రౌడీకి మద్దతు తెలిపిన మహేష్ బాబు, రవితేజ.. అంతం చేయబోతున్నారా..?

By న్యూస్‌మీటర్ తెలుగు  Published on  5 May 2020 2:14 AM GMT
రౌడీకి మద్దతు తెలిపిన మహేష్ బాబు, రవితేజ.. అంతం చేయబోతున్నారా..?

లాక్ డౌన్ కారణంగా ఇబ్బందులు పడుతున్న మిడిల్ క్లాస్ జనాల కోసం టాలీవుడ్ హీరో విజయ్ దేవరకొండ తన వంతు సహాయం చేస్తున్నాడు. కానీ ఇవేవీ పట్టించుకోకుండా కొన్ని వెబ్ సైట్స్ విజయ్ దేవరకొండ మీద బురదజల్లడమే పనిగా పెట్టుకున్నాయి. విజయ్ దేవరకొండ మిడిల్ క్లాస్ జనాలను అవమానించాడంటూ వార్తలు రాయడం మొదలుపెట్టారు.

గత కొద్దిరోజులుగా వాటిని గమనిస్తూనే ఉన్న విజయ్ దేవరకొండ తాజాగా ఈ ఫేక్ వార్తల వెబ్ సైట్స్ పై ఓ వీడియోను యుట్యూబ్ లో పోస్టు చేశాడు. సినిమా వాళ్ళను టార్గెట్ చేసి.. లేని పోనీ గాసిప్స్ ను రాస్తూ బ్రతుకుతున్నారని.. చేస్తున్న మంచిని కూడా చూసే కళ్లు వీళ్లకు లేవని విజయ్ దేవరకొండ ఆగ్రహాన్ని వ్యక్తం చేశాడు. ఆ వెబ్ సైట్స్ పెట్టిన వార్తల ప్రింట్ అవుట్ తీసి ఒక్కో ముక్క చదువుతూ.. దానికి క్లారిటీ ఇచ్చాడు.

విజ‌య్ ఎక్క‌డ‌..? విజ‌య్‌కి సాయం చేసే మ‌న‌సు లేదా..? అంటూ ఇష్టం వ‌చ్చిన‌ట్లు వార్త‌లు రాస్తున్నారు. అస‌లు వీరంద‌రూ ఎవ‌రు న‌న్ను అడ‌గ‌టానికి. మీరంతా సినీ ఇండ‌స్ట్రీపై ఆధార ప‌డి బ‌తుకుతున్నారు. యాడ్స్ ఇవ్వ‌కుంటే.. సినిమాల‌కు త‌క్కువ రేటింగ్స్ ఇస్తామ‌ని బెదిరిస్తున్నారు. ఇక ఇంట‌ర్వ్యూలు వారు అడిగిన స‌మ‌యంలో ఇవ్వ‌కుంటే ఇష్టం వ‌చ్చిన‌ట్లు రాస్తున్నారు. వారి అభిప్రాయాల‌ను అందరిపై రుద్దుతున్నారు. నాకు ఎప్పుడు ఇష్టం అయితే అప్పుడు ఇస్తా.. నాకు న‌చ్చిన వారికి ఇస్తా.. స‌మ‌యం ఉంటే ఇస్తా.. లేకుంటే లేదు.. అంటూ లెఫ్ట్ అండ్ రైట్ ఇచ్చేశాడు. సినిమా కుటుంబంలో నిప్పులు జల్లడానికి కూడా కొన్ని వెబ్ సైట్లు ప్రయత్నిస్తూ ఉన్నాయని ఆ అంశాన్ని కూడా ప్రస్తావిస్తూ మాట్లాడాడు విజయ్ దేవరకొండ.

విజయ్ దేవరకొండ పెట్టిన వీడియోకు పెద్ద ఎత్తున మద్దతు లభిస్తోంది. సూపర్ స్టార్ మహేష్ బాబు విజయ్ దేవరకొండకు మద్దతు తెలుపుతూ తన ట్విట్టర్ ఖాతాలో ఓ పోస్టు పెట్టాడు. ప్రజల ప్రేమ, గౌరవాన్ని పొందడం కోసం కొన్నేళ్ల పాటూ కష్టపడతాం. నీ భార్యకు మంచి భర్తగా ఉండటానికి నువ్వు పనిచేస్తావు. నీ పిల్లలు కోరుకున్నట్టు సూపర్ హీరో తండ్రిగా ఉంటావు. నీ అభిమానులు కోరుకునే సూపర్ స్టార్‌గా ఉంటావు. డబ్బు కోసం ఏదైనా చేయడానికి సిద్ధమైన ఓ వ్యక్తి నిన్ను అగౌరవపరుస్తాడు. చదివే వాళ్లకు తప్పుడు వార్తలు అందిస్తాడు. తప్పుడు సమాచారాన్ని వ్యాప్తి చేస్తాడు. ఇదంతా డబ్బు కోసమే. అందమైన మన తెలుగు సినిమా పరిశ్రమను రక్షించాలని నేను కోరుకుంటున్నాను. నా అభిమానులను కాపాడాలని నేను కోరుకుంటున్నాను. తమపై తప్పుడు వార్తలు రాస్తూ, తమను అగౌరపరుస్తూ, సమిష్టిగా తమపై అబద్ధాలను ప్రచారం చేస్తోన్న ఈ ఫేక్ వెబ్‌సైట్స్‌‌పై చర్యలు తీసుకోవాలని పరిశ్రమను కోరుతున్నాను. కిల్ ఫేక్ న్యూస్, కిల్ గాసిప్ వెబ్‌సైట్స్ అనే టాగ్స్ ను జోడిస్తూ మహేష్ బాబు తన ట్వీట్‌ ద్వారా విజయ్ దేవరకొండకు మద్దతు తెలిపాడు.

ఇక రవితేజ కూడా విజయ్ దేవరకొండకు మద్దతు తెలుపుతూ ట్వీట్ చేశారు. ఇకనైనా సినిమా ఇండస్ట్రీ మీద గాసిప్స్ రాసుకుంటూ బతికే వాళ్ళ ఆటలు సాగనివ్వకుండా చేద్దాం. సినిమాను నమ్ముకున్న వాళ్ళు, అభిమానులు కలిసి కట్టుగా ఈ వెబ్‌సైట్‌ల‌ను అడ్డుకుందాం అని అన్నారు రవితేజ.

వీరే కాదు పలువురు ప్రముఖులు విజయ్ దేవరకొండకు మద్దతుగా నిలుస్తున్నారు. దర్శకులు క్రిష్, కొరటాల శివ, వంశీ పైడిపల్లి, హరీష్ శంకర్, అనిల్ రావిపూడి తదితరులు విజయ్ దేవరకొండకు తమ మద్దతు తెలిపారు.

Next Story