మహారాష్ట్ర మంత్రికి కరోనా.. పోలీస్ అధికారి నుంచే..!
By తోట వంశీ కుమార్ Published on 24 April 2020 7:27 AM GMTకరోనా వైరస్ భారత్‌లో విజృంభిస్తోంది. కరోనా పాజిటివ్ కేసుల సంఖ్య రోజు రోజుకు పెరుగుతున్నాయి. ఇక ఈ మహమ్మారి ఎవ్వరిని వదలడం లేదు. చిన్న, పెద్ద అనే తేడా లేదు. ఇక దేశంలో కరోనా కేసులు అత్యధికంగా నమోదవుతున్న రాష్ట్రాల్లో మహరాష్ట్ర ఒకటి. తాజాగా మహారాష్ట్ర మంత్రి ఒకరు ఈ మహమ్మారి బారిన పడ్డారు.
మహారాష్ట్ర గృహ నిర్మాణశాఖ మంత్రి జితేంద్ర అవద్ కు కరోనా సోకినట్లు అధికారులు నిర్ధారించారు. ఇటీవల మంత్రి భద్రతా సిబ్బందిలో ఒకరికి కరోనా పాజిటివ్‌గా తేలడంతో.. వారం రోజులుగా మంత్రి తన కుటుంబ సభ్యులతో కలిసి హోం క్వారంటైన్‌లో ఉంటున్నారు. గత వారం నిర్వహించిన పరీక్షల్లో నెగిటివ్ రాగా.. వారం తరువాత నిర్వహించిన పరీక్షల్లో మంత్రికి పాజిటివ్ వచ్చింది.
తబ్లిగి జమాత్ సభ్యులను గుర్తించడం కోసం ముంబ్రాకు ఓ సీనియర్ పోలీసు అధికారి వెళ్లాడు. అక్కడ 13 మంది బంగ్లాదేశీయులను, 8 మంది మలేషియాకు చెందినవారిని అదుపులోకి తీసుకున్నారు. అయితే వారికి పరీక్షలు చేస్తే కరోనా నెగిటివ్ వచ్చింది. కాగా.. ఆ సమయంలో ముంబ్రాకు చెందిన స్థానికులతో పోలీసు అధికారి ఇంటరాక్ట్ అయ్యారు. అప్పుడే ఆ పోలీస్ అధికారికి వైరస్ సోకిందని బావిస్తున్నారు. తర్వాత పోలీసు అధికారి మంత్రి జితేంద్రతో సమావేశమై.. పరిస్థితిని వివరించారు. ఈ క్రమంలో వైరస్ మంత్రికి వ్యాపించిందనే అనుమానాలు ఉన్నాయి. కాగా.. ఆ పోలీస్ అధికారికి నిర్వహించిన పరీక్షల్లో కరోనా పాజిటివ్ వచ్చింది. మంత్రికి పోలీస్ అధికారికి కరోనా పాజిటివ్ రావడంతో.. వారితో ఇంటరాక్ట్ అయిన వారిందరికి కరోనా పరీక్షలు నిర్వహించారు.