దేశంలోని తల్లిదండ్రులను వణికిస్తున్న 'బాయ్స్ లాకర్ రూమ్' చాటింగ్..!

By న్యూస్‌మీటర్ తెలుగు  Published on  5 May 2020 3:46 AM GMT
దేశంలోని తల్లిదండ్రులను వణికిస్తున్న బాయ్స్ లాకర్ రూమ్ చాటింగ్..!

ఢిల్లీకి చెందిన టీనేజ్ అబ్బాయిలకు చెందిన గ్రూప్ చాట్ ఫోటోలు ప్రస్తుతం సోషల్ మీడియాలో వైరల్ అవుతూ ఉన్నాయి. వారంతా ఎంతో సాధారణంగా అమ్మాయిల శరీరం గురించి, రేప్ చేయడం గురించి మాట్లాడుతూ ఉన్నారు. ఢిల్లీ పోలీసులు ఈ ఇంస్టాగ్రామ్ గ్రూప్ చాట్ లో ఉన్న అబ్బాయిలపై కేసులు పెట్టారు. ప్రస్తుతం ఈ గ్రూప్ డీయాక్టివేట్ అయింది. కానీ ఈ గ్రూప్ లో అబ్బాయిలు చేసిన చాటింగ్ మాత్రం బాగా వైరల్ అయింది. దీన్ని చూసిన ప్రతి ఒక్కరూ షాక్ కు గురవుతున్నారు.

సైబర్ క్రైమ్ పోలీసులు కూడా ఇంస్టాగ్రామ్ కు ఈ గ్రూప్ డీటెయిల్స్ కావాలని కోరుతూ దరఖాస్తు పెట్టుకున్నారు. ఆ చాటింగ్ లో ఉన్న మాటలు చూసి తల్లిదండ్రులు కూడా తల దించుకోవాల్సిందే. తమ పిల్లలను ఇంత కూడా సంస్కారం లేనట్టు పెంచామా అని తల్లిదండ్రులు బాధపడేలా చేసింది ఈ చాట్.

ఆదివారం నాడు ఈ వివాదం బయటకు వచ్చింది. సోషల్ మీడియా యూజర్లు చాలా మంది "Bois Locker Room" అనే వాట్సప్ గ్రూప్ చాట్ కు చెందిన మెసేజీలను తమ తమ సోషల్ మీడియా అకౌంట్లలో పోస్టు చేయడం మొదలుపెట్టారు. ఆ మెసేజీలలో చాలా వరకూ అమ్మాయిలకు చెందిన ప్రైవేట్ ఫోటోలు, ఆడవాళ్లను శరీర భాగాలపై కామెంట్లు, కించ పరుస్తూ వ్యాఖ్యలు, రేప్ లు చేయడం చాలా ఈజీ అంటూ వ్యాఖ్యలు.. ఇవి చూస్తే తల్లిదండ్రుల వెన్నులో వణుకుపుట్టడం ఖాయమే..! వీరంతా ఢిల్లీ స్కూల్స్ లో 11, 12 తరగతుల్లో చదివే పిల్లలే. కొన్ని చాట్ కు సంబంధించిన స్క్రీన్ షాట్ లలో టీనేజీ అమ్మాయిలకు చెందిన ఫోటోలు ఉన్నాయి. సొంత క్లాస్ మేట్ అమ్మాయి గురించే చాలా చెత్తగా మాట్లాడడం.. ఆ అమ్మాయిని రేప్ చేయడం చాలా సులువు అంటూ వ్యాఖ్యలు చేయడం మొత్తం వైరల్ అవుతున్నాయి.

వీటిని చూసిన నెటిజన్లు ఆ చాట్ రూమ్ లో ఉన్న వారిపై తప్పకుండా చర్యలు తీసుకోవాలని సోషల్ మీడియాలో ట్వీట్లు చేస్తున్నారు. #BoysLockerRoom అనే హాష్ ట్యాగ్ ట్విట్టర్ లో వైరల్ అయింది. వీళ్ళను కఠినంగా శిక్షించాలని కోరుతూ ఉన్నారు.



ఢిల్లీ కమీషన్ ఫర్ విమెన్(DCW) ఛైర్ పర్సన్ స్వాతి మలివాల్ ఆ గ్రూప్ చాట్ సభ్యులను వెంటనే అరెస్టు చేయాలని కోరారు. డిసిడబ్ల్యూ ఇంస్టాగ్రామ్ కు, ఢిల్లీ పోలీసులకు నోటీసులు పంపింది. వీళ్ళని తక్షణమే అరెస్టు చేయాలని.. కఠినమైన యాక్షన్ తీసుకోవాలని కోరింది.

ఈ అబ్బాయిల స్క్రీన్ షాట్ లు చూసిన చాలా మంది షాక్ లో ఉన్నారు. ఇంత చిన్న వయసులో ఉన్న వాళ్లు.. ఇంత దారుణంగా ఎలా ఆలోచిస్తూ ఉన్నారు. పెంపకంలో లోపమా.. లేకపోతే అలవాట్లు వాళ్ళని ఆ స్థాయికి దిగజార్చాయా అని నెటిజన్లు తమ తమ అభిప్రాయాలను వ్యక్తం చేస్తున్నారు.

ముంబై పోలీసులు కూడా దీనిపై స్పందించారు. వారిని చిన్న వయసులోనే అదుపులో పెట్టాలని.. పెద్దయ్యాక సమాజానికే ప్రమాదకరంగా మారొచ్చని అన్నారు.



ఓ వైపు ఈ గ్రూప్ కు చెందిన అబ్బాయిల కోసం వేట కొనసాగుతున్నా.. మరో వైపు తమ మీద రిపోర్టు చేసిన వారికి సంబంధించిన నగ్న ఫోటోలను సోషల్ మీడియాలో పెడతామని Bois Locker Room సభ్యులు బెదిరింపులకు దిగారు. ప్రస్తుతం వాళ్లు రెండో గ్రూప్ ను మొదలుపెట్టినట్లు తెలుస్తోంది.

ఆడవారికి మర్యాద ఇవ్వకపోవడం, రేప్ జోక్స్, ఆడవాళ్ళ శరీరాల గురించి మాట్లాడడమే ఈ గ్రూప్ లో జరుగుతున్న చాటింగ్. చిన్న వయసులోనే వీరిలో ఇలాంటి ఉద్దేశ్యాలు ఉన్నాయంటే.. వీరు ఎదిగే కొద్దీ సమాజానికి, ఆడవారికీ ప్రమాదకరంగా మారే అవకాశం ఉంది. రేప్ కల్చర్ ను పెంచే విధంగా వీరి చర్యలు ఉన్నాయి. 2018 లో మీటూ మూమెంట్ జరిగే సమయంలో చేసిన ఇంటర్నేషనల్ పోల్ లో మహిళల విషయంలో ప్రపంచంలోనే అత్యంత ప్రమాదకరమైన దేశాల లిస్టులో భారత్ ఉందట. భారత్ లో లైంగిక హింస అన్నది చాలా ఎక్కువగా ఉండడంతో భారత్ ను ఈ లిస్టులోకి చేర్చారు. ఇక ఇలాంటి గ్రూప్ చాట్ లు బయటకు రావడం.. చిన్న చిన్న వయసులోనే వారి మనస్సులో ఆడవారంటే కనీస గౌరవం లేకపోవడం.. ప్రతి ఒక్కరినీ కలవరపెడుతోంది.

Next Story