'మహా' సంక్షోభం కంటిన్యూ.. కుదరని ఒప్పందం

By న్యూస్‌మీటర్ తెలుగు  Published on  2 Nov 2019 12:42 PM GMT
మహా సంక్షోభం కంటిన్యూ.. కుదరని ఒప్పందం

మహా సంక్షోభం కంటిన్యూ అవుతోంది. బీజేపీ-శివసేన మధ్య రాజీ కుదరడం లేదు. ఇరు పార్టీల నాయకుల వివాదాస్పద వ్యాఖ్యలతో ప్రభుత్వ ఏర్పాటుపై పీటముడి మరింత బిగుసుకుంటోంది. తాజాగా బీజేపీ నాయకుడు సుధీర్ ముంగంటివర్ సంచలన వ్యాఖ్యలు చేశారు. ఈనెల 7లోపు ప్రభుత్వాన్ని ఏర్పాటు చేయలేకపోతే రాష్ట్రంలో రాష్ట్రపతి పాలన తప్పదన్నారు. ఈ వ్యాఖ్యలపై శివసేన తీవ్ర స్థాయిలో మండిపడింది. రాష్ట్రపతి ఏమైనా మీ జేబు లో ఉన్నారా అని కమలదళాన్ని ఘాటుగా ప్రశ్నించింది. మద్దతు కోసం ఎమ్మెల్యేలను బెదిరించడం సరి కాదని హెచ్చరించింది. రాష్ట్రపతి, గవర్నర్ అధికారాలను దుర్వినియోగం చేస్తే ప్రజాస్వామ్యానికే ప్రమాదమని హితవు పలికింది. రాష్ట్రపతి పాలన పేరుతో అధికారంలోకి రావాలని ఆశపడితే మహారాష్ట్ర ప్రజలు సహించబోరని శివసేన నాయకు డు సంజయ్ రౌత్ పేర్కొన్నారు. ఇప్పటివరకు చాలా ఓపికపట్టామని, ఇక వేచి చూసే ధోరణికి త్వరలోనే గుడ్ బై చెబుతామని హెచ్చరించారు. ఐతే, కూటమిగా ఎన్నికల్లో కలసి పోటీ చేసినందున కూటమి ధర్మాన్ని పాటి స్తామన్నారు.

ఇక, మహారాష్ట్ర పరిణామాలను కాంగ్రెస్, ఎన్సీపీ నిశితంగా పరిశీలిస్తున్నాయి. ఎన్సీపీ చీఫ్ శరద్ పవార్, కాంగ్రెస్ అధినేత్రి సోనియాగాంధీతో మాట్లాడారు. మహారాష్ట్ర పరిస్థితులు, బీజేపీ-శివసేన మ ధ్య గొడవలు సహా వివిధ అంశాలపై చర్చించారు. ఇక, కాంగ్రెస్ ఎంపీ హుస్సేన్ దల్వాయ్, సోనియాగాంధీకి లేఖ రాశారు. శివసేనకు మద్దతు ఇచ్చే అంశాన్ని పరిశీలించాలని కోరారు. ఈ లేఖపై శివసేన హర్షం వ్యక్తం చేసింది. అన్ని పార్టీలతో తాము టచ్‌లో ఉన్నామని పునరుద్ఘాటించింది. మరోవైపు, శివసేనతో తాము ఎలాంటి సంప్రదింపులు జరపలేదని శరద్ పవార్ పేర్కొన్నారు. ఉద్ధవ్ ఠాక్రేతో తాను సమావేశమం అయ్యాయనే వార్తలను ఆయన ఖండించారు. శివసేన నుంచి ఎలాంటి ప్రతిపాద న రాలేదన్న పవార్, ప్రధాని మోదీ, బీజేపీ చీఫ్ అమిత్ షాలను కూడా తాను కలవలేదన్నారు. రాష్ట్రంలో స్థిర ప్రభుత్వం ఏర్పడకపోతే శాంతి భద్రతలకు విఘాతం కలుగుతుందని ఆందోళన వ్యక్తం చేశారు. మరో వారం-పది రోజుల్లో అనిశ్చితి తొలగిపోతుందని ఆశాభావం వ్యక్తం చేశారు. ప్రజలు బీజేపీ-శివసేన కూటమికే మెజార్టీ కట్టబెట్టారని పవార్ గుర్తు చేశారు. తాము ప్రతిపక్షంలోనే కూర్చుంటా మని తేల్చి చెప్పారు.

Next Story