలాలు
► హఫీజ్‌పేటలో రెండు ఇంటి స్థలాలు, జీప్లస్ 3 వాణిజ్య భవనం
► రెండు సొంత ఇండ్లు, రూ.15 లక్షల బ్యాంకు బ్యాలెన్స్, రెండు బ్యాంకు లాకర్లు
► రియల్ ఎస్టేట్‌తోపాటు ఇతర వ్యాపారాల్లో నర్సింహారెడ్డి పెట్టుబడులు