మల్కాజిగిరి ఏసీపీ నరసింహారెడ్డి అరెస్ట్
By సుభాష్ Published on 24 Sep 2020 3:09 AM GMTమల్కాజిగిరి ఏసీపీ నరసింహారెడ్డిని అవినీతి నిరోధక శాఖ (ఏసీబీ) అధికారులు అరెస్ట్ చేశారు. ఆదాయానికి మించి ఆస్తున్నట్లు ఆరోపణలు రావడంతో నిన్న ఏసీబీ అధికారులు దాడులు చేశారు. ఏసీపీ నరసింహారెడ్డి ఇంటితో పాటు ఆయన బంధువుల ఇళ్లల్లోనూ సోదాలు నిర్వహించారు. ఆయనను అరెస్టు చేసి ఏసీబీ కార్యాలయానికి తరలించారు. గురువారం ఏసీబీ కోర్టులో ప్రవేశపెట్టనున్నారు. ఏకకాలంలో దాదాపు 25 చోట్ల ఏసీబీ తనిఖీలు చేపట్టింది. ఇప్పటికే చేపట్టిన తనిఖీల్లో సుమారు రూ.70 కోట్ల ఆస్తులను ప్రాథమికంగా గుర్తించినట్లు ఏసీబీ అధికారులు తెలిపారు. సికింద్రాబాద్ మహేంద్రహిల్స్‌లోని నరసింహారెడ్డి ఇల్లు, ఆయన బంధువులు, స్నేహితుల ఇళ్లల్లో అధికారులు భారీ ఎత్తున సోదాలు నిర్వహించారు. హైదరాబాద్‌లో 3 ఇళ్లు, 5 ఇంటి స్థలాలు గుర్తించినట్లు ఏసీబీ డిప్యూటీ డైరెక్టర్ రవీందర్‌రెడ్డి తెలిపారు.
కాగా, హైదరాబాద్‌తోపాటువరంగల్ జిల్లాల్లో మూడు చోట్ల, కరీంనగర్, నల్గొండ జిల్లాల్లో రెండు చోట్ల, ఏపీలోని అనంతపురంలో ఒక చోట ఈ తనిఖీలు నిర్వహించారు. నర్సింహారెడ్డి గతంలో ఉప్పల్ సీఐగా పని చేశారు. ఆ సమయంలో పలు భూవివాదాల్లో సంబంధం ఉన్నట్లు ఆరోపణలు వచ్చాయి. ఈ నేపథ్యంలో ఏసీబీ అధికారులు ఈ సోదాలు నిర్వహించారు.