2011 ప్రపంచకప్ ఫైనల్‌ను.. శ్రీలంక భారత్‌కు అమ్మేసింది
By న్యూస్‌మీటర్ తెలుగు
శ్రీలంక మాజీ క్రీడల మంత్రి మహిందనంద అళుత్ గమగే 2011 వరల్డ్ కప్ ఫైనల్ పై తీవ్ర ఆరోపణలు చేశారు. శ్రీలంక జట్టు ఫైనల్ ను భారత్ కు అమ్మేసిందని అందుకే భారతజట్టు గెలిచిందని ఆరోపణలు చేశారు. సిరాస టీవీ ఛానల్ తో మాట్లాడిన మహిందనంద శ్రీలంక జట్టు మ్యాచ్ ఫిక్సింగ్ చేసిందని ఆరోపణలు చేశారు. ఆ మ్యాచ్ ఫిక్స్ అయిందని అన్నారు.
275 పరుగుల టార్గెట్ ను భారత్ అందుకోడానికి బాగా కష్టపడింది. సచిన్, సెహ్వాగ్ తక్కువ పరుగులకే అవుట్ అవ్వడంతో గంభీర్ మ్యాచ్ ను భుజాన వేసుకున్నాడు. 97 పరుగుల అద్భుతమైన ఇన్నింగ్స్ ను గంభీర్ ఆడగా.. చివర్లో ధోని 91 పరుగులతో మెరుపులు మెరిపించి భారత్ కు చిరస్మరణీయమైన విజయాన్ని అందించాడు. టోర్నీ మొత్తం భారత సమిష్టి కృషితో విజయాలను అందుకుంది.
మహిందనంద అళుత్ గమగే ఈ మ్యాచ్ ఫిక్స్ అయిందని.. తాను స్పోర్ట్స్ మినిస్టర్ గా ఉన్న సమయంలోనే ఇది జరిగిందని సంచలన వ్యాఖ్యలు చేశారు. 2011 లేదా 2012లో జరిగిందో తనకు తెలియదు కానీ శ్రీలంక గెలిచే ఈ మ్యాచ్ ను కావాలనే ఓడిపోయిందని అన్నారు. దీని వెనుక ఎవరు ఉన్నారో తెలుసునని కూడా మహిందనంద అళుత్ గమగే చెప్పుకొచ్చారు. ఆగష్టు 5న శ్రీలంకలో ఎన్నికలు జరగాల్సి ఉంది.. ఇలాంటి సమయంలో మహిందనంద అళుత్ గమగే ఈ వ్యాఖ్యలు చేయడం సంచలనమైంది.
ఈ వ్యాఖ్యలపై శ్రీలంక క్రికెట్ లెజెండ్స్ కుమార సంగక్కర, మహేళ జయవర్దనే స్పందించారు.
ఎలక్షన్స్ దగ్గరకు వచ్చినట్లు ఉన్నాయి.. అప్పుడే సర్కస్ మొదలైనట్లు ఉంది.. సాక్ష్యాలు ఏమేమి ఉన్నాయో బయటపెట్టగలరా..? అని మహేళ జయవర్దనే ట్వీట్ చేశారు.
కుమార సంగక్కర కూడా స్పందిస్తూ.. 'ఐసీసీ అవినీతి నిరోధక బృందం దగ్గర సాక్ష్యాలను సమర్పిస్తే వాళ్లు పూర్తి స్థాయిలో విచారణ చేస్తారు కదా' అని ట్వీట్ చేశారు.
ఎలక్షన్స్ దగ్గరకు వచ్చినప్పుడల్లా ఇలాంటి ఆరోపణలు ఆ దేశ రాజకీయ నాయకులు చేయడం పరిపాటైంది. మహిందనంద అళుత్ గమగే మాత్రం ఆటగాళ్లు మ్యాచ్ ఫిక్సింగ్ కు పాల్పడలేదని కొన్ని పార్టీలు ఈ మ్యాచ్ ను ఫిక్సింగ్ చేశాయని చెప్పుకొచ్చారు. 2011న వాంఖడే స్టేడియంలో జరిగిన ఈ ఫైనల్ మ్యాచ్ కు మహిందనంద అళుత్ గమగేతో పాటు శ్రీలంక ప్రెసిడెంట్ మహింద రాజపక్షే కూడా వచ్చి చూసి వెళ్లారు. ఇక శ్రీలంక జట్టు మాజీ కెప్టెన్ అర్జున రణతుంగ కూడా అప్పుడప్పుడు 2011 వరల్డ్ కప్ ఫైనల్ ఫిక్స్ అయిందంటూ ఆరోపణలు చేస్తూ వస్తున్నారు.